అన్నా రాంబాబు ఎక్కడున్నా.. ఇంతేనా…?

అన్నా రాంబాబు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. జిల్లాలోనే కాకుండా.. త‌న రాజ‌కీయ జిత్తుల‌తో రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అయ్యారు. ఇప్పటికి మూడు పార్టీలు [more]

Update: 2020-10-18 02:00 GMT

అన్నా రాంబాబు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. జిల్లాలోనే కాకుండా.. త‌న రాజ‌కీయ జిత్తుల‌తో రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అయ్యారు. ఇప్పటికి మూడు పార్టీలు మార్చిన ఆయ‌న ఏ ఒక్కపార్టీలోనూ మంచి మార్కులు త‌న ఖాతాలో వేసుకోలేక పోయార‌నే విమ‌ర్శలు ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ త‌ర‌ఫున 2009లో గిద్దలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత కాంగ్రెస్ వ‌యా టీడీపీలో చేరారు. 2014లో ఈ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే, పార్టీలో అస‌మ్మతి నేత‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. పార్టీ విధానాల‌ను, పార్టీ అధినేత‌ను ఆయ‌న తీవ్రంగా విమ‌ర్శించిన సంద‌ర్భాలు ఉన్నాయి.

ప్రభుత్వంపై విమర్శలు…..

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలోనూ అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా కూడా ఆయ‌నకుపేరు లేకపోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన ఆయ‌న టికెట్ సంపాయించుకుని భారీ మెజారిటీతో విజ‌యం సాదించారు. ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ర్వాత అన్నా రాంబాబుదే అత్యధిక మెజార్టీ. అయితే, ఇక్కడ కూడా ఆయ‌న త‌న గ‌త వైఖ‌రిని విడ‌నాడడం లేద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. స్వప‌క్షంలోనే విప‌క్షం మాదిరిగా ఆయ‌న వ్యవ‌హ‌రిస్తున్న తీరుపై నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. అభివృద్ధి క‌న్నా కూడా వివాదాస్పద రాజ‌కీయాలు చేయ‌డం ఆయ‌న‌కు ఆన‌వాయితీగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వంపై ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు.

వాలంటీర్ వ్యవస్థపై కూడా…..

వాస్తవానికి వైసీపీలో పుట్టి పెరిగిన నాయ‌కులు కూడా ప్రభుత్వంపై ప‌న్నెత్తు మాట అన‌డం లేదు. కానీ, అన్నా రాంబాబు మాత్రం దూకుడుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అంద‌రికీ అంద‌డం లేద‌ని కొన్నాళ్ల కింద‌ట తీవ్ర విమ‌ర్శలు చేసిన అన్నా రాంబాబు తాజాగా సీఎం జ‌గ‌న్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ‌లంటీర్ వ్యవ‌స్థపై విమ‌ర్శలు గుప్పించారు. ఈ వ్యవ‌స్థ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ప్రజ‌లకు ఇబ్బందులు త‌ప్పలేద‌ని, వారు ప్రభుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నార‌ని, దీని వ‌ల్ల ఉప‌యోగం ఏంట‌ని ఆయ‌న ప్రశ్నించ‌డం.. తాజాగా వైసీపీలో చ‌ర్చకు వ‌చ్చింది.

జగన్ మెచ్చుకున్న……

నిజానికి ఈ వ‌లంటీర్ వ్యవ‌స్థను అనేక రాష్ట్రాలు అభినందించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని అధ్యయ‌నం చేసింది. రాజ‌కీయ కార‌ణాల‌తో దీనిని మెచ్చుకొని ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, ప్రజ‌లు మాత్రం వ‌లంటీర్ వ్యవ‌స్థను కొనియాడుతున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంపై అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. వ‌లంటీర్ వ్యవ‌స్థ వ‌చ్చాక ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌కు ప్రాధాన్యత త‌గ్గుతుంద‌న్న అస‌హ‌నంతోనే ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేసిన‌ట్టు టాక్‌. ఓ వైపు ఈ వ్యవ‌స్థ ఏర్పాటు అయ్యి యేడాది అయిన సంద‌ర్భంలో సీఎం స్థాయి నుంచి కింది స్థాయి నేత‌ల వ‌ర‌కు అంద‌రూ సంబ‌రాలు చేస్తుంటే ఇదే స‌మ‌యంలో అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. పార్టీలో ఆయ‌న‌పై చ‌ర్యలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా అన్నా రాంబాబు ధోర‌ణిపై పార్టీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చలు న‌డుస్తున్నాయి.

Tags:    

Similar News