ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారా?

నెల్లూరు వైసీపీ రాజ‌కీయాలు గ‌రంగరంగా మారిపోయాయి. ముఖ్యంగా రెడ్ల సామాజిక వర్గం హ‌వా ఎక్కువ‌గా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు వైసీపీలోని రెడ్లు కూడా త‌మ హ‌వా [more]

Update: 2019-09-02 13:30 GMT

నెల్లూరు వైసీపీ రాజ‌కీయాలు గ‌రంగరంగా మారిపోయాయి. ముఖ్యంగా రెడ్ల సామాజిక వర్గం హ‌వా ఎక్కువ‌గా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు వైసీపీలోని రెడ్లు కూడా త‌మ హ‌వా సాగించుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్క డ నుంచి మంత్రిగా ఉన్నప్పటికీ.. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్ కుమార్ యాద‌వ్‌కు ఇక్కడి రెడ్లు అడుగ‌డుగునా చెక్ పెడుతున్నార‌న్న గుస‌గుస‌లు వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక్కటంటే ఒక్క చోట కూడా టీడీపీ విజ‌యం సాధించ‌లేదు.

మేకపాటికి ఇచ్చినా….

నెల్లూరు ఎంపీ సీటును 1999 త‌ర్వాత టీడీపీ గెలిచింది కూడా లేదు. 2014 ఎన్నిక‌ల్లోనూ జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు 7 చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఇలా వైసీపీ దూసుకు పోయేందుకు రెడ్డి సామాజిక వ‌ర్గం చేసిన కృషి అంతా ఇంతా కాదు. అయితే, కేబినెట్ ఏర్పాటు విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ త‌న‌కు మిత్రుడైన అనిల్‌ కుమార్ యాదవ్ ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. అదే స‌మ‌యంలో రెడ్డి వ‌ర్గాన్ని బుజ్జగించే క్రమంలో మేక‌పాటి గౌతం రెడ్డికి మంత్రి ప‌ద‌విని అప్పగించారు.

అందరికంటే జూనియర్…..

అయితే జిల్లాలో రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలు ఏకంగా ఏడుగురు గెలిచారు. ఎంపీ కూడా ఆ వ‌ర్గం వ్యక్తే. నెల్లూరులో గ‌త కొన్ని ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర చూస్తే పార్టీల‌తో సంబంధం లేకుండా రెడ్ల హ‌వానే న‌డుస్తుంటుంది. ఈ సారి వైసీపీ నుంచి గెలిచిన వారిలో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధన్‌రెడ్డి కూడా మంత్రి ప‌ద‌వులు ఆశించారు. అయితే ఒక రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్ వీరి క‌న్నా జూనియ‌ర్ అయిన అనిల్‌కుమార్ యాదవ్ కు మంత్రి ప‌ద‌విని ఇవ్వడంపై రెడ్డి వ‌ర్గం గుస్సాగానే ఉంది.

టీడీపీలోనూ అంతే…..

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాష్ట్రం మొత్తానికి మంత్రి అయినా కూడా కేవ‌లం నియోజ క‌వ‌ర్గానికి మాత్రమే ప‌రిమితం చేసేలా చూస్తున్నారు. జిల్లాలో రెడ్డి వ‌ర్గం హ‌వానే ఎక్కువ‌గా ఉండాల‌నేది వీరి అభిమ‌తం. గతంలోనూ చంద్రబాబు ప్రభుత్వంలో కాపు వ‌ర్గానికి చెందిన‌ మంత్రి నారాయ‌ణ నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హించినా.. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మంత్రి అయ్యాక టీడీపీ శ్రేణులు కూడా నారాయ‌ణ‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాయి. నారాయ‌ణ సీఆర్డీయే లాంటి వ్యవ‌హారాల్లో ఎంత కీల‌కంగా ఉన్నా జిల్లాలో మాత్రం ఆయ‌న్ను ప‌రిమితం చేసేందుకే ప్రయ‌త్నాలు జ‌రిగేవి. ఈ ఫార్ములానే ఇప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా పాటిస్తున్నారు.

వైసీపీ నేతలే పరోక్షంగా…..

ఇక్కడ నుంచి గౌతంరెడ్డి మంత్రిగా ఉండ‌డంతో త‌మ స‌మ‌స్యల‌ను ఆయ‌న‌కే చెప్పుకొంటున్నారు. అనిల్ ఏ ప్రక‌ట‌న‌లు చేసినా.. ఆయ‌న‌ను లైట్‌గానే తీసుకుంటున్నారు. ఆయ‌న‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పైగా సోష‌ల్ మీడియాలో వైసీపీ నాయ‌కులే ప‌రోక్షంగా అనిల్‌ కుమార్ పై వ్యతిరేక క‌థ‌నాలు రాయిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుండడం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. నెల్లూరు రెడ్డి సామాజిక వర్గం నేతలు త‌మ హ‌వానే సాగాల‌ని కోరుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి దీనిని త‌ట్టుకుని అనిల్‌ కుమార్ యాదవ్ ను ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. అయినా .. మంత్రి ప‌ద‌వి రెండున్నరేళ్లేన‌ని జ‌గ‌న్ ఇప్పటికే చెప్పిన నేప‌థ్యంలో ఎప్పుడెప్పుడు రెండున్నరేళ్లు గ‌డుస్తాయా? అని ఇక్కడి రెడ్లు ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News