అనీల్ కుమార్ యాదవ్ దూకుడుకి కళ్లెం వేస్తారా..?

ఈసారి నెల్లూరు సిటీ నియోజ‌క‌వర్గానికి ఎలాగైనా త‌న ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ వ‌స్తోంది. ఆ మాటకొస్తే వైసీపీ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. [more]

Update: 2019-02-07 04:30 GMT

ఈసారి నెల్లూరు సిటీ నియోజ‌క‌వర్గానికి ఎలాగైనా త‌న ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ వ‌స్తోంది. ఆ మాటకొస్తే వైసీపీ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అనిల్‌కుమార్ యాదవ్‌కు క్లారిటీ ఇస్తూనే అధిష్ఠానం ప్రొత్స‌హిస్తోంది. ఇక 2009లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్థిగా ముంగ‌మూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. నాడు జ‌రిగిన ట్ర‌యాంగిల్ ఫైట్‌లో ఆయ‌న‌కు కేవ‌లం 92 ఓట్ల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిన అనిల్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు క‌మ్యూనిటీ ప‌రంగా కొంత‌ వ‌ర‌కు ప‌ట్టు ఉండ‌డం ప్ల‌స్‌. ఇలా మూడు పార్టీలు నెల్లూరు ప‌ట్ట‌ణ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌య‌భేరి మోగించాలని చూస్తున్నాయి.

మంత్రి నారాయణ రంగప్రవేశం

వాస్త‌వానికి ఒక‌ప్పుడు నెల్లూరు అన్న‌.. నెల్లూరు ప‌ట్ట‌ణ నియోజ‌క‌వ‌ర్గం అన్నా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే ముద్ర‌ప‌డింది. ఒక్క‌సారి హిస్ట‌రీని ప‌రిశీలిస్తే గ‌త ఎనిమిది ద‌శాబ్దాల కాలంలో కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది. ఒక‌సారి వైసీపీ, ఒక‌సారి ప్ర‌జారాజ్యం పార్టీలు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయా పార్టీల అభ్య‌ర్థుల ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు. నెల్లూరు ప‌ట్ట‌ణ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి గెలుపు ప్ర‌భావం మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌పైన ఉంటుంద‌ని యోచిస్తున్నాయి. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపును మూడు పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. అందుకే నెల్లూరు జిల్లా వాసి అయిన మంత్రి నారాయ‌ణ‌ను ఇక్క‌డి నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ పావులు క‌దుపుతోంద‌. ఈ మేర‌కు ఆయ‌న‌కు చంద్ర‌బాబు కూడా మార్గ‌నిర్దేశం చేసిన‌ట్లు తెలుస్తోంది. అందుకే గ‌త ఆరు నెల‌లుగా నిత్యం నెల్లూరు ప‌ట్ట‌ణ పార్టీ నేత‌ల‌కు అందుబాటులో ఉంటున్నార‌ట‌. ప‌ట్ట‌ణంలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూనే… కొన్ని కొత్త మంజూరీలు కూడా తెచ్చుకుని హడావుడి చేస్తూ పార్టీ నేత‌ల్లో ఉత్సాహాం నింపుతున్నారు.

బలమైన అభ్యర్థిగా ఉన్న అనీల్ కుమార్ యాదవ్

ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థిగా నిలిచి గెలిచిన పొలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్‌కే మ‌ళ్లీ టికెట్‌ను ఖ‌రారు చేసింది. ప‌ట్ట‌ణంతో పాటు జిల్లా రాజ‌కీయాల్లోనూ ఆయ‌న చురుకుగా ఉంటూ పార్టీ అధినేత జ‌గ‌న్ విశ్వాసం పొందారు. నిత్యం ప్రజల్లో ఉంటూ బలం పెంచుకున్నారు. దీంతో ఆయ‌న నారాయ‌ణ‌కు పోటీ ఇవ్వ‌గ‌ల‌రు.. గెల‌వ‌గ‌ల‌రు అని అధిష్ఠానం న‌మ్ముతోందంట‌. అందుకే అభ్య‌ర్థి మార్పు ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ ఇక్క‌డ గెలుపొదండంతో జ‌న‌సేన కూడా కచ్చితంగా పోటీ చేయ‌నుంది. సామాజిక వ‌ర్గ ఓట్ల‌ను, ప‌వ‌న్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎక్క‌వగా న‌మ్ముకునేట్లు క‌న‌బ‌డుతోంది. ఇక టీడీపీ, వైసీపీలు బీసీ నేత‌ల‌కు టికెట్లు ఖ‌రారు చేసిన నేప‌థ్యంలో మ‌రి జ‌న‌సేన ఏ సామాజిక వ‌ర్గానికి టికెట్ కేటాయిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా ఇక్క‌డ గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి గెలుపు అంద‌ని ద్రాక్ష‌లాగానే ఉంది. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో అయినా ఇక్క‌డ టీడీపీ జెండా ఎగురుతుందేమో ? చూడాలి.

Tags:    

Similar News