ఈ మీడియా సంస్థ కోసం వైసిపి వెర్సెస్ టిడిపి

రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ తొలి శాటిలైట్ ఛానెల్ గా ఏపీ 24/7 ఛానెల్ ని కరోనా కష్టాలు వెంటాడాయి. రాష్ట్రంలో క్షత్రియ సామాజికవర్గం నెలకొల్పిన [more]

Update: 2020-12-14 09:30 GMT

రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ తొలి శాటిలైట్ ఛానెల్ గా ఏపీ 24/7 ఛానెల్ ని కరోనా కష్టాలు వెంటాడాయి. రాష్ట్రంలో క్షత్రియ సామాజికవర్గం నెలకొల్పిన తొలి ఛానెల్ కూడా ఇదే. కమ్మ, రెడ్డి, కాపు సామాజికవర్గాలకు సైతం ఇంతకుముందే బలమైన మీడియా వుంది. నిర్వహణ భారం డైరెక్టర్ల నడుమ విభేదాలు రావడంతో చక్కగా నడుస్తున్న ఛానెల్ ను యాజమాన్యం మూసేయాలిసి రావడంతో వందలాదిమంది దీనిపై ఆధారపడ్డ వారంతా రోడ్డున పడ్డారు. క్రేజ్ ఉన్న ఛానెల్ ఇలా అకస్మాత్తుగా షట్టర్ దించేసినా ఇది టేకోవర్ చేసేందుకు మాత్రం కొనుగోలుదారుల నడుమ పోటీ ఆసక్తికరంగా మారిందని మీడియా వర్గాల టాక్. ఇది తొందరగా ఒక కొలిక్కి వస్తే కష్టకాలం లో గట్టెక్కుతామని కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

విజయసాయి ముందుకు వచ్చి వెనక్కి …

ప్రతి పార్టీకి ఇప్పుడు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సొంత మీడియా అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి అవసరమైనన్ని ఛానెల్స్, పత్రికలు, వెబ్ మీడియా ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎపి 24/7 ను టేక్ ఓవర్ చేయాలని రాజ్యసభ సభ్యుడు ముఖ్యమంత్రి కి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. అయితే సాక్షి ఛానెల్ కి పోటీగా విజయ సాయి సొంత ఛానెల్ పెట్టారని సొంత పార్టీలోనే ప్రచారం జరిగే ప్రమాదం గుర్తించి ఆయన వెనక్కి తగ్గరంటున్నారు.

రంగంలోకి చెవిరెడ్డి… ?

వైఎస్ జగన్ కి మరో అత్యంత సన్నిహితుడైన ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి రంగంలోకి దిగారంటున్నారు. వైసిపి కి పూర్తి ఏకపక్షంగా సాక్షి ఛానెల్ తప్ప మరేమి లేవని పార్టీ వాయిస్ గట్టిగా వినిపించే మరో ఛానెల్ కూడా ఉండాలని చెవిరెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. మీడియా టైగర్ అయిన చెవిరెడ్డి దీనిపై తన బృందంతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

గతంలో లోకేష్ …

టిడిపి హయాంలో ప్రారంభమైన ఎపి 24/7 నాటి అధికారపార్టీకి అనుకూలంగానే సాగింది. అప్పట్లో నారా లోకేష్ ఎన్నారై ల చేత ఛానెల్ టేకోవర్ చేయాలని ప్రయత్నం చేసినా యధావిధిగా డైరెక్టర్ల నడుమ భేదాభిప్రాయాలు టిడిపి ఖాతాలోకి మరో ఛానెల్ వెళ్లకుండా చేశాయి. జగన్ సర్కార్ ఏర్పడ్డాక ప్రస్తుత అధికారపార్టీ అనుకూల వైఖరినే ఏపీ 24/7 అనుసరించినా ప్రభుత్వం నుంచి రావలిసిన ప్రకటనల రెవెన్యూ రెండు కోట్ల రూపాయలు అలాగే బకాయి ఉండిపోయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థను టేకోవర్ చేసేవారు అధికారపార్టీ వారు అయితే పాత బకాయిలు సైతం వసూలు అయ్యే అవకాశం ఉండటం తో ఆ దిశగా కూడా ప్రయత్నాలు ఉపందుకున్నాయని తెలుస్తుంది. గతంలో మా టివి ని సమర్ధవంతంగా నడిపిన మురళి కృష్ణం రాజు ఉండగా ఎపి 24 గట్టెక్కుతుందనే అంతా ఆశగా ఎదురు చూశారు. అయితే ఆయన కూడా చేతులు ఎత్తేయడంతో సంస్థ భవిష్యత్తు ఎటువైపు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. తమ సామాజికవర్గం ఏర్పాటు చేసిన ఛానెల్ ఈ స్థితికి చేరుకోవడంతో క్షత్రియ సామాజికవర్గం లో కూడా ఆవేదన నెలకొంది. రాజకీయంగా తమ సామాజికవర్గ ఎదుగుదలకు దోహదం చేస్తుందని భావించామని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News