పార్టీతో పాటే తాను కూడా బలయిపోతున్నారా?

అన్నా రాంబాబు. ప్రకాశం జిల్లాలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. గ‌తంలో టీడీపీలోను ప్రస్తుతం వైసీపీలోను ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. నిత్యం వివాదాలు, సొంత పార్టీనేత‌ల‌తోనే [more]

Update: 2021-02-11 03:30 GMT

అన్నా రాంబాబు. ప్రకాశం జిల్లాలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. గ‌తంలో టీడీపీలోను ప్రస్తుతం వైసీపీలోను ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. నిత్యం వివాదాలు, సొంత పార్టీనేత‌ల‌తోనే విభేదాలు పెట్టుకుని తీరిక లేని రాజ‌కీయాలు చేసే నాయ‌కుడిగా అన్నా రాంబాబుకు పేరుండ‌డం గ‌మ‌నార్హం. 2009లో ప్రజారాజ్యం పార్టీ త‌ర‌ఫున గిద్దలూరు నియ‌జ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన‌.. రాంబాబు.. ఆ ఎన్నిక‌ల్లో 9 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్రజారాజ్యం కృష్ణా జిల్లా త‌ర్వాత కోస్తాలో ఏ మాత్రం ప్రభావం చూప‌క‌పోయినా గిద్దలూరులో మాత్రం అన్నా రాంబాబు విజ‌యం సాధించ‌డం వెన‌క ఆయ‌న వ్యక్తిగ‌త ఛ‌రిష్మా కూడా ఉంది.

ప్రజారాజ్యం నుంచి….

ఇక‌, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన త‌ర్వాత‌.. కొన్నాళ్లు మౌనంగా ఉన్న అన్నా రాంబాబు టీడీపీలో చేరిపోయారు. అయితే..2014లో టికెట్ ద‌క్కించుకున్నా.. గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. అయితే పార్టీ అధికారంలోనే ఉంది. కానీ, అన్నా రాంబాబు మాత్రం తన‌దే పైచేయి కావాల‌నే ఉద్దేశంతో నిత్యం వివాదాలు.. పార్టీ నేత‌ల‌తో ర‌గ‌డ ప‌డేవారు. దీంతో పార్టీలో అన్నా అంద‌రికీ దూర‌మ‌య్యారు. కొన్ని సంద‌ర్భాల్లో ఏకంగా పార్టీ ఆఫీస్‌లోనే ధ‌ర్నాలు, దీక్షల‌కు దిగిన ‌సంద‌ర్భాలు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవ‌డంతో అన్నా రాంబాబు రగిలిపోయారు. దీంతో గ‌త ఎన్నిక‌ల‌కు యేడాది ముందు వ‌ర‌కు రాంబాబు టీడీపీలో ఉన్నా ఆ పార్టీకి శ‌త్రువుగానే వ్య‌వ‌హ‌రించారు. పార్టీపై తీవ్ర విమ‌ర్శలు చేసి చేసి చివ‌ర‌కు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

మరోసారి వివాదంలోకి….

ఇక‌, వైసీపీలో చేరి.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. పైగా ఏపీలో జ‌గ‌న్ త‌ర్వాత అత్యధిక మెజార్టీ అన్నా రాంబాబుదే. గిద్దలూరులో రాంబాబుకు ఏకంగా 81 వేల ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా. ఇప్పుడు మ‌ళ్లీ వైసీపీ త‌ర‌ఫున కూడా ర‌గ‌డ‌కు దారితీసే ప‌నులే చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల‌ను కూడా ఆయ‌న బెదిరిస్తున్నార‌నే వార్తలు వ‌స్తున్నాయి. తాము కూడా ఓ రూపాయి సంపాదించుకోక‌పోతే మేం ఎక్కడ నుంచి డ‌బ్బులు ద‌బ్బుకు రావాల‌నే క్రమంలో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు చేశారు.

రగిలిపోతుంది అందుకేనా?

ఇటీవ‌ల జ‌న‌సేన కార్యక‌ర్త ఒక‌రు ప్రశ్నించాడ‌నే ఆగ్రహంతో ఆయ‌న‌పై బ‌హిరంగంగానే తిట్ల దండ‌కం అందుకున్నార‌ట‌. దీంతో స‌ద‌రు కార్యక‌ర్త ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడు. అటు అధిష్టానం కూడా అన్నా రాంబాబును ప‌క్కన పెడుతోన్న ప‌రిస్థితే ఉంది. జిల్లాకే చెందిన ఇద్దరు మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూల‌పు సురేష్ ఇద్దరూ అన్నా రాంబాబును లైట్ తీస్కోవ‌డంతో ఆయ‌న వారిద్దరిపై… ముఖ్యంగా బాలినేనిపై గ‌రంగ‌రంగా ఉన్నారు. చివ‌ర‌కు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో నామినేటెడ్ పోస్టులు కూడా ఆయ‌న‌కు చెప్పకుండానే ఆయ‌న వ్యతిరేకించే వాళ్లకు ఇచ్చేస్తుండ‌డంతో అన్నా రాంబాబు మ‌రింత‌గా ర‌గిలిపోతున్నారు. అన్నా రాంబాబు పార్టీలో ఇష్టమైతే ఉంటారు.. లేక‌పోతే గిద్దలూరు మ‌రో సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ను తీసుకొచ్చు కుందాంలే ? అన్న ధోర‌ణితో పార్టీ నాయ‌క‌త్వం ఉంది. వైసీపీలో పార్టీ నేత‌ల‌తోనూ ఆయ‌న క‌ల‌వ‌డం లేదు. త‌న‌కంటూ.. ప్రత్యేక వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అన్నా రాంబాబుతో ఏం ఉప‌యోగం అన్నా.. అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

Tags:    

Similar News