మరోసారి తప్పు చేశారా?

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే మరోసారి తప్పు చేసిందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలసి నడవడంతో లోక్ సభ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయా? అంటే అవుననే [more]

Update: 2019-12-27 18:29 GMT

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే మరోసారి తప్పు చేసిందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలసి నడవడంతో లోక్ సభ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీతో కలసి కూటమిగా ఏర్పడి పోటీ చేసింది. కానీ లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. అదీ పన్నీర్ సెల్వం కుమారుడు రాఘవేంద్ర తేని నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీంతో తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి ఫెయిలయిందనే చెప్పాలి.

ఒంటరిగా పోటీ చేసి…..

తర్వాత జరిగిన శాసనసభ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేసి గెలుచుకుంది. నాంగునేరి, విక్రంవాడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి ప్రతిపక్ష డీఎంకే నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలు అన్నాడీఎంకే కు ఊపిరి పోశాయనే చెప్పాలి. అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల గోదాలోకి దూకింది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తులతో దిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పట్టు దొరుకుతుంది.

బీజేపీతో కలసి….

కానీ ఇప్పడు పరిస్థితులు అనుకూలంగా లేవు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై దేశమంతా బీజేపీని వ్యతిరేకిస్తుంది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుని మరోసారి అన్నాడీఎంకే తప్పు చేసిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అధికార పార్టీకి నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో బీజేపీ నేతలను స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచింది. బీజేపీకి దూరం పాటిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని అన్నాడీఎంకే భావిస్తుంది. మరి పొత్తు పెట్టుకుని తప్పు చేసిందా? లేదా? అన్నది ఈ ఫలితాలతో తేలిపోనుంది.

Tags:    

Similar News