ఇక ప్యాకప్ తప్పదా…!!

అన్ని ఎన్నికలూ ముగిసిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలే ముందున్నాయి. ఆ తర్వాత ఇక 2021లో అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తం కావాలి. అయితే తమిళనాట ప్రస్తుతం పరిస్థితిని చూస్తే [more]

Update: 2019-06-09 17:30 GMT

అన్ని ఎన్నికలూ ముగిసిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలే ముందున్నాయి. ఆ తర్వాత ఇక 2021లో అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తం కావాలి. అయితే తమిళనాట ప్రస్తుతం పరిస్థితిని చూస్తే అధికార అన్నాడీఎంకే కోలుకోలేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పక తప్పదు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు ప్రజల్లో అన్నాడీఎంకేకు, రెండాకుల గుర్తుకు కాలం చెల్లినట్లే కన్పిస్తుంది.

నాయకత్వ లోపమేనా…?

ఆర్కే నగర్ ఉప ఎన్నికతో ప్రారంభమయిన అన్నాడీఎంకే పతనం లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికలతో మరింత దిగజారిపోయిందనే చెప్పాలి. వన్ సైడ్ గా డీఎంకేకు అనుకూల ఫలితాలు రావడం ఆ పార్టీ నేతలను ఆలోచనలో పడేసింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే కు యాభై శాతం ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 30శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం పుదుచ్చేరితో కలిపి 40 పార్లమెంటు స్థానాల్లో ఒకే ఒక స్థానంలో అన్నాడీఎంకే గెలిచింది.

ఓడిన చోట…..

ఇక ఓడిపోయిన చోట అన్నాడీఎంకే ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోవడం, ఓడిన చోట ఎక్కువ ఓట్లతో, గెలిచిన చోట స్వల్ప మెాజరిటీలతో గెలవడం ఆ పార్టీనేతలను ఆలోచనలో పడేసింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఓడిన చోట స్వల్ప ఓట్లతో ఓటమి పాలు కావడం విశేషం. దీన్ని బట్టి అన్నాడీఎంకేను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదన్నది ఫలితాలను చూస్తే అర్థమవుతుంది.

ఇతర పార్టీలవైపు….

ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గెలిచి గట్టెక్కగలమా? అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కన్పిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండటం, పార్టీ అధికారంలో ఉండటంతో ప్రస్తుతానిక అన్నాడీఎంకే నేతలు మౌనంగా ఉన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో ఆయన నాయకత్వంపై గురి కుదిరింది. కొందరు డీఎంకే వైపు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా మరికొందరు రజనీకాంత్ కొత్త పార్టీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద అన్నాడీఎంకే నాయకత్వం ఇదే తరహాలో కొనసాగితే ప్యాకప్ చెప్పక తప్పదు.

Tags:    

Similar News