‘దిశ మారేనా... ‘దశ’ తిరిగేనా?..

Update: 2018-12-10 16:30 GMT

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా హస్తిన కేంద్రంగా సాగుతున్న రాజకీయ కసరత్తు తొలి అంకంలో ప్రవేశించింది. గతంలో కాంగ్రెసు నేతృత్వంలో నడిచిన యూపీఏకు విస్తరణ రూపంగా దీనిని చూడాల్సి ఉంటుంది. కొత్తగా చేరిన తెలుగుదేశం పార్టీని మినహాయిస్తే మిగిలిన పక్షాలన్నీ ఏదో ఒక రూపంలో ఈ కూటమిలో భాగస్వామ్యం వహించినవే. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఒక వ్యత్యాసం మాత్రం కనిపిస్తోంది. యూపీఏ రెండు సార్లు కేంద్రప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు కాంగ్రెసు పెద్దన్న పాత్ర పోషించింది. మొదటి సారి 2004 లో ఎన్నికైనప్పుడు కొంత సంయమనం పాటించి అందర్నీ కలుపుకుని పోయే ధోరణిని ప్రదర్శించింది. రానురాను ఆపార్టీ స్వతస్సిద్ధమైన పెత్తందారీ వైఖరికి వెళ్లిపోయింది. 2009 ఎన్నిక తర్వాత కాంగ్రెసు చెప్పినట్లు నడుచుకోవాల్సిన రాజకీయ అనివార్యత యూపీఏలోని మిగిలిన పార్టీలకు ఏర్పడింది. కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ సర్దుకుపోక తప్పని పరిస్థితి తలెత్తింది. సీబీఐ , ఇన్ కమ్ టాక్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి విభాగాలు కేంద్రం అధీనంలో ఉండటంతో మిత్ర పక్షాలు సైతం అదుపాజ్ణల్లోనే ఉంటూ వచ్చాయి. ఇప్పుడు రాజకీయవాతావరణం పూర్తి రివర్స్ లోకి వెళ్లిపోయింది. కాంగ్రెసు గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. బీజేపీ మహాబలునిగా రూపుదాల్చింది. అన్ని పార్టీలు కలిసి నడిస్తే తప్ప పోటీనివ్వలేని వాతావరణం నెలకొంది. ఈ స్థితిలో కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు దిశగా తొలి సమావేశం జరిగింది. వామపక్షాలూ ఇందులో భాగం కావడం విశేషం.

ఫలితాలకు ముందే...

అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు రావడానికి ఒకరోజు ముందు ఈ సమావేశం సాగడం యాధృచ్ఛికం కాదు. ఉద్దేశపూర్వకం. వ్యూహాత్మకం. అందులోనూ ఈ తెలివితేటలు చంద్రబాబువే అని చెప్పాలి. కాంగ్రెసు పార్టీ మిత్రుల కోసం గత కొంతకాలంగా వెంపర్లాడుతోంది. ప్రత్యేకించి దక్షిణాదిన గతంలో ఉన్న హవా పూర్తిగా క్షీణించింది. పశ్చిమబంగ వంటి పెద్ద రాష్ట్రాల్లోనూ పట్టు చిక్కడం లేదు. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలకు నీళ్లొదులుకుని చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకమైనవి. కాంగ్రెసు పార్టీకి కొంతమేరకు ఊపిరిపోసుకునేందుకు వీలు కల్పించే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే తిరిగి పుంజుకోగలుగుతుంది. పార్టీ ప్రాబల్యం, ప్రాచుర్యం పెరుగుతుంది. అదే జరిగితే ఇప్పుడున్నంత సాఫ్ట్ కార్నర్ తో మిత్రులతో వ్యవహరించకపోవచ్చు. నిజానికి కాంగ్రెసు పార్టీకి ప్రాంతీయపార్టీల అవసరం చాలా ఉంది. అదే సమయంలో ప్రాంతీయపార్టీలకూ కాంగ్రెసుతో అంతే అవసరం ఉంది. తృణమూల్ కాంగ్రెసు విషయాన్ని తీసుకుంటే పశ్చిమబంగలో బీజేపీ సొంతంగా బలపడటానికి చాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెసుతో పోలిస్తే కమలం పార్టీ విస్తరణ వాదం చాలా నియంత్రుత్వంతో ఉంటుంది. దీనిని నిరోధించాలంటే కాంగ్రెసు అండ అవసరం. అదే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కోరి తగవు పెట్టుకున్న టీడీపీది జాతీయంగా దిక్కుతోచని స్థితి. కాంగ్రెసు పార్టీ ఆసరా ఇస్తేనే పార్లమెంటులోనూ, జాతీయంగానూ తన మాట చెల్లుతుంది. ప్రస్తుతం కాంగ్రెసు మిగిలిన పార్టీలతో తనను తాను సమానభాగస్వామిగానే చూసుకొంటోంది. అవసరమైతే చంద్రబాబు నాయుడి వంటివారికి కూటమి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకూ సిద్ధంగా ఉంది. దీనిని పక్కాగా నిర్ధరించుకోవాలంటే ఫలితాలకు ముందే నిర్ణయమై పోవాలనే ఆలోచనతోనే ఈ కూటమి సమావేశాన్ని నిర్వహించారు.

