అవే ఆక్సిజన్ ఇస్తాయా…?

ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు లోక్ సభ ఎన్నికలకన్నా అసెంబ్లీ ఉప ఎన్నికలే ఆక్సిజన్ ఇవ్వనున్నాయి. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఎవరు గెలుచుకున్నా రాష్ట్రంలో అధికారంలోకి [more]

Update: 2019-03-10 17:30 GMT

ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు లోక్ సభ ఎన్నికలకన్నా అసెంబ్లీ ఉప ఎన్నికలే ఆక్సిజన్ ఇవ్వనున్నాయి. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఎవరు గెలుచుకున్నా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముంది. 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం, మరో రెండున్నరేళ్లు అధికారం ఉండటంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఉప ఎన్నికలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. అందుకే లోక్ సభ ఎన్నికల్లో మిత్రులకు సీట్లు కేటాయించే విషయంలో కొంత పట్టు విడుపును ప్రదర్శించినట్లు కన్పించాయి.

మిత్రులకు పంపిణీ ఎడా పెడా…..

మొత్తం 40 లోక్ సభ స్థానాలున్న తమిళనాడులో డీఎంకే దాదాపు ఇరవై లోక్ సభ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు సిద్ధమయింది. అలాగే అన్నాడీఏంకే కూడా మెగా కూటమిని ఏర్పాటు చేసుకుని భారీగానే సీట్లను మిత్రులకు పంపిణీ చేసింది. గత ఎన్నికల్లో నలభై సీట్లకు గాను 37 స్థానాలను కైవసం చేసుకున్న అన్నాడీఎంకే ఈసారి సిట్టింగ్ స్థానాలను పక్కన పెట్టి మరీ మిత్రపక్షాలకు పంచిందంటే అది లోక్ సభ ఎన్నికలపైన అంత సీరియస్ గా లేదనే అర్థమవుతోంది.

ఓట్ల శాతాన్ని లెక్కించుకుని…..

జయలలిత, కరుణానిధిల మరణానంతరం జరుగుతున్న అతి పెద్ద ఎన్నికలు కావడంతో రెండు పార్టీల్లోనూ ఆందోళన కన్పిస్తుంది. నాయకత్వానికి లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. అన్నాడీఎంకే భారతీయ జనతాపార్టీ, పీఎంకే తదితర అన్ని పార్టీలతో కలసి కూటమిని ఏర్పాటు చేసుకుని ముందుగానే రంగంలోకి దిగింది. ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో మాత్రం మిత్రపక్షాలకు సీట్లు కేటాయించే పరిస్థితి లేదన్నది అన్నాడీఎంకే నేతల వాదన. అన్ని సీట్లలోనూ అన్నాడీఎంకే అభ్యర్థులు బరిలో ఉంటారని ఆ పార్టీ సీనియర్ నేతలు పదే పదే చెబుతున్నారు. 2016 ఎన్నికల్లో మిత్రపక్షాలైన పీఎంకే, టీఎంసీ, బీజేపీ, డీఎండీకేలకు 12 శాతం ఓట్లు రావడంతో వీరందరినీ కలుపుకుని ఉప ఎన్నికలను ఎదుర్కొనాలన్న ఉద్దేశ్యంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నారు. డీఎండీకే కూడా త్వరలోనే అన్నాడీఎంకే గూటికి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

స్టాలిన్ సీఎం అవ్వాలంటే……

ఇక డీఎంకే కూడా స్పీడు పెంచింది. లోక్ సభ స్థానాల కంటే ఉప ఎన్నికలే ముఖ్యమన్న ధోరణి ఆ పార్టీలో కన్పిస్తుంది. 21 స్థానాల్లో కనీసం పదిహేను నుంచి పదహారు స్థానాలను దక్కించుకుంటే రాష‌్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ బాధ్యతలను చేపట్టే అవకాశాలుంటాయన్నది ఆ పార్టీ ఆలోచన. అందుకే మిత్రపక్షాలన్నింటితో కలసి లోక్ సభతో పాటు ఉప ఎన్నికలను ఎదుర్కొనాలని స్టాలిన్ నిర్ణయించారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల అభ్యర్థులను కూడా త్వరలోనే ఎంపిక చేయనున్నారు. అందుకోసమే ఈ నెల 11న స్టాలిన్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికార అన్నాడీఎంకే ను ఉప ఎన్నికల్లో ఓడించే లక్ష్యంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద రెండు పార్టీలూ లోక్ సభ ఎన్నికల కంటే ఉప ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కన్పిస్తుంది.

Tags:    

Similar News