అదే జరిగితే… కుంభస్థలాన్ని కొట్టినట్లేగా

తమిళనాట అన్నాడీఎంకేను ఎంజీ రామచంద్రన్ ను స్థాపిస్తే జయలలిత దానిని తీర్చిదిద్దారు. నిజానికి తమిళనాట కుగ్రామంలోనూ అన్నాడీఎంకే క్యాడర్ ఉందంటే అది అమ్మగా పిలుచుకునే జయలలిత పుణ్యమేనని [more]

Update: 2020-02-27 17:30 GMT

తమిళనాట అన్నాడీఎంకేను ఎంజీ రామచంద్రన్ ను స్థాపిస్తే జయలలిత దానిని తీర్చిదిద్దారు. నిజానికి తమిళనాట కుగ్రామంలోనూ అన్నాడీఎంకే క్యాడర్ ఉందంటే అది అమ్మగా పిలుచుకునే జయలలిత పుణ్యమేనని చెప్పాలి. జయలలిత పథకాలు, తీసుకున్న నిర్ణయాలు అన్నాడీఎంకేను అనేకసార్లు అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడు జయలలిత లేరు. ఆ తర్వాత వచ్చిన పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీని నడిపించే బాధ్యతను భుజానకెత్తుకున్నారు.

అధికారంలో ఉండటంతో…

గత మూడేళ్లగా తమిళనాడులో అన్నాడీఎంకే పాలన సజావుగానే సాగుతుందని చెప్పుకోవాలి. ఎటువంటి అసంతృప్తులు లేవు. రాజీనామాలు లేవు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు. పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం, దాని నుంచి బయటపడటం జరిగిపోయాయి. అన్నాడీఎంకే నిట్టునిలువునా చీలిపోతుందని రెండున్నరేళ్ల క్రితమే డీఎంకే అధినేత స్టాలిన్ పెద్ద ఆశలు పెట్టుకున్నారు. కానీ స్టాలిన్ ఆశలు నెరవేరలేదు.

బలమైన క్యాడర్..ఓటు బ్యాంకు….

ఇక వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించిందంటే హ్యాట్రిక్ కొట్టినట్లే. అయితే ఇప్పుడు అన్నాడీఎంకేకు సారథ్యం వహిస్తున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు ఆ సమర్థత ఉందా? అన్నది సందేహమే. బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న పార్టీ కావడంతో కథ నడిపేద్దామనుకుని ఇద్దరూ భావించినా అది ఆచరణ సాధ్యమేనా? అన్న అనుమానాలు పార్టీలోనే ఉన్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికలలో కూటమితో పోటీ చేసి ఘోర ఓటమి పాలయిన అన్నాడీఎంకే ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కొంత మేర విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ డీఎంకేతో పోటీగా స్థానాలను సాధించింది. దీంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది.

అంత సులువేనా?

అయితే జయలలిత ఉన్నప్పుడు అంత సులువు కాదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి ప్రచారం వరకూ జయలలిత మాట చెల్లుబాటయ్యేది. నేత కట్టుబాటు దాడే వాడు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు సమిష్టిగా పనిచేసినా ఓటు బ్యాంకును రక్షించుకోగలుగుతారా? లేదా? అన్నది ప్రశ్న. అందుకోసమే ఇద్దరూ కలసి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు అభ్యర్థులను డిసైడ్ చేయాలని నిశ్చయించారు. మొత్తం మీద ఈ జోడీ తమ మీద నమ్మకంతో కార్యరంగంలోకి దిగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News