పార్లమెంటు వ్యూహం...

2019 ఎన్నికలకు రోడ్డు మ్యాప్ ఖరారు చేసే సమావేశాలుగా ఈసారి పార్లమెంటు సెషన్ ను చూడాలి. ఏ కూటమిలో ఎవరుండబోతున్నారనే అంశం ఈ సమావేశాల్లోనే నిర్ణయమైపోతుంది. ప్రభుత్వ పక్షం , ప్రభుత్వేతర పక్షం పార్టీల విభజన స్పష్టంగా కనిపించబోతోంది. రెండు పక్షాలుగా పోలరైజేషన్ సాగే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాల తర్వాత బడ్జెట్ సెషన్ ఉంటుంది. అయితే అది నామ్ కే వాస్తేగా సాగే అవకాశమే ఎక్కువ. అప్పటికే ఎన్నికల వాతావరణం అలుముకుంటుంది. అందువల్ల రాజకీయ నినాదాలు, ఆందోళనలతో కేవలం ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికే పార్లమెంటు పరిమితం అవుతుంది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకునే క్రమంలోనే 21 పార్టీల సమావేశం జరిగినట్లుగా భావించాలి. ఫ్లోర్ మేనేజ్మెంట్ తో బీజేపీ ఏదేని విషయం వచ్చినప్పుడు విపక్షాలను విభజించి పాలించే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అటువంటి ట్రాప్ లో పడకుండా సంఘటితంగా నడిచేందుకు అనుసరించాల్సిన పద్ధతులను, విధివిధానాలను , సమన్వయాన్ని సాధించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రతిఘటన అంశాలను సైతం అంతా కలిసి రూపొందించుకోవాలనే అవగాహనకు వచ్చారు.

ఎగుడు దిగుడులే...

అయితే అంతా అనుకున్నంత సాఫీగా లేదు. బహుజన సమాజ్, సమాజ్ వాదీ వంటి పెద్ద పార్టీలు ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బహుజనసమాజ్ పార్టీకి ఉత్తరప్రదేశ్ తోపాటు దేశవ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఆదరణ ఉంది. అలాగే సమాజ్ వాదీ పార్టీకి 80సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో బాగా పట్టుంది. ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ ప్రత్యామ్నాయ కూటమిని అధికారంలోకి తీసుకురావడం సాధ్యం కాదు. అలాగే ఒడిసాలో అధికార బీజేడీ వంటి పార్టీలనూ కలుపుకుని పోవాల్సి ఉంది. కూటమికి కొత్తపేరుతోపాటు కన్వీనర్, ఛైర్మన్ వంటి పదవులనూ నిర్ణయించాలి. వారి మాట పట్ల కూటమిలోని భాగస్వాములందరికీ గౌరవం ఉండాలి. అదే విధంగా రాజకీయాల్లో స్వచ్ఛమైన రికార్డు ఉన్న నితీశ్ వంటి వారిని భాగస్వామిగా తెచ్చుకోగలిగితే అనుకున్న ప్రయోజనం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News