ఫిరాయింపుల కంపు ఎవరిది..?

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారత్ లో ఫిరాయింపులు యధేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి దూకడం. అది [more]

Update: 2019-08-31 05:00 GMT

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారత్ లో ఫిరాయింపులు యధేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి దూకడం. అది కూడా గర్వంగా చెప్పుకోవడం, టికెట్ ఇచ్చి శ్రమకోర్చి గెలిపించిన పార్టీ అధినేతనే దారుణంగా అవమానించి తిట్ల పురాణం లంకించుకోవడం అంతా చూస్తూనే ఉన్నారు. ఈ రకమైన పెడధోరణి ఒక్క భారత్ లోనే జరుగుతుందేమో. గత అయిదేళ్ళలో ఏపీలో అంతా చూశారు, వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తమ వైపు లాక్కుంది. కండువాలు కప్పి మరీ సాదరంగా మంత్రి పదవులు కట్టబెట్టింది. ఆ తరువాత ఏమైంది సాధారణ ఎన్నికల్లో జనాలు వారిని దారుణంగా ఓడించేశారు. అంటే జనాలకు ఇది నచ్చదని తెలుసు, అయినా ఉన్న అయిదేళ్ళలో అధికారం అనుభవిద్దామన్న యావతోనే ఈ రకమైన తెగింపునకు సిధ్ధపడుతున్నారనుకోవాలి.

తమ్మినేని హాట్ కామెంట్స్……

ఇక ఫిరాయింపులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. అటువంటివి ప్రజాస్వామ్యానికి మంచివి కావని ఆయన అన్నారు. ఏపీలో కొత్తగా వచ్చిన వైసీపీ సర్కార్ వాటిని ప్రోత్సహించదని కూడా ఆయన గట్టిగా చెప్పారు. అంతటితో ఆగకుండా ఆయన ఇటీవల నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్ళి విలీనం అని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. అది పూర్తిగా ఫిరాయింపే అన్నారు. అలా చేయడం దారుణమని కూడా అనేశారు. అంటే ఓ విధంగా రాజ్యస‌భ చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయాన్నే తమ్మినేని ప్రశ్నించారనుకోవాలి. వెంకయ్యనాయుడు ఏపీకి చెందిన సీనియర్ నేత. ఆయన సైతం ఫిరాయింపులపైన ఎన్నో నీతి సూత్రాలు చెప్పిన వారే. మరి అటువంటి ఆయన టీడీపీ బీజేపీలో విలీనం అని ఎలా చేశారో రాజకీయ మేధావులకు, రాజ్యాంగ నిపుణులకు కూడా ఇప్పటికీ ధర్మ సందేహమే.

వివరణ ఇచ్చారా…?

దాని మీద వెంకయ్యనాయుడుకు కూడా కొంత ఇబ్బందిగా ఉందనిపించిందేమో తన ఏపీ పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఫిరాయింపుల విషయం అన్నది రాజ్యాంగంలోనే అస్పష్టంగా నిర్వచించారని చెప్పుకొచ్చారు. ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏది విలీనం, ఏది కాదు అన్నది విపులంగా వివరించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి చూస్తూంటే రాజ్యాంగంలోనే ఫిరాయింపులకు సంబంధించి కీలకమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందేమోననిపిస్తోంది. అది అవసరం కూడా. ప్రజల తీర్పు వమ్ము అయిపోతున్నపుడు, ఓటుకు ద్రోహం తలపెడుతున్నపుడు రాజ్యాంగాన్ని సవరించి అయినా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట రిగ్గింగ్ జరుగుతోందంటేనే ఆ ఎన్నికను ఆపించి తిరిగి రీపోలింగ్ చేసే వ్యవస్థలో ఏకంగా మొత్తం జనాభిప్రాయాన్నే తారుమారు చేసి ఫిరాయింపులకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధమే ఉండదు మరి.

Tags:    

Similar News