జగన్ మీడియా బేబీ కావాల్సిందేనా..

వైఎస్ జగన్ రాజకీయ పంధా వేరు, ఆయన వేరే పార్టీలో నాయకునిగా ఎక్కువ కాలం మెలిగిన వారు కాదు, కాంగ్రెస్ తో ఆయన సన్నిహిత్యం మూడు నెలల [more]

Update: 2019-09-10 09:30 GMT

వైఎస్ జగన్ రాజకీయ పంధా వేరు, ఆయన వేరే పార్టీలో నాయకునిగా ఎక్కువ కాలం మెలిగిన వారు కాదు, కాంగ్రెస్ తో ఆయన సన్నిహిత్యం మూడు నెలల ఎంపీగా మాత్రమే. వైఎస్సార్ దుర్మరణం పాలు అయ్యాక జగన్ సొంత కుంపటి పెట్టుకుని అధినేత స్థాయికి ఒకేసారి చేరుకున్నారు. ఇక మరో వైపు ఆలోచిస్తే జగన్ బాక్ గ్రౌండ్ కూడా బిజినెస్ ఫీల్డ్ కావడంతో ఆయనకు జనంతో, మరీ ముఖ్యంగా మీడియా జనంతో అవసరాలు తక్కువ పడ్డాయి. ఇక రాజకీయల్లోకి వచ్చేశాక జనంతో మాత్రం జగన్ మంచి సంబంధాలు నెలకొల్పుకోగలిగారు. అది ఆయన తండ్రి వైఎస్సార్ కంటే కూడా మిన్నగా జనం నాడి పట్టుకోవడమే కాదు, జననేతగా తక్కువ టైంలో విజయవంతం అయ్యారు. అయితే జగన్ మరో విషయంలో మాత్రం పాత తీరుని మార్చుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.

మీడియా బంధాలు ఉండాలిగా :

మీడియా ఇప్పుడు ఎంతో కీలకమైన భూమిక పోషిస్తోంది. మీడియా ద్వారా జనానికి ఏం జరుగుతుందన్నది క్షణంలో చేరవేయబడుతోంది. జగన్ విషయానికి వస్తే ఆయనకు సొంతంగా మీడియా హౌస్ ఉంది. అయినా జగన్ ఎన్నడూ మీడియాని దగ్గర చేరనివ్వలేదు. దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతూ వచ్చారు. దీని వల్ల కొన్ని సార్లు మేలు జరిగినా ఎక్కువ సార్లు ఇబ్బందులే ఎదురయ్యాయి. జగన్ మనసులో ఏముందో తెలియక ఇతర పార్టీల అభిప్రాయమే జనంలోకి వెళ్ళిపోయి ప్రమాదకరమైన పరిస్థితులు తెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నిజానికి జగన్ కేసుల విషయంలో కూడా ఎప్పుడు నోరు విప్పి ఇది నా మీద జరిగిన రాజకీయ దాడి, నా ఆస్తులు ఇవి, నా సంగతి ఇది అంటూ క్లారిటీగా చెప్పిన దాఖలాలు లేవు. జగన్ అన్నింటికీ దేవుడు ఉన్నాడని భారం వేసి మాత్రమే రాజకీయం చేస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో జగన్ గెలవడానికి ఆయన మీడియా సంబంధాల కంటే ఎక్కువగా జనంతో కలసిపోవడం వల్లనే సాధ్యపడిందన్నది వాస్తవం. అయితే నాడు జగన్ విపక్ష నేత. ప్రజలలో అలా చొచ్చుకుపోగలరు, ఇపుడు కుదరదు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి. అందువల్ల వారధిగా మీడియా ఉండాల్సిందే.

జయలలిత మాదిరిగా :

జయలలిత 1991 నుంచి 1996 వరకూ తొలిసారిగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినపుడు ఆమె మీడియాకు పూర్తి దూరం పాటించారు. ఎంతలా అంటే తన సర్కార్ మీద ఏ విమర్శ వచ్చినా కనీసం పట్టించుకోనంతగా. వాటిని మంత్రులు సైతం ఖండించకుండా ఆమె మనమే గొప్ప, ఎవరేం అనుకుంటేనేం అన్న అహంకార ధోరణిలో వెళ్లారు, చివరకు ప్రతిపక్షాల విమర్శలే మీడియాలో అంతా ఫోకస్ అయ్యాయి. దాంతో జనం కూడా వాటినే నమ్మడం మొదలుపెట్టి ఆమె తరువాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడి జగన్ విషయంలో ఎందుకు చెప్పాలంటే జగన్ సైతం అదే విధంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం గురించి, తాను చేసిన మంచి పనుల గురించి కూడా ఆయన చెప్పుకోవడం లేదు. మొన్న ఢిల్లీ వెళ్ళినపుడు ప్రధానిని కలసి ఏం వినతి చేశామన్నది అక్కడే మీడియాకు వివరించి ఉంటే తమ కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నాడన్న భావన జనంలో ఉండేది. అలాగే అమరావతి కానీ, మరో సమస్య కానీ ఏది అయినా కోతి పుండు బ్రహ్మరాక్షసిగా మారకుండా ముఖ్యమంత్రిగా జగన్ వర్షన్ కూడా చెబితే జనంలోకి వెళ్తుందన్న భావన పార్టీలో కూడా ఉంది. చంద్రబాబు మాదిరిగా రోజుకు నాలుగు సార్లు మీడియా ముందుకు రాకపోయినా ఫర్వాలేదు కానీ జగన్ కనీసం వారానికి ఒకసారి మీడియాతో ఇంటరాక్ట్ అయి కొత్త సర్కార్ గురించి మంచి చెడ్డా పంచుకుంటే మీడియా సహకారం ఉంటుంది. ఇన్ పుట్స్ కూడా మీడియా నుంచి ప్రభుత్వానికి చేరుతాయి. మరి జగన్ ఇకనైనా ఆ పని చేస్తారా.

Tags:    

Similar News