డబ్బా కొట్టుకోవడంలో బాబు బాటనే ?

ఏమో.. రాజకీయం తీరే అదేనేమో. లేకపోతే చంద్రబాబు ఏ అవలక్షణాలు అయితే అలవాటు చేసుకున్నారో వాటినే శిరోధార్యంగా యువ ముఖ్యమంత్రి జగన్ భావించడం ఏంటి. లేనిది ఉన్నట్లుగా [more]

Update: 2020-09-13 13:30 GMT

ఏమో.. రాజకీయం తీరే అదేనేమో. లేకపోతే చంద్రబాబు ఏ అవలక్షణాలు అయితే అలవాటు చేసుకున్నారో వాటినే శిరోధార్యంగా యువ ముఖ్యమంత్రి జగన్ భావించడం ఏంటి. లేనిది ఉన్నట్లుగా చూపించి జనాలను మభ్యపెట్టి తన రాజకీయ పబ్బం గడుపుకోవడం చంద్రబాబు నైజం. తాను గొప్ప పాలకుడిని అని చంద్రబాబు ప్రతీ రోజూ డబ్బా కొట్టుకుంటారు. తాను ఎన్నో పరిశ్రమలను ఏపీకి తెచ్చానని అంటారు. వేల కోట్ల పెట్టుబడులు అలా వెల్లువలా వచ్చాయని కూడా ఆయన బాకా ఊదుకుంటారు. కానీ ఆర్ధిక నిపుణులు, మేధావులు చంద్రబాబుని తప్పు పడతారు. ఆయనదంతా రొడ్డకొట్టుడు డబ్బా మాటలు అని తీసి పక్కన పెడతారు. జగన్ కూడా అదే బాటన పడితే ఎలా అన్నదే సగటు ప్రజల భావన.

ర్యాంకుల గోల….

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి మొదటి ర్యాంక్ దక్కింది. అంతే టీడీపీ, వైసీపీ రాజకీయ రచ్చ మొదలెట్టేశారు తమ వల్లనే ఈ ర్యాంక్ అంటూ చంద్రబాబు, లోకేష్ మొదలు పసుపు పార్టీ ఉధ్ధండులు అంతా రంగంలోకి దిగిపోయారు. అనుకూల మీడియాలోనూ అవే రాతలు కనిపించాయి. ఇక అధికారంలో ఉన్న వైసీపీ దీనిని చూస్తూ ఊరుకుంటుందా ఏకంగా జగన్ సొంత పత్రికలో భారీ కవరేజిలు దర్శనం ఇచ్చాయి. అంతే కాదు, పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డితో పాటు అనేక మంది జగన్ ని పొగిడారు. ఆయన వల్లనే ఈ ర్యాంకులు అంటూ వైసీపీ పెద్దలు పండుగ చేసుకున్నారు. ఇలా మాదంటే మాది ఈ క్రెడిట్ అంటూ రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.

ఏం ఒరిగింది…?

చంద్రబాబు ఆయన పార్టీ తమ్ముళ్ళు అయితే తమ పాలనలో ఎన్నిసార్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో లెక్కలు విప్పి మరీ చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ నాడు చంద్రబాబు హయాంలో ఎన్ని పరిశ్రమలు ఏపీకి వచ్చి పడ్డాయి. పెట్టుబడులు ఎన్ని వచ్చాయి. ఈ లెక్కలు మాత్రం ఎవరూ చెప్పరు. కానీ అసలు గుట్టు చూస్తే వేరేగా ఉంది. ఎక్కడో ఒకటీ అరా తప్ప ఏపీకి బాబు హయాంలో వచ్చిన పరిశ్రమలు ఏవీలేవు. కోట్ల పెట్టుబడులు వచ్చేశాయంటూ విశాఖలో నిర్వహించిన సదస్సులలో ఢంకా భజాయించినా కూడా చివరికి తేలింది ఏంటి అంటే ఆ సదస్సులకు పెట్టిన ఖర్చు అంత కూడా పెట్టుబడుల పైసలు రాలలేదని. మరి దీని మీద ఏమీ చెప్పకుండా ర్యాంకులు అంటూ రెచ్చిపోతే జనాలను పిచ్చివాళ్ళను చేసినట్లు కాదా.

అడుగులు పడాలిగా…?

ఇక జగన్ ముఖ్యమంత్రిగా మంచి పారిశ్రామిక పాలసీనే తీసుకువచ్చారు. ఆయన సింగిల్ విండో విధానంలో అన్ని రకాలైన అనుమతులు మంజూరు చేయడం నుంచి నీరు, విద్యుతు, భూమి వంటి వాటి విషయంలో ఇస్తున్న రాయితీలు కూడా బాగున్నాయి. కానీ పెట్టుబడులు గడచిన ఏడాదిన్నరగా పెద్దగా రాలేదు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. జగన్ రాజకీయాల్లోకి రాకముందు నంబర్ వన్ బిజినెస్ మ్యాన్. ఆయన సక్సెస్ ఫుల్ గా ఆ రంగంలో ఉన్నారు. ఆయనకు ఒక పెట్టుబడిదారుకు ఏం కావాలో చాలా బాగా తెలుసు. మరి ఇపుడు ఆయనే పాలన చేస్తున్నారు. ఒక విధంగా చంద్రబాబు కంటే కూడా జగన్ ఏలుబడిలోనే పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి చెందాలి. దానికి తన అనుభవం జగన్ ఉపయోగించాలి. అది మానేసి చంద్రబాబు తానా అంటే తందానా అంటూ ర్యాంకులను చూపించి జగన్ గొప్పలు చెప్పుకుంటే ఏపీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. నిజాలు తెలిసిన నాడు ప్రజలు బాబుకు ఇచ్చిన తీర్పునే ఇస్తారు కూడా. జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తే ఏపీ పారిశ్రామిక రాష్ట్రం అవుతుందన్న నమ్మకం మేధావుల్లో కూడా ఉంది. ఆ దిశగానే త్వరగా అడుగులు పడాలి.

Tags:    

Similar News