ఒకవైపే చూడు

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ జనాకర్షక సంక్షేమ మంత్రాన్ని పఠించింది. అభివృద్ధి పద్దుపై చిన్న చూపు చూసింది. ఎన్నికల ప్రణాళిక అమలుపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. [more]

Update: 2019-07-13 15:30 GMT

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ జనాకర్షక సంక్షేమ మంత్రాన్ని పఠించింది. అభివృద్ధి పద్దుపై చిన్న చూపు చూసింది. ఎన్నికల ప్రణాళిక అమలుపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. నవరత్నాలే తమ పంథాగా సర్కారు చాటి చెప్పింది. విద్య,వైద్యం మొదలు రైతు సంక్షేమం వరకూ తొమ్మిది పథకాలను తూణీరాలుగా కూర్చుకుని ఎన్నికల సమరం సాగించిన జగన్ వార్షిక పద్దులో వాటికే పెద్దపీట వేశారు. తమ పాలనకు మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ ప్రవచిస్తూ వచ్చారు. దానిని నిలబెట్టుకున్నారు. భారీ వ్యయంతో కూడిన పథకాలు కావడం వల్ల వాటికి పూర్తిగా న్యాయం చేయగలరా? యూ టర్న్ లు ఉంటాయేమోననే సందేహాలు కొంతవరకూ వెన్నాడుతూ వచ్చాయి. తాజాగా ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో వాటిని పటాపంచలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల బెడద, మౌలిక వసతుల ఒత్తిడి వంటి వాటిని పక్కనపెట్టి ఎన్నికల ప్రణాళికే తన ప్రథమ ప్రాధాన్యమని చాటిచెప్పారు. ప్రజావిశ్వాసాన్ని పాదుగొల్పుకునే క్రమంలో భాగంగా బడ్జెట్ ఒకింత దూకుడును ప్రదర్శించిందనే చెప్పాలి. అయితే అభివృద్ధి, సంక్షేమాలను సంతులనం చేయడంలో గణాంకాలు తడబడ్డాయి. సంక్షేమ వడ్డింపు వైపే బడ్జెట్ పద్దు ఒదిగిపోయింది.

పక్క రాష్ట్రాలకు సవాల్…

జగన్ నేతృత్వంలో తొలి పద్దు కావడంతో అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అందులోనూ వైట్ పేపర్ విడుదల చేసి రాష్ట్రం దివాళా తీసిందని రెండు రోజులు ముందుగానే ప్రకటించడంతో బడ్జెట్ పై దాని ప్రభావం ఉంటుందనుకున్నారు. కానీ శ్వేతపత్రాన్ని గత ప్రభుత్వంపై విమర్శకే పరిమితం చేసి చాకచక్యంగానే తమ ప్రాధాన్యాలకు పట్టం గట్టడం విశేషం. కీలక రంగాల విషయంలో 2004 నుంచి 2009 సంవత్సరాల మధ్య కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన కాలాన్ని గుర్తు చేయాలనే తపన బడ్జెట్ లో అణువణువునా తొంగి చూసింది. పథకాలకు వైఎస్ పేరు పెట్టడమే కాకుండా సందర్భాన్ని అనుసరించి ఆయన సేవలను స్మరించుకొనే అవకాశం రాష్ట్ర ప్రజానీకానికి కల్పించారు. ఒక పార్టీగా వైసీపీకి అడ్వాంటేజ్ కల్పించే వ్యూహం ఇందులో దాగి ఉంది. ప్రభుత్వంగా ప్రజావిశ్వాసాన్ని సుస్థిరపరచుకునే ప్రయత్నమూ ఉంది. పాలకపక్షంగా యంత్రాంగానికి సమగ్ర దిశానిర్దేశంతో కసరత్తు చేసిన తర్వాతనే బడ్జెట్ రూపకల్పన చేశారని చెప్పుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం విషయాల్లో ప్రథమశ్రేణి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం పద్దులో కనిపించింది. కొన్ని సమస్యలు, సందేహాలకు మాత్రం ఈ వార్షిక ఆదాయ,వ్యయ ప్రణాళిక సమాధానం చెప్పలేకపోయిందనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా అందులోనూ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంక్షేమం అనేది ప్రభుత్వాలకు తారకమంత్రంగా మారింది. ఈ విషయంలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తమిళనాడుది ఈ విషయంలో గతంలో పెద్ద రికార్డు. వినూత్న పథకాలతో తెలంగాణ ఆ విషయంలో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు పథకాల విషయంలో తెలంగాణకు సైతం సవాల్ విసురుతోంది ఆంధ్రప్రదేశ్.

