ప్రసంగం..భేష్..పైసలో..?

సంక్షేమ మంత్రం పఠించారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వప్రాధాన్యాలను వెల్లడించారు. పేదల సంక్షేమం, పాలనలో సంస్కరణ, పనుల్లో [more]

Update: 2019-06-15 15:30 GMT

సంక్షేమ మంత్రం పఠించారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వప్రాధాన్యాలను వెల్లడించారు. పేదల సంక్షేమం, పాలనలో సంస్కరణ, పనుల్లో పారదర్శకత కొత్త ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన మాటలతో తేటతెల్లమైంది. కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్, నవరత్నాల అమలు, విభజన సమస్యల పరిష్కారం దిశలో అడుగులు పడబోతున్నట్లు సూచనలిచ్చారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు, రాజకీయ ప్రాథమ్యాలే ప్రసంగంలోని ప్రధాన ఉద్దేశం. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సత్సంబంధాలు నెరపుతామని చెప్పడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి భిన్నమైన ధోరణిలో వెల్లనున్నట్లు సభ ద్వారానే స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన ల నుంచి కూడా గవర్నర్ ప్రసంగంపై పెద్ద ఎత్తున విమర్శలు రాలేదు. కానీ పెదవి విరుపులు మాత్రం ఉన్నాయి. గవర్నర్ ప్రసంగ సారాంశాన్ని ఆర్థిక, పరిపాలన, రాజకీయ కోణంలో విశ్లేషించుకొంటే కొన్ని లోపాలు సైతం వెల్లడవుతాయి. భారీ పథకాలను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఆయా పథకాలకు బడ్జెట్ మద్దతు లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మార్చిలో ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఇక కాలం చెల్లిపోయినట్లే. తాజా ప్రయారిటీలకు అనుగుణంగా మళ్లీ స్కీములకు నిధులను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

సంక్షేమం..ఫస్ట్..బెస్ట్…

గవర్నర్ ప్రసంగంలో ఎక్కువ భాగం సంక్షేమం చుట్టూనే తిరిగింది. రైతు భరోసా కింద ప్రతి ఏటా రూ.12,500, అమ్మ ఒడి కింద మహిళలకు రూ.15 వేలు. నాలుగేళ్లలో డ్వాక్రా మహిళలకు రూ. 75 వేలు వంటివన్నీ పూర్తిగా నగదు బదిలీ పథకాలే. ఈ ప్రభుత్వ పదవీ కాలం చివరి ఏడాది నాటికి నవరత్నాల్లోని సంక్షేమ పథకాల అమలుకే లక్ష కోట్లరూపాయల వార్షిక వ్యయం ఉంటుందని అంచనా. ఏడాదికి 20 నుంచి 25 శాతం ఆదాయ వనరులను పెంచుకుంటూ వెళితే తప్ప ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. రానున్న నాలుగేళ్లలో పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామనే హామీ మరో గురుతరమైన బాధ్యత. కేంద్రప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కట్టే ఇళ్లు వాటి కంటే నాణ్యతప్రమాణాలతో కూడినవి. అందుకే దాదాపు రెట్టింపు మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వాలు వెచ్చించాల్సి వస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర గ్రుహ నిర్మాణ పథకాన్ని చక్కగా వాడుకొంది. అయితే ఇప్పుడు కేంద్రం తన కోటా తన ప్రభుత్వ పద్దులోనే పడాలనుకుంటోంది. కేంద్ర,రాష్టప్రభుత్వాల సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో సైతం బలపడాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో 25 లక్షల గ్రుహాల విషయంలో ఎవరిదెంత వాటా? పరస్పరం ప్రయోజనదాయకంగా కేంద్రం, రాష్ట్రం సహకరించుకుంటాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దశలవారీ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న విషయాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా మరోసారి నొక్కి చెప్పినట్లయింది. వ్యవసాయ విధానాల పర్యవేక్షణకు రైతు కమిషన్ ఏర్పాటూ హర్షించదగ్గ ప్రకటనే. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి వార్షిక నియామక క్యాలెండర్ ప్రకటిస్తామని గవర్నర్ పేర్కొనడం కూడా ప్రభుత్వ విధానానికి అద్దం పడుతోంది. నిరుద్యోగుల్లో ఆశలు నింపుతోంది.

