“పవర్” కోసం మొత్తం…?

నేడు రాష్ట్రంలో ఏదైనా అనుకోని సంఘటన సంభవిస్తే.. వందల కోట్ల రూపాయలు అవసరమై.. విపత్తులో మునిగిన సాధారణ ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎదురైతే.. ప్రభుత్వం చేయగలదా? ఎవరినీ [more]

Update: 2019-08-05 13:30 GMT

నేడు రాష్ట్రంలో ఏదైనా అనుకోని సంఘటన సంభవిస్తే.. వందల కోట్ల రూపాయలు అవసరమై.. విపత్తులో మునిగిన సాధారణ ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎదురైతే.. ప్రభుత్వం చేయగలదా? ఎవరినీ దేబిరించకుండా..ఎక్కడికీ వెళ్లి అప్పులు చేయకుండా.. రాష్ట్ర ప్రజలను ఆదుకునే పరిస్థితి ఉందా? అంటే లేదనే చెప్పాలి. విపత్తుల మాట అలా ఉంచి.. కనీస అవసరాలకు కూడా కటకటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న బీహార్‌, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు.

ఖజానా నిండుకోవడానికి….

ఒకప్పుడు నిండు ఖజానాతో తులతూగిన ఏపీ, పక్కరాష్ట్ల్రాలకు ఆర్థిక సాయం అందించిన రాష్ట్రం నేడు ఖజానా కొల్లబోయి.. కనీస అవసరాలకు సైతం నిధుల కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి ఎవరు బాధ్యులు? రాష్ట్రంలో ఖజానా నిండు కోవడానికి ఎవరు కారకులు? అనే ప్రశ్న మేధావులను తొలిచేస్తోంది. నిజానికి ఈ విషయంపై నోరు విప్పితే.. రాష్ట్రంలో అదికారం కోసం వెంపర్లాడిన రాజకీయ పార్టీలదే కారణమని చెప్పకతప్పదు. అందులోనూ గతంలో ఐదేళ్లపాటు పాలించిన అనుభవ శూరుడు చంద్రబాబు తప్పు లేదని చెప్పే సాహసం ఏ ఒక్కరూ చేయలేరు.

ఉచితాలంటూ….

రాజకీయాలు వేరు.. ప్రజలను పాలించడం వేరు. అయితే, ప్రజల పాలన కోసం రాజకీయాలను హామీల మయం చేసిన పుణ్యమే నేడు ప్రజల పాలిట, రాష్ట్రం పాలిట కూడా శత్రువుగా పరిణమిస్తోంది. అన్నీ ఉచితాలు! అంటూ పక్కరాష్ట్ర తమిళనాడు నమూనాను తీసుకున్న చంద్రబాబు 2014లో పింఛన్లను, ఉద్యోగుల జీతాలను కూడా భారీ మొత్తంలో పెంచారు. 43శాతం ఫిట్‌మెంట్‌ విషయంలో వెనుక ముందు కూడా చూసుకోకుండా ఉద్యోగుల ఫైల్‌ పై సంతకం చేశారు. నిజానికి విభజన తర్వాత ఏపీ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అయినా కూడా చంద్రబాబు ఉదారంగా వ్యవహరించే నాయకుడే పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు.

కేంద్ర నిధులను సయితం…

అదే ఆయనను రాష్ట్రంలో పాతికేళ్లపాటు అధికారంలో కూర్చోబెడుతుందని ఆశించారు. అదేసమయంలో రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, పసుపు-కుంకుమ వంటివి రాష్ట్రానికి పెను భారంగా పరిణమించాయని ఒకప్పుడు కాగ్‌ నివేదిక ఇస్తే.. దానిని బుట్టదాఖలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించి ఉచితాలకు పంచారు. అప్పుల కుప్పలు పెరిగిపోయినా.. హంగు ఆర్భాటాల విషయంలో వెనక్కి తగ్గింది లేదు. ధర్మ పోరాటం అంటూ.. చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా.. ఖజానాను కొల్లగొట్టాయి. ఇక, భట్రాజులను మించిపోయిన తమ్ముళ్ల ప్రభావంతో చంద్రబాబు ఉదారంగా విరాళాలు, సాయాలు చేశారు. ఇలా చేసే ఖజానాను నాశనం చేశారనే వ్యాఖ్యలు వినిపించాయి.

జగన్ కూడా….

ఇక, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్‌ మాత్రం తక్కువ తిన్నారని అనలేం. బాబును మించిన హామీలు ఇచ్చారు. రాష్ట్ర ఖజానా కొల్లబోతోందని స్వయానా ఆయన పార్టీకే చెందిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ప్రమాద గంటలు మోగించారు. అయినా కూడా తగుదునమ్మా అంటూ.. అధికారమే ధ్యేయంగా హామీల వర్షం కురిపించారు. అదేసమయంలో మద్యం, ఇసుక వంటి ఆదాయ వనరులను తగ్గించుకున్నారు. ఫలితంగా ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పుకొంటూనే రాష్ట్రానికి ఎడతెగని అన్యాయం చేస్తున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

Tags:    

Similar News