షాడో మినిస్టర్…అనిల్ ఉత్తుత్తికేనా?

ఏపీ ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాల‌కు అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పిన వైసీపీ సీఎం జ‌గ‌న్‌.. అనూహ్యంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు స‌హా బీసీ వ‌ర్గానికి, ఎస్సీ ఎస్టీల‌కు, మైనార్టీల‌కు [more]

Update: 2019-10-09 13:30 GMT

ఏపీ ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాల‌కు అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పిన వైసీపీ సీఎం జ‌గ‌న్‌.. అనూహ్యంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు స‌హా బీసీ వ‌ర్గానికి, ఎస్సీ ఎస్టీల‌కు, మైనార్టీల‌కు కూడా పెద్ద‌పీట వేశారు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఐదుగురు ఎస్సీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే అత్యంత కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ను బీసీ వ‌ర్గానికి చెందిన నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌కు ఇచ్చారు. ఆయ‌న దూకుడు స్వ‌భావం, పార్టీలో అనూహ్య నేప‌థ్యం.. నియోజ‌వ‌క‌ర్గంలో తిరుగులేని ప్ర‌జాద‌ర‌ణ వంటివి అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి.

కీలకమైన శాఖ కావడంతో…

ముఖ్యంగా జ‌గ‌న్‌కు అత్యంత సన్నిహితుడు కావ‌డంతో అనిల్ కుమార్‌కు మంత్రి ప‌ద‌వి సునాయాసంగా తొలి విడ‌త‌లోనే ద‌క్కింది. ప్ర‌స్తుతం ఈ శాఖ రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన విభాగం. పోల‌వ‌రం ప్రాజెక్టు స‌హా అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు, నీటి నిర్వ‌హ‌ణ‌.. తెలంగాణ‌, ఏపీల మధ్య ఉన్న నీటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వంటివి ఈ శాఖ‌కు కీల‌కంగా మారాయి. దీంతో ఈ శాఖ‌ను ప్ర‌తి ఒక్క‌రూ కీల‌కంగా అబ్జ‌ర్వ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, అత్యంత కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ను బీసీ వ‌ర్గానికి కేటాయించ‌డంపై మంత్రి వ‌ర్గంలోని ఓ వ‌ర్గం గుర్రుగా ఉంద‌న్న గుస‌గుస‌లు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాకు చెందిన….

జూనియ‌ర్ అయిన అనిల్‌ కుమార్ యాదవ్ కు ఇంత పెద్ద శాఖ‌ను ఎందుకు అప్ప‌గించారో ? అంటూ .. సీఎం జ‌గ‌న్ సామాజి క వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కులు గుస‌గుస‌ లాడుకుంటున్నారు. అస‌లే దూకుడు స్వ‌భావం ఎక్కువ‌.. ఇలాంటి వాడితో ప‌నులు అయ్యేనా అంటూ.. ఓ మంత్రి ద్వారా త‌మ ప‌నులు చేయించుకునేందుకు ఇష్ట‌ప‌డు తున్నారు. దీంతో స‌ద‌రు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి ఈ శాఖ‌ను కూడా తానే అదుపులో పెట్టుకున్నార‌ని అంటున్నారు.

అన్నీతానే అయి….

ఈ విష‌యం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ బాగా హైలెట్ అవుతోంది. కీల‌క కాంట్రాక్టుల కేటాయింపుల విష‌యాల్లో ఇరిగేష‌న్ శాఖ‌లో ఆ షాడో మినిస్ట‌రే అన్ని తానే న‌డిపిస్తున్నాడ‌ని కూడా అంటున్నారు. మొత్తంగా జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు ఓ షాడో మినిస్ట‌ర్ క‌నుస‌న్న‌ల్లో న‌డిపిస్తున్నార‌ని, ఆయ‌నే అన్ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని అంటున్నారు. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం పైకి చెప్పుకోక‌పోయినా లోప‌ల కాస్తంత అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు. మ‌రి ఇదంతా సీఎం జ‌గ‌న్‌కు తెలిసే జ‌రుగుతుందా ? లేక ఆ షాడో మంత్రి త‌న‌కు తానే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడా ? అన్న‌ది తెలియాలి.

Tags:    

Similar News