ఆ త్యాగ‌రాజుల‌కు గుర్తింపు ఏదీ…

వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కులు కొంద‌రు ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు త్యాగాలు చేశారు. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసి త‌మ స‌త్తాచాటి అసెంబ్లీకి [more]

Update: 2019-12-07 10:06 GMT

వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కులు కొంద‌రు ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు త్యాగాలు చేశారు. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసి త‌మ స‌త్తాచాటి అసెంబ్లీకి వెళ్లాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశారు. కాళ్ల‌కు బ‌ల‌పాలు క‌ట్టుకుని మ‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగారు. కేడ‌ర్‌ను కూడ‌గ‌ట్టారు. గ‌డిచిన ఐదేళ్ల టీడీపీ పాలన‌లో త‌మ‌పై న‌మోదైన కేసుల‌ను కూడా ఎదుర్కొన్నారు. ఎన్నిక‌లకు స‌ర్వం సిద్ధం చేసుకున్నారు. తీరా ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు మూడు మాసాల స‌మ‌యం ఉంద‌న‌గా చాలా చోట్ల అధినేత జ‌గ‌న్‌.. అక్క‌డి ఇంచార్జుల‌ను అనూహ్యంగా మార్చేశారు. కొత్త ముఖాల‌కు, కొత్త నాయ‌కులకు అవ‌కాశం ఇచ్చారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏపీలో చాలా చోట్ల జ‌రిగాయి. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌, గుంటూరు వెస్ట్, అనంత‌పుర‌పురం జిల్లా హిందూపురం ఇలా చాలా చోట్ల అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అభ్య‌ర్థుల‌ను అనూహ్యంగా మార్చేశారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అప్ప‌టి వ‌ర‌కు ఆశ‌లు పెట్టుకున్న‌ అభ్య‌ర్థుల‌ను శాంతింప‌జేసేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వారిపై వ‌రాల జ‌ల్లులు కురిపించారు. తాము అధికారంలోకి వ‌స్తే.. మంత్రుల‌ను చేస్తామ‌ని, ఎమ్మెల్సీలుగా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఇలా హామీలు గుప్పించారు. ముఖ్యంగా చిల‌క‌లూరి పేటలో పార్టీ సీనియ‌ర్ నేత‌ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని చెప్పారు.

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను ప‌ట్టించుకున్నది కూడా లేదు. పైగా ఆయ‌న జ‌గ‌న్‌తో భేటీ అయ్యేందుకు ప్ర‌య‌త్నించినా ఇప్ప‌టి వ‌ర‌కు అది సాధ్యం కాలేదు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఆరు మాసాలు గ‌డిచిపోయినా.. మ‌ర్రికి ఇచ్చిన హామీ ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మంత్రి ప‌ద‌వి కంటే ముందుగా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంది. ఇక‌, హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మ‌హమ్మ‌ద్ ఇక్బాల్‌కు మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే స‌మయంలో గుంటూరు వెస్ట్‌ను వ‌దులుకున్న లేళ్ల అప్పిరెడ్డి ప‌రిస్థితి కూడా త్రిశంకు స్వ‌ర్గంలో ఊగిస‌లాట‌గానే మారిపోయింది. ఈయ‌న‌కు కూడా ఎమ్మెల్సీ ఇస్తామ‌న్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చింది లేదు.

అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో పోటీ చేసి ఓడిన చంద్ర‌మౌళికి కూడా ఎన్నిక‌ల్లో ఓడినా ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన‌ జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మొహం కూడా చూడ‌లేదు. దీంతో పార్టీలో ఓ విధ‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. మాట త‌ప్ప‌న‌నే మా నాయ‌కుడు మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వీరంతా గుస్సాగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడిపై పోటీ చేసి ఓడించి రెండో సారి కూడా విజ‌యం ద‌క్కించుకున్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి కూడా మంత్రి వ‌ర్గంలో చోటిస్తాన‌న్న జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు సీఆర్‌డీఏ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి స‌రిపెట్టారు.

ఇక ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్చూరు సీటు వ‌దుల‌కున్న గొట్టిపాటి భ‌ర‌త్‌కు సైతం జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అసలు ఇప్ప‌టి వ‌రకు ప‌ర్చూరులో ద‌గ్గుబాటి, రావి రామ‌నాథంను ప‌ట్టించుకునే తీర‌కే జ‌గ‌న్‌కు లేదు. ఇక భ‌ర‌త్ గురించి ఆలోచించే ప‌రిస్థితే లేదు. దీంతో జ‌గ‌న్ ప్రాధాన్యాలు ఏంట‌నే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. మ‌రి వీరికి జ‌గ‌న్ ఇచ్చిన హామీలు మున్ముందైనా నెర‌వేరుస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News