అనీషారెడ్డి ఫ్యూచ‌ర్ అంతవరకేనా?

అనీషా రెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు. టీడీపీలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పిన ఎన్ అమ‌ర్‌నాథ్ రెడ్డి సొంత బంధువు (మ‌ర‌ద‌లు). గ‌త ఏడాది [more]

Update: 2020-10-16 13:30 GMT

అనీషా రెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు. టీడీపీలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పిన ఎన్ అమ‌ర్‌నాథ్ రెడ్డి సొంత బంధువు (మ‌ర‌ద‌లు). గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌ల‌తో పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. ఇప్పుడు పార్టీలో త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం ల‌బించ‌లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నార‌ట‌. నిజ‌మే! పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కొట్టిన పిండి. ఈ విష‌యం తెలిసి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని రాజ‌కీయంగా పెద్దిరెడ్డిని ఏ మాత్రం ఢీ కొట్టే స‌త్తాలేని అనీషా రెడ్డికి కేటాయించారు. అయితే త‌న కుటుంబంలోనే త‌న మ‌ర‌ద‌లు అనీషా టీడీపీ నుంచి పోటీ చేయ‌డం అమ‌ర్‌నాథ్ రెడ్డికి ఎంత మాత్రం ఇష్టం లేద‌ని.. అందుకే ఆయ‌న కూడా ఆమెకు స‌పోర్ట్ చేయ‌లేద‌న్న టాక్ ఉంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె బాగానే ఖ‌ర్చు చేశారు. కొంత మేర‌కు పొలం కూడా అమ్మేసి ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టార‌న్నది వాస్తవం.

గట్టిపోటీ ఇచ్చినా….

ఈ క్రమంలో వైసీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి గ‌ట్టిపోటీ నే ఇచ్చినా.. 68 వేల ఓట్లు మాత్రమే సాధించారు. త‌న ఓట‌మిపై విశ్లేష‌ణలు చేసుకున్న అనీషా రెడ్డి.. ఉద్దేశ పూర్వకంగానే త‌న‌ను ఇక్కడ నుంచి పోటీకి పెట్టార‌ని, తాను ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని చంద్రబాబుకు ముందుగానే తెలుసున‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఇక‌, అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. అయితే, అటు సొంత కుటుంబ ‌స‌భ్యుడు.. అమ‌ర్‌నాథ్‌రెడ్డి నుంచి కానీ, చంద్రబాబు నుంచికానీ.. అనీషా రెడ్డికి మ‌ద్దతు ల‌భించ‌లేదు. దీంతో ఆమె ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క రాజ‌కీయంగా డైల‌మాలో ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో…..

మ‌రోప‌క్క, పెద్ది రెడ్డి దూకుడుతో టీడీపీ కేడ‌ర్ అంతా కూడా వైసీపీ వైపు వెళ్లిపోయింది. ఇప్పుడు అనీషా రెడ్డి కూడా సొంత ప‌నులు చూసుకుంటున్నారు. ఇటీవ‌ల టీడీపీలో పార్లమెంట‌రీ పార్టీ నాయ‌కుల‌ను నియ‌మించిన‌ప్పుడు త‌ర్వాత మ‌హిళా నేత‌ల‌ను నియ‌మించిన‌ప్పుడు కూడా ఆమెకు ప్రాధాన్యం ద‌క్కక‌పోవ‌డంతో కిం క‌ర్తవ్యం అంటూ.. త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు అప్పులు ఉండ‌డంతో పాటు ఇత‌ర‌త్రా ఇబ్బందుల నేప‌థ్యంలో పార్టీ మార్పు అంశంపై కూడా ఆలోచ‌న చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండా మోసే నాయ‌కుడు ఎవ‌రుంటార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఇప్పటికైనా చంద్రబాబు లేదా అమ‌ర్‌నాథ్‌రెడ్డి ఆమెను బుజ్జగించి పార్టీలో ఉండేలా చూస్తారా ? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News