సినిమా స్క్రిప్ట్ ను మరిపిస్తున్న ఆంధ్ర రాజకీయం

Update: 2018-07-06 15:30 GMT

సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ద్వంద్వ పాత్రలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనసులో ఒక భావం పెట్టుకుని తద్భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తమ ఆలోచనకు స్పందన తెలుసుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. ఒకవేళ తమ ఆలోచనకు తగినంత మద్దతు లభించదని తేలితే వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుంటారు. ఉన్నపార్టీయే అద్భుతం అంటారు. ఒకవేళ తాము జంప్ చేయదలచుకున్నపార్టీకి ప్రజల్లో ఇమేజ్ బాగుందనిపిస్తే ఉన్న పార్టీకి ఉట్టి కొట్టి వెళ్లిపోతారు. తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తులుగా కాకుండా పార్టీలే డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఘట్టం ఆవిష్కృతమవుతోంది. బరిలోకి దిగబోతున్న ప్రధాన పార్టీలన్నీవేర్వేరు జట్లుగా సహకరించుకుంటున్నాయా? పరోక్షంగా ఇతరులకు సహకరించే పద్ధతుల్లో తమ ప్రయోజనాలను నొల్లుకోవాలని చూస్తున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన, బీజేపీ, కాంగ్రెసు, వామపక్షాలు వీటన్నిటి పోకడలోనూ ఒక విచిత్రమైన ధోరణి అంటుకడుతోంది. కొత్త సమీకరణలు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అవి బహిరంగంగా కావడం లేదు. కానీ 2019 ఎన్నికల తర్వాత వాతావరణాన్ని పట్టి ఇచ్చే విధంగా ఉండటమే గమనార్హం.

టీడీపీ..కాంగ్రెసు ..

తెలుగుదేశం పార్టీ కాంగ్రెసును పెద్దగా విమర్శించడం లేదు. అదినేత చంద్రబాబు నాయుడు ఆపార్టీలోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్న విషయాన్ని కొందరు నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీరామారావు కాలం నాటి టీడీపీ కాదని మరికొందరు తేల్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత సాఫ్ట్ కార్నర్ కాంగ్రెసు పట్ల టీడీపీలో నెలకొంది. భవిష్యత్తులో జాతీయస్థాయి ప్రాంతీయ కూటమి ఏర్పడితే కాంగ్రెసు సహకారం అవసరం కావచ్చని అంచనా. ఈ కూటమికి చంద్రబాబు నాయుడే పెద్ద దిక్కుగా ఉండే సూచనలున్నాయి. అదే జరిగితే కాంగ్రెసుతో సంప్రతింపులు జరపాల్సిన బాధ్యత ఆయనపైనే పడుతుంది. 96-98 మధ్య కాలంలో యునైటైడ్ ఫ్రంట్ కి కాంగ్రెసు సహకరించింది. దానికి కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరించారు. బీజేపీ, మోడీ అధికారంలోకి రాకుండా అవసరమైతే కాంగ్రెసు కు మద్దతిచ్చేందుకు సైతం చంద్రబాబు సిద్ధమవుతారనేది రాజకీయ వర్గాల జోస్యం. దీనిని ద్రుష్టిలో పెట్టుకుని చూస్తే టీడీపీ, కాంగ్రెసులు అనధికార మిత్రపక్షాలుగానే చెప్పాల్సి ఉంటుంది.

వైసీపీ..బీజేపీ..

టీడీపీకి, బీజేపీకి మధ్య దూరం పెరగడంలో వైసీపీ పాత్ర చాలా ఉంది. ఏడాది కాలంగా బీజేపీ అగ్రనాయకత్వానికి వైసీపీ చేరువ అవుతూ వచ్చింది. ప్రజల్లో అధికారపక్షానికి ఆదరణ తగ్గుతోందని కేంద్రప్రభుత్వం గుర్తించింది. దాంతో 2019 నాటి సమీకరణలకు వైసీపీ చాలా ఉపకరిస్తుందనే ఉద్దేశంతో దానిని ప్రోత్సహించడం ప్రారంభించింది. అమిత్ షా, మోడీల అపాయింట్మెంట్లు ఆ పార్టీ ఎంపీలకు, అగ్రనాయకులకు సులభంగా లభిస్తున్నాయి. అందులోనూ చంద్రబాబు నాయుడు ఫెడరల్ ఫ్రంట్ వంటి ఆలోచనలకు దిగితే చెక్ పెట్టడానికి వైసీపీ ఉపయోగపడుతుందనే ఆలోచన కమలనాథులకు ఉంది. దాంతో విజయసాయి రెడ్డి కేంద్రంగా చర్చలు, సంప్రతింపులు సాగుతూ వచ్చాయి. దీనిని పసిగట్టిన తర్వాతనే టీడీపీ కేంద్రంపై ధ్వజమెత్తింది. ఆర్థిక సాయం, ప్రత్యేక హోదా వంటివాటిని సాకులుగా చేసుకుంటూ కేంద్రం నుంచి బయటికి వచ్చేసింది. ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. దాని తర్వాత వైసీపీ బీజేపీ నాయకత్వానికి మరింత చేరువ అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు పార్టీలు ఎన్నికల తర్వాత పరస్పరం సహకరించుకునేందుకు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు హస్తిన వర్గాల సమాచారం.

జనసేన ..వామపక్షాలు..

జనసేన, వామపక్షాలు కలిసి నడుస్తాయని ఇప్పటికే దాదాపు అధికారికంగా ప్రకటించేశారు. జనసేన ఈ విషయంలో స్పష్టంగానే ఉంది. వామపక్షాలలో కొంత సందిగ్ధత నెలకొంది. సీపీఐ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వీరాభిమానించేస్తోంది. సీపీఎం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జాతీయస్థాయి కూటమి పేరిట సంప్రతింపులు జరిపి ఒక ఊపు తెస్తే మళ్లీ సమీకరణల్లో మార్పులు వస్తాయి. జనసేనతో పోలిస్తే టీడీపీ పెద్దపార్టీ. జాతీయస్థాయిలోనూ ప్రభావం చూపగలదు. అందువల్ల చంద్రబాబునాయుడి ఇన్ఫ్లూయన్స్ పడితే సీపీఎం మళ్లీ టీడీపీతో జట్టుకట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పడు జనసేన, సీపీఐ మాత్రమే కలిసి వెళ్లే సూచనలుంటాయి. లేదంటే సీపీఐ కూడా టీడీపీతో జట్టుకట్టవచ్చు. తెలంగాణలో కాంగ్రెసుతో కలిసి వెళ్లేందుకు సీపీఐ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏపీలో స్థానిక విభాగం జనసేన వైపు మొగ్గు చూపుతోంది. రానున్న ఒకటి రెండు నెలల్లో ఈవిషయంలో స్పష్టత రావచ్చు. ముఖ్యంగా జనసేన పోటీ టీడీపీకి లాభిస్తుందేమోనన్న సందేహాలను రాజకీయపరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతే జనసేన పరోక్షంగా టీడీపీ నెత్తిన పాలు పోసినట్లే. ఈరకంగా చూస్తే ఆంధ్రా రాజకీయాల్లో పరోక్షంగా సహకరించే మిత్రులే ఆయా పార్టీల బలాబలాలను, మెజార్టీని నిర్ధారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Similar News