మంత్రి గిరీ కృష్ణార్పణమేనా.. ?

అధికారాలు, హోదాలు, రాజసాలు, రాజరికాలు రాజకీయాల్లో గాలిమేడలే. ఎపుడు ఎవరికి కుర్చీ దక్కుతుందో మరెపుడు పోతుందో కూడా అసలు ఊహించడం కష్టం. ఇక మంత్రులని నియమించుకునే అధికారం [more]

Update: 2021-08-23 02:00 GMT

అధికారాలు, హోదాలు, రాజసాలు, రాజరికాలు రాజకీయాల్లో గాలిమేడలే. ఎపుడు ఎవరికి కుర్చీ దక్కుతుందో మరెపుడు పోతుందో కూడా అసలు ఊహించడం కష్టం. ఇక మంత్రులని నియమించుకునే అధికారం పార్లమెంటరీ డెమోక్రసీ సెటప్ లో ప్రధాని, ముఖ్యమంత్రులకు ఉంటుంది. ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తారు. వారు మంత్రులు అయ్యేది లేనిదీ ఆ మీదట అధినాయకుని వద్ద చూపించే పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఏపీలో మరి కొద్ది నెలల్లో మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. దాంతో ఎవరికి కొత్తగా పదవులు వస్తాయి అన్న దాని మీద చర్చతో పాటు, ఎవరికి ఊడుతుంది అన్నది కూడా హాట్ హాట్ డిస్క్షన్ గానే ఉంది.

పరీక్షకు రిమార్కులు…

ఇక నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ కి ఆయన సైతం అనుకోని విధంగా మంత్రి పదవి దక్కింది. అది కూడా అత్యంత కీలకమైన జలవనరుల శాఖ దక్కింది. నిజానికి ఇది పదవి కంటే నెత్తిన బరువు లాంటిదే అని చెప్పాలి. ఒక వైపు పోలవరం ప్రాజెక్ట్ ఏపీ సర్కార్ కి ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇపుడు కొత్తగా కృష్ణా నదీ జలాలపైన పొరుగు రాష్ట్రంతో వివాదం నడుస్తోంది. ఇలా అతి కీలకమైన ఈ శాఖను నిర్వర్తించే విషయంలో అనిల్ బాగా తడబడ్డాడు అని వైసీపీ పెద్దల రిమార్క్. ముఖ్యంగా పోలవరం నిధులను తెచ్చుకునే విషయంలో కేంద్రంతో సరైన తీరులో లాబీయింగ్ చేయలేదు అన్నది ఒక ఆరోపణ. ఇక కృష్ణా జలాల విషయంలో పొరుగు రాష్ట్రం అనేక అభియోగాలు మోపుతూంటే ధీటుగా స్పందించాల్సిన మంత్రి ఎందుకో జారిపోయాడన్నది ప్రభుత్వ పెద్దల అబ్జర్వేషన‌ట.

భక్తుడికే పరీక్ష…

అనిల్ కుమార్ తాను జగన్ భక్తుడిని అని పదే పదే చెప్పుకుంటారు. ఆయన జగన్ మీద ఎవరైనా ఏమైనా అంటే రియాక్ట్ అయ్యే తీరు భీకరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వీర ఫ్యాన్ గా ఆయన ఉండి కూడా జనసేనానికి తూర్పార పట్టిన తీరు ఆయనలోని జగన్ భక్తిని చాటిచెబుతుంది. అయితే అవన్నీ రాజకీయాల్లో లెక్కలు కాదు. ఇక జగన్ ఆయనలో ఏం చూసి నాడు మంత్రి పదవి ఇచ్చారు అంటే యువకుడు, విద్యావంతుడు, సమర్ధుడు అని, పైగా నెల్లూరు లాంటి జిల్లాలో బీసీలకు అమాత్య కుర్చీ ఇచ్చి కొత్త ప్రయోగం చేశారు. కానీ జిల్లాలోనూ అనిల్ కుమార్ మీద సొంత పార్టీలో విమర్శలు ఉన్నాయి. ఇక శాఖాపరంగా కూడా ఆయన తేలిపోయారు అన్నది మరో మాట.

ఉంటే లక్కే …?

ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే అనిల్ కుమార్ కి ఈ తడవ కుర్చీ దక్కదు అనే. ఆయనను కొనసాగించారు అంటేనే అద్భుతమని చెబుతున్నారు. ఆ జిల్లాలో రాజకీయ సామాజిక సమీకరణలు చూసుకున్నా కూడా అనిల్ కుమార్ కుర్చీ ఖాళీ చేయాల్సిందే అంటున్నారు. వచ్చేది ఎన్నికల టీమ్ .దాంతో ఈసారి సీనియర్లకే పెద్ద పీట అని చెబుతున్నారు. ఆ లెక్కన చూసినా కూడా అనిల్ కుమార్ మాజీ మంత్రిగా మిగలకతప్పదు అన్నది వైసీపీలో మాట. మొత్తానికి అనిల్ రెండున్నరేళ్ల పాటు మంత్రిగా అతి కీలకమైన శాఖను పనిచేయడం కూడా గొప్ప విషయమే అంటున్నారు.

Tags:    

Similar News