వాళ్లు బెంగ‌ళూరు-వీళ్లు హైద‌రాబాదు.. 25 మంది ఎమ్మెల్యేల తీరిదే

ప్రజ‌లు ఎన్నుకొన్న ఎమ్మెల్యే ఎలా ఉండాలి ? ఎక్కడ‌ ఉండాలి ? అనే ప్రశ్నలు దాదాపు పాతిక నియోజ‌క‌వ‌ర్గాల్లో తెర‌మీదికి వ‌స్తు న్నాయి. దీనికి కార‌ణం.. స‌ద‌రు [more]

Update: 2020-11-25 12:30 GMT

ప్రజ‌లు ఎన్నుకొన్న ఎమ్మెల్యే ఎలా ఉండాలి ? ఎక్కడ‌ ఉండాలి ? అనే ప్రశ్నలు దాదాపు పాతిక నియోజ‌క‌వ‌ర్గాల్లో తెర‌మీదికి వ‌స్తు న్నాయి. దీనికి కార‌ణం.. స‌ద‌రు ఎమ్మెల్యేల వైఖ‌రేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా.. ఎమ్మెల్యేపై ప్రజ‌లు చాలా ఆశ‌లు పెట్టుకుంటారు. త‌మ స‌మ‌స్యలు ప‌రిష్కరించాల‌ని.. పిలిస్తే.. ప‌లికేలా ఉండాల‌ని కూడా ఆశిస్తారు. గ‌తంలో చంద్రబాబు హ‌యాంలో కొంద‌రు ఎమ్మెల్యేలు త‌మ వ్యాపారాల్లో త‌ల‌మున‌క‌లై… పొరుగు రాష్ట్రాల్లో తిష్టవేశారు. దీంతో చాన్నాళ్లు ఎదురు చూసిన చంద్రబాబు.. చివ‌రికి ఇంటికి పిలిచి.. వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఎన్నిక‌ల్లో టికెట్ కావాలో.. వ్యాపారాలు కావాలో తేల్చుకోమ‌ని తెగేసి చెప్పారు.

వ్యాపారాలకే పరిమితం…..

దీంతో కొంద‌రు లైన్‌లోకి వ‌చ్చారు. మ‌రికొంద‌రు ఎదురు తిరిగిన‌ట్టు వ్యవ‌హ‌రించారు. దీంతో అలాంటి వారికి టికెట్లు ఇవ్వలేదు. చంద్రబాబు. అయితే.. ఇప్పుడు వైసీపీలోనూ ఇలానే వ్యవ‌హ‌రిస్తున్నారు పాతిక మంది వ‌ర‌కు ఎమ్మెల్యేలు. చాలా మంది ఎమ్మెల్యేలు వ్యాపారాల్లో ఆరితేరుతున్న వారే. స్థానికంగా కొంద‌రికి వ్యాపారాలు ఉంటే.. పొరుగు రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల్లో వ్యాపార సామ్రాజ్యాల‌ను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి అవి వీరికి చాలా ముఖ్యమే. వాటి నుంచి వ‌స్తున్న ఆదాయంతోనే ఇక్కడ రాజ‌కీయాలు చేస్తున్నార‌నేది విశ్వసించాల్సిన అంశ‌మే. అయితే.. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ప‌ట్టించుకోవాలి క‌దా! అంటే.. మాత్రం వీరు మౌనం వ‌హిస్తున్నారు.

గాలికి వదిలేసి…..

క‌నిగిరి నుంచి మొద‌లు పెడితే.. అనంత‌పురం వ‌ర‌కు చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరంతా పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో విద్యాసంస్థలు, టెక్స్‌టైల్స్‌, రియ‌ల్ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక‌, ఉభ‌య గోదావ‌రి, కృష్ణా, విశాఖ, గుంటూరు జిల్లా‌ల‌కు చెందిన ఎమ్మెల్యేలు.. తెలంగాణ‌లోని హైద‌రాబాద్ కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్వహిస్తున్నారు. గ‌తంలో ఉన్న పార్టీల్లోనే వీరు ఆర్థికంగా ఎద‌గ‌డానికి ఇవి దోహ‌ద‌పడ్డాయి. అయితే.. దీనిని ఎవ‌రూ కాద‌నరు. కానీ, అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాలను గాలికి వ‌దిలేయ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో…

వైసీపీకి చెందిన కొంద‌రు యువ ఎమ్మెల్యేలు బెంగ‌ళూరు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగి తేలుతుండ‌డంతో పాటు వారు నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క్ర‌మాల కోసం కొంద‌రు అనుచ‌రుల‌కు పెత్తనం అప్పగించారు. దీంతో వారిపై తీవ్ర వ్యతిరేక‌త వ్యక్తమ‌వుతోంది. ఇక నెల్లూరు, చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక‌రిద్దరు మిన‌హా అంద‌రికి చెన్నై కేంద్రంగా చిన్నదో, పెద్దదో వ్యాపారం ఉంది. వీరిలో చాలా మందికి చెన్నైలోనే ఇళ్లు ఉన్నాయి. వీరంతా వారంలో మూడు, నాలుగు రోజులు అక్కడే ఉండ‌డం… వ్యవ‌హారం అంతా ఫోన్ల మీదే న‌డిపిస్తుండ‌డంతో కార్యక‌ర్తల‌కు ఎమ్మెల్యేను క‌లిసే అవ‌కాశ‌మే ఉండ‌డం లేదు.

అధిష్టానం ఆదేశాలు….

ఇక హైద‌రాబాద్‌లో వ్యాపారాలు లేని ఏపీ ఎమ్మెల్యేల‌ను వేళ్ల మీదే లెక్క పెట్టవ‌చ్చు. చాలా మంది ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండ‌క‌పోవ‌డంతో వారికి కార్యక‌ర్తలు, ప్రజ‌ల‌తో గ్యాప్ వ‌స్తోంది. మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి గెలిచినా ఇక్కడ నిధులు లేవు.. సంపాద‌న లేదు.. అలాంట‌ప్పుడే ఏదో ఒక‌టి చేసి అయినా సంపాదించుకోవాలి క‌దా ? అని అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. వీరి వ్యవ‌హారాల‌పై ప్రభుత్వ రాజ‌కీయ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి స‌మీక్ష చేశారు. మ‌రో 15 రోజుల్లో నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండాల‌ని ఆదేశించారు. నెల‌కు రెండు వారాలైనా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండాల‌ని.. వారం రోజులు ప్రజ‌ల్లోనే ఉండాల‌ని నిర్దేశించారు. మ‌రి.. వీరు వింటారా? ప‌ద్ధతి మార్చుకుంటారా? చూడాలి..!

Tags:    

Similar News