ఇంతకంటే వీరినుంచి ఏం ఆశిస్తాం?

కేంద్రాన్ని అన్ని విష‌యాల్లోనూ ఒప్పించ‌డం క‌ష్టమే. కానీ, ప్రధాన‌మైన రైల్వే మార్గాలు, ఇప్పటికే ఆమోదం పొందిన ప‌నులు, గ‌త బ‌డ్జెట్లో కేటాయించిన నిధుల‌ను ర‌ప్పించ‌డం వంటి అంశాల్లోనూ [more]

Update: 2020-02-03 16:30 GMT

కేంద్రాన్ని అన్ని విష‌యాల్లోనూ ఒప్పించ‌డం క‌ష్టమే. కానీ, ప్రధాన‌మైన రైల్వే మార్గాలు, ఇప్పటికే ఆమోదం పొందిన ప‌నులు, గ‌త బ‌డ్జెట్లో కేటాయించిన నిధుల‌ను ర‌ప్పించ‌డం వంటి అంశాల్లోనూ మ‌న రాష్ట్రానికి చెందిన ఎంపీలు పెద్దగా ఊపు చూపించ‌లేక‌పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. రాష్ట్ర మౌలిక స‌దుపాయాల్లో అత్యంత కీల‌క‌మైన రైల్వే రంగం విష‌యంలో గ‌తంలో ఎంపీల మ‌ధ్య ఉన్న స్ఫూర్తి ఇప్పుడు కొర‌వ డుతోంది. గ‌తంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన ఎంపీలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో రైలు కూత‌లు వినిపించేందుకు, ప్రజ‌ల‌కు రైల్వే ప్రాజెక్టుల‌ను చేరువ చేసేందుకు ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డేవారు.

కొట్లాడి తెచ్చిన….

ఈ క్రమంలో వ‌చ్చిన ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. “నేను ఎంపీగా ఉన్న స‌మ‌యంలో తెచ్చిందే.. ఈ ప్రాజెక్టు“- అని గ‌ర్వంగా కొన్ని ద‌శాబ్దాల పాటు చెప్పుకొన్న ఎంపీలు ఇప్పటికీ ఉన్నారు. త‌మ‌కు ఏదైనా చేయాల‌ని ప్రజ‌లు అడిగినా.. అడ‌గ‌క‌పోయినా.. ఎంపీలు కేంద్రం వ‌ద్ద రైల్వే ప్రాజెక్టుల‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు. దీనికి ప్రధాన కార‌ణం కొన్ని ల‌క్షల మందికి ర‌వాణా సౌక‌ర్యం ఏర్పడ‌డం ద్వారా స‌ద‌రు ఎంపీ పేరు చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌నే భావ‌న ఉండ‌డంతోనే. ఈ క్రమంలోనే పార్టీల‌కు అతీతంగా కూడా పోరాడిన సంద‌ర్భాలు, కేంద్రంలోని పార్టీల‌పై అలిగిన సంద‌ర్భాలు. కోట్లాడి తెచ్చిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

లక్ష్మణరేఖలు గీయకున్నా….

2004, 2009లోనే కాదు 2014లో గెలిచిన ఎంపీల్లో చాలా మంది రాష్ట్ర స‌మ‌స్యల‌పై అనేక విధాలుగా ఫైట్ చేసి ప్రజ‌ల మ‌న‌స్సులు చూర‌గొన్నారు. రాష్ట్రం క‌లిసున్నప్పుడే కాకుండా రాష్ట్రం విడిపోయాక కూడా ఏపీ ఎంపీలు గ‌ట్టిగానే పార్లమెంటు వేదిక‌గా త‌మ పోరాటం చూపించారు. మ‌రి నేటి త‌రం ఎంపీల్లో ఈ త‌ర‌హా పోరాట ప‌టిమ ఎక్కడా క‌నిపించ‌డం లేదు. కేంద్రంతో ఫైట్ చేసి మ‌రీ మా నియ‌జ‌క‌వ‌ర్గానికి ఇది తీసుకువ‌చ్చామని చెప్పేందుకు ఏ ఎంపీకి కూడా సాహ‌సం లేని ప‌రిస్థితులు మ‌నం చూస్తున్నాం. మ‌రి దీనికి కార‌కులు ఎవ‌రు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు ఏ పార్టీ అయినా ఎంపీల‌కు ఎలాంటి ల‌క్ష్మణ రేఖ‌లూ పెట్టదు.

చాలా మందికి వ్యాపారాలే…?

కాబ‌ట్టి ఎంపీలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో రైల్వే ప్రాజెక్టుల‌పై దృష్టి పెడితే కాద‌నేవారు ఎవ‌రు ఉంటారు. కానీ, నేడు ఎంపీల‌కు త‌మ త‌మ వ్యాపారాల‌పైనా, వ్యవ‌హారాల‌పైనా ఉన్న శ్రద్ధ ప్రజా ప్రయోజ‌నాల‌పై ఉండ‌డం లేదు. గ‌తంలో మాదిరిగా మేం ఇది తెచ్చాం అని చెప్పుకొని ఎన్నిక‌లు వెళ్లాల్సిన అవ‌స‌రమూ క‌నిపించ‌డం లేదు. గ‌తేడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ నుంచి చాలా మంది కొత్త ఎంపీలు గెలిచారు. వీరిలో చాలా మందికి రాజ‌కీయ అనుభ‌వం లేదు స‌రిక‌దా క‌నీసం ప్రజా స‌మ‌స్యల‌పై ఢిల్లీ వేదిక‌గా గ‌ళ‌మెత్తాల‌నో? లేదా పార్లమెంటులో మాట్లాడాల‌న్న ఆలోచ‌న కూడా ఉన్నట్టు అనిపించ‌డం లేదు. ఏదేమైనా నాయ‌కుల తీరు పూర్తిగా మారింది. ఎంత పంచితే.. అన్ని ఓట్లు అనే త‌ర‌హా వ్యవ‌స్థ వేళ్లూనుకుంటున్నప్పుడు ఎంపీల నుంచి ఇంత‌క‌న్నా ఏం ఆశిస్తాం. సో.. ఇప్పటికైనా ఎంపీలు గ‌త‌త‌రం ఎంపీల‌తో పోటీ ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది.

Tags:    

Similar News