మూడోవంతు పథకాలకే…

ఏడాదిన్నర కాలంగా నవరత్నాల గురించి వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. నవ్యాంధ్రలో రికార్డు స్థాయి విజయంలో ఆయా పథకాల ప్రభావాన్ని తోసిపుచ్చలేం. అందుకే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో 60 వేల కోట్ల రూపాయల వరకూ ఆయా పథకాలకే కేటాయించాల్సి వచ్చింది. మొత్తం రెవిన్యూ వ్యయంలో మూడో వంతు ఆయా పథకాల కింద ఖర్చు చేయనున్నారు. వ్యవసాయరంగానికి 29 వేల కోట్ల రూపాయల వరకూ చూపించడమూ భారీ మొత్తంగానే పరగణించాలి. ముఖ్యంగా మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి వ్యవసాయానికి ఊతంగా నిలుస్తుంది. దీనివల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వ్యవసాయరంగానికి వత్తాసు దొరకుతుంది. అదేవిధంగా పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకూ విస్తరించాలనుకోవడం దేశంలోనే వినూత్నం. ఇది మిగిలిన రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయమవుతుందని చెప్పవచ్చు. అయితే భూయజమానులు, కౌలు దారుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం నెలకొల్పడం అనేది ముఖ్యం. లేకపోతే తమ పొలాలను కౌలుకు ఇవ్వడానికి యజమానులు ఇష్టపడకపోవచ్చు. చిన్నసన్నకారు కౌలు రైతులు కష్టాల సేద్యానికి ఆసరా దొరికితే అంతకుమించిన అద్రుష్టం ఉండదు. విద్యపై వెచ్చించే ప్రతిరూపాయి భవిష్యత్తుకు పెట్టుబడిగానే చూడాలి. ఆ కోణంలో చూస్తే అమ్మఒడి మంచి ఆలోచన. ప్రభుత్వ,ప్రయివేటు విచక్షణ లేకుండా ఈ పథకాన్ని వర్తింపచేస్తామనడంపై కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ సర్కారు క్రమేపీ లోటుపాట్లను దిద్దుకుంటూ పోతుందనే భావించాలి.

అప్పుల తిప్పలే…

ప్రతి కుటుంబానికి ఏదో ఒక ప్రయోజనం సమకూర్చాలనే దిశలో రూపకల్పన చేసిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్టులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఆచరణలోనే వెదకాల్సి ఉంటుంది. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాలనే సంకల్పం ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. కానీ కేంద్రం చేతిలో పెడతారా? లేకపోతే పాతపద్ధతిలోనే రాష్ట్రప్రభుత్వమే నిధులు కేటాయించి తర్వాత కేంద్రం నుంచి రాబడుతుందా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం రంగంలోకి దిగకపోతే సాగదీతకు ఆస్కారమెక్కువ. సాధారణంగా గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రాధాన్యక్రమంలో మార్పు కారణంగా ఏటేటా ప్రభుత్వాలు అభివృద్ధిపై వెచ్చిస్తున్న మొత్తం పడిపోతోంది. ప్రస్తుత బడ్జెట్ లో కూడా రెవిన్యూ వ్యయం కింద లక్షాఎనభైవేల కోట్లరూపాయలు ఖర్చుపెడుతుంటే అభివ్రుద్ధి కార్యక్రమాల నిమిత్తం కేటాయించే పెట్టుబడి వ్యయంగా 32వేల కోట్లరూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. నిజానికి నవ్యాంధ్ర వంటి కొత్త రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే రెవిన్యూ వ్యయంలో కనీసం మూడోవంతు పెట్టుబడి వ్యయం ఉండాలనేది నిపుణుల సూచన. కానీ ఆరోవంతుకే ఇది పరిమితమవుతోంది. అందువల్ల శీఘ్రగతిన ప్రాజెక్టులు చేపట్టడానికి, మౌలిక వసతులకు నిధుల కొరత తప్పకపోవచ్చు. ప్రస్తుతమున్న ఆదాయవనరులు మెరుగుదల తక్షణ అవసరం. సాంకేతిక గణాంకాలను ద్రుష్టిలో పెట్టుకుని చూస్తే కనీసం 45 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలను కొత్తగా తేవాల్సి వస్తుందనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వ రుణం మూడులక్షల కోట్లకు చేరడం ఖాయంగానే చెప్పాలి. ఇది ఖజానాకు కొత్త సవాల్ విసురుతుంది. వాస్తవిక నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను నిభాయించుకుంటూ ముందడుగు వేయడం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు గీటురాయి కాబోతోంది. అభివ్రుద్ధి, సంక్షేమాలను సంతులనం చేసుకున్నప్పుడే జోడెడ్ల సవారీ చూడముచ్చట గొలుపుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మౌలిక వసతుల కల్పన అత్యంత ప్రాధాన్యమున్న అంశం. ఈవిషయంలో వైసీపీ సర్కారు మరింత మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News