జబ్బులు చెబుతూ జబ్బలు చరుస్తున్నారే…!

రాజుల కాలంలో ఒక నీతి ఉండేది. రాజు గారి వారసుల్లో ఎవరికైనా ఏదైనా వ్యాధి ఉంటే వారు పదవులకు అనర్హులు. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం సమస్త అవలక్షణాలు [more]

Update: 2020-10-10 15:30 GMT

రాజుల కాలంలో ఒక నీతి ఉండేది. రాజు గారి వారసుల్లో ఎవరికైనా ఏదైనా వ్యాధి ఉంటే వారు పదవులకు అనర్హులు. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం సమస్త అవలక్షణాలు ఉంటేనే వారు అందలానికి అసలైన వారసులు అవుతారు. ఇది నేతలు తమకు తాముగా పెట్టుకున్న రూల్ మరి. ఏపీని ముమ్మారు ఏలిన చంద్రబాబుని విమర్శించడమంటే వ్యక్తిగతంగా తగులుకుంటారు వైసీపీ నేతలు, మంత్రులు. బాబుకు బొల్లి ఉందంటారు, ఆయన ఇపుడు అల్జీమర్స్ అంటే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్నారని కూడా తరచూ అనేది వైసీపీ నేతలే. అంతకు ముందు ఇదే విమర్శను కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వంటి నాయకులు కూడా బాబు మీద చేసేవారు.

జగన్ కి ఆ జబ్బా….

మరి మాటకు మాట ఇచ్చి పుచ్చుకుంటేనే కానీ తెల్లారని రాజకీయం మనది. అందుకే జగన్ ని సైకో అంటూ టీడీపీ నేతలు కొత్త జబ్బు అంటించారు. జగన్ శాడిస్ట్ అని కూడా అన్నారు. ఇక ఆయన ప్రత్యర్ధులను ద్వేషించే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కూడా అంటున్నారు. ఇపుడు కొత్తగా నారా వారి పుతుడు లోకేష్ జగన్ కి కొత్త జబ్బు కనిపెట్టారు. మరి ఇంటర్నెట్ లో చూసి బాగుందని వాడారో లేక ఇదే ప్రచారంలో పెడితే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని ఆశపడ్డారో తెలియదు కానీ జగన్ కి ఏకంగా నోరు తిరగని జబ్బునే అంటించారు. ఆ జబ్బు పేరు యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ కొత్త జబ్బుతో జగన్ బాధపడుతున్నారని లోకేష్ కనిపెట్టారు. ఈ వ్యాధి ప్రధాన లక్షణం విధ్వంసం సృష్టించడమేనని అభివర్ణించారు కూడా.

అదొక్కటే మిగిలిందా…?

రాజకీయాలు ఎంతగా దిగజారాయి అంటే సిద్ధాంతాల మీద రాద్ధాంతాలు చేసే రోజులు ఎటూ పోయాయి. వ్యక్తిగత దూషణలు కూడా పరాకాష్టకు చేరాయి. కొత్త జబ్బులు కూడా తెచ్చిపెట్టి మరీ తిడుతున్నారు. ఇక మిగిలింది ప్రత్యర్ధుల చావు కోరుకోవడమే. అంటే దానికి కూడా చాలా దగ్గరలోనే ఉన్నారనుకోవాలి. ఇవాళో రేపో ఆ మాటను కూడా అనేసేట్టుగా నేతల తీరు, జోరు చూస్తే కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో జనం ఒకరిని మెచ్చుకుని అందలం ఎక్కిస్తారు. అది కూడా కేవలం అయిదేళ్ల కాలానికి మాత్రమే. వారు కనుక నచ్చకపోతే ఓటు అనే ఆయుధంతో ఎటూ దించేస్తారు. ఈలోగా ఓడిన వారు జనంలో తమ పరపతి పెంచుకుని పాజిటివ్ ఓటింగ్ కోసం ప్రయత్నం చేయాలి.

దూరం పెట్టాల్సిందే…..

ఏపీలో ఎక్కడ నుంచి వచ్చిందో కానీ నెగిటివ్ పాలిటిక్స్ ఎక్కువ అయిపోతోంది. నేతాశ్రీలు అన్నీ మరచి ఒకరినొకరు దూషించుకుంటున్నారు. అది చూసే జనాలకు కూడా ఎబ్బెట్టుగా ఉంటోందని కూడా మరచిపోతున్నారు. అసలు జబ్బునేతల ఒంట్లో లేదు, నేతల అధికార యావలో ఉంది, పదవుల పిచ్చిలో ఉంది. కుర్చీ కోసం ఎందాకైనా తెగిస్తామనే నాయకుల జాతకాలు తీసి పాతరేయాల్సింది జనాలే. రాజుల కాలం నాటి మాదిరిగా జబ్బులు ఉన్న వారికి నిజంగా గద్దెనెక్కే హక్కు లేదని ప్రజలే యాంటీగా ఓటేసి మరీ ఒట్టేయాలి. ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేసేవారికే పాలన చేసే హక్కు ఇస్తామని నినదించాలి. జనాలలో ఈ చైతన్యం రానంతవరకూ జబ్బుల జాబితాకు అంతూ పొంతూ ఉండదేమో.

Tags:    

Similar News