డిసైడ్ ఎప్పుడు చేస్తారు?

భాషా ప్రయుక్త రాష్త్రాల ప్రాతిపదికన మొదటిసారి ఏర్పడినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి ముందు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. 1915లోనే తెలుగు వారికి ఓ ప్రత్యేక రాష్ట్రం [more]

Update: 2019-09-29 00:30 GMT

భాషా ప్రయుక్త రాష్త్రాల ప్రాతిపదికన మొదటిసారి ఏర్పడినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి ముందు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. 1915లోనే తెలుగు వారికి ఓ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిక పుట్టింది. అది 1953లో సాకారం అయ్యేంతవరకూ అడుగడుగునా అవాంతరాలు అడ్డంకులు చాలా ఏర్పడ్డాయి. చివరకు అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నుకోబడ్డారు. ఆ విధంగా దేశంలో మిగిలిన రాష్ట్రాల ఏర్పాటుకు కూడా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఓ స్పూర్తిగా నిలిచింది. ఇక 1956 నాటికి నాటి హైదరాబాద్ స్టేట్ ని కూడా విలీనం చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. దాంతో అపుడు ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 1వ తేదీగా మారింది. మొత్తం మీద ఏపీ రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆవిర్భావ దినోత్సవాలు, వేడుక‌లు జరగని సందర్భం లేదు.

ఆరేళ్ళుగా అడ్రస్ లేదుగా…?

ఇక అరవయ్యేళ్ల కాపురం తరువాత 2014లో ఉమ్మడి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరోసారి విడిపోయింది. కేవలం పదమూడు జిల్లాలతో ఏర్పడిన రాష్ట్రానికి ఆవిర్భావ‌ దినం ఏది అంటే చెప్పలేని దుస్థితి ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రిగా అనుభవం నిండా కలిగిన చంద్రబాబునాయుడు ఉన్నారు. ఆయన ఏదో ఒక తేదీని అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయిస్తే బాగుండేది. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అయిదేళ్ల పాటు రాజ్యం చేసింది కానీ నవ్యాంధ్రకు పుట్టిన రోజు అంటూ ఒకటి లేకుండా చేసిందన్న బాధ ప్రతి తెలుగువాడిలో ఉంది. ఇక జూన్ 2న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటే ఏపీలో వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు అంటూ ఏడుపు గొట్టు రాజకీయాలకు బాబు తెరతీశారు. అది ఎందుకో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తాము అధికారంలోకి వస్తే ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏదో ఒక తేదీని ఖరారు చేసి గొప్పగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది

పెరుగుతున్న డిమాండ్…..

అనుకున్నట్లుగానే జగన్ ఇపుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు. ఏపీ పుట్టిన రోజు ఏదో ఒకటి ఆయన ఖరారు చేయాల్సిన సమయం, సందర్భం కూడా వచ్చేసింది. ఇపుడున్న పదమూడు జిల్లాల ఏపీ ప్రకారం చూసుకుంటే అక్టోబర్ 1న ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడమే బెటర్ అంటున్నారు. ఇదే మ్యాప్ తో 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తేది అదే కాబట్టి అందరికీ ఆమోదంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు ఏపీ మెధావుల సంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ తేదీని ఖరారు చేయండి, సబబుగా ఉంటుందని కూడా అందులో ఆయన సూచించారు. ఇక నవంబర్ 1 అంటేనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినం అని గట్టిగా తెలుగువారి గుండెల్లో నాటుకుపోయింది. తెలంగాణా విడిపోయినా కూడా ఏపీ వరకూ ఆ తేదీని కొనసాగించి వేడుకలు జరుపుకోవచ్చునని మరికొందరు సూచిస్తున్నారు. మరి జగన్ ఈ రెండు తేదీలో దేన్ని ఖరారు చేస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. అదే సమయంలో జగన్ కూడా ఏపీకి కచ్చితమైన తేదీ లేకుండానే బాబు లాగానే పాలన జగన్ చేస్తారా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. అదే కనుక జరిగితే తెలుగు వారి ఆత్మగౌరవం, స్పూర్తి దెబ్బతినే ప్రమాదం ఉందని భాషాభిమానులు, రాష్ట్రాభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News