రాజధాని సంగతేంటి?

అమరావతిని ఏం చేస్తారన్న ప్రశ్న ఇంకా సందిగ్ధంగానే ఉంది. పెద్ద నగరం ఆచరణాత్మకమా? కాదా? అన్న విషయాన్ని పక్కనపెడితే అమరావతి పేరిట మహాద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుగుదేశం హడావిడి చేసింది. గ్రాఫిక్ డిజైన్లు, ప్రాథమిక అవగాహన ఒప్పందాలతో హోరెత్తించారు. దేశంలోనే ఉత్తమ రాజధానిగా 2025 నాటికే అవతరిస్తుందని గట్టి విశ్వాసం వెలిబుచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రాథమ్యాలూ పక్కకు పోయాయి. గతంలో వైసీపీ చేసిన విమర్శల కారణంగా అమరావతిపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. రాజధాని నిర్మాణంపై ముందడుగు పడుతుందా? లేదా? అనే సందేహాలు ముసురుకున్నాయి. వీటన్నిటికీ గవర్నర్ ప్రసంగంలో సమాధానాలు లభిస్తాయని ఆశించారు. వైసీపీ నాయకులు సాధారణ చర్చల్లో రాజధాని నిర్మాణానికి ఢోకా లేదని చెబుతున్నారు. కానీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తాజా అభిప్రాయం ఏమిటన్నది వెల్లడి కావడం లేదు. ఏవిధంగా దీని నిర్మాణం ఉంటుందో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఎక్కడా స్పష్టం చేయలేదు. కేవలం పరిపాలనకే పరిమితం చేసి, ఇక్కడ చేపట్టాల్సిన ప్రాజెక్టులను జిల్లాలకు వికేంద్రీకరిస్తారనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో మాటమాత్రంగానైనా అమరావతి భవిష్యత్తును ప్రస్తావించి ఉంటే బాగుండేదని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు.

రాజకీయ ప్రాధాన్యాలు...

గవర్నర్ ప్రసంగంలో రాజకీయ ప్రాధాన్యాలకు పెద్ద పీట వేశారనే చెప్పాలి. రివర్స్ టెండరింగ్ కు వెళతామని చెప్పడం గత తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలకు సూటి హెచ్చరికే. కాంట్రాక్టుల్లో అవినీతిని వెలికితీస్తామంటూ తగు చర్యలపై గవర్నర్ ప్రసంగంలోనే ప్రస్తావించడమంటే జగన్ సీరియస్ గానే ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారనుకోవాలి. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం ప్రభుత్వ నూతన రాజకీయ విధానానికి దర్పణం పడుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీలు వివిధాంశాలపై కలిసిగట్టుగా పనిచేసేందుకు అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే విషయాన్ని గవర్నర్ నోటి వెంట చెప్పించేశారు. గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయం చేయడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. రాజధాని అంశాన్ని లేవనెత్తుతున్నారు ఆ పార్టీ నాయకులు. అలాగే రైతు రుణ మాఫీ హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చేతి వ్రుత్తులకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి భరోసా లేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. చేతివ్రుత్తుల ద్వారా ఎక్కువ మంది వెనకబడిన తరగతుల ప్రజలు ఉపాధి పొందుతుంటారు. టీడీపీ కి బీసీ వర్గాలలో గతంలో గట్టి పట్టుండేది. తాజా ఎన్నికల్లో దానిని కోల్పోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తిరిగి పాత వైభవాన్ని ఆయా వర్గాల్లో పొందేందుకు వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాస్త్రాన్ని సంధించేందుకు చేతి వ్రుత్తుల అంశాన్ని పైకి తెచ్చింది తెలుగుదేశం. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల హామీలకు, నవరత్నాలకు, పాదయాత్రలో చేసిన వాగ్దానాలకు జగన్ కట్టుబడి ఉన్న విషయాన్ని గవర్నర్ ప్రసంగం చాటి చెప్పింది.

Tags:    

Similar News