పల్లెతో మొదలుపెట్టి.. పట్నాలకు గురి పెట్టి.

వైసీపీ సర్కార్ తెలివిగానే స్థానిక సమరాన్ని ఎదుర్కోబోతోందని అంటున్నారు. కొత్త ఏడాది మొదలవుతూనే ఎన్నికల కదన కుతూహలానికి రంగం సిధ్ధం చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన [more]

Update: 2019-12-01 13:39 GMT

వైసీపీ సర్కార్ తెలివిగానే స్థానిక సమరాన్ని ఎదుర్కోబోతోందని అంటున్నారు. కొత్త ఏడాది మొదలవుతూనే ఎన్నికల కదన కుతూహలానికి రంగం సిధ్ధం చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన కసరత్తును ముఖ్యమంత్రి జగన్ పూర్తి చేసుకునే ఎన్నికల నగరా మోగించబోతున్నారని అంటున్నారు. మొదట పంచాయతీలకు, తరువాత మండలాలు, జిల్లా పరిషత్తులు, చివరాఖర్లో మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఈ వరస నిజంగా వైసీపీకి కలిసొచ్చేదే. వ్యూహాత్మకంగానే వైసీపీ మూడు దశ‌ల ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన బంపర్ మెజారిటీని రిపీట్ చేయాలన్నది జగన్ ఎత్తుగడగా కనిపిస్తోంది.

అక్కడ గట్టి పట్టు:

అన్ని రకాల సర్వేలు చూసుకున్నా, మొదటి నుంచి వైసీపీకి ఉన్న బలాన్ని బేరీజు వేసుకున్నా గ్రామాలే ఆ పార్టీకి పట్టుగొమ్మలు అన్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ మొదట అక్కడ నుంచే జయభేరీ మోగించాలనుకుంటోంది. అప్పట్లో అన్న నందమూరి తారకరామారావుకు గ్రామాల్లో మంచి బలం ఉండేది, దాంతో ఆయన స్థానిక ఎన్నికలను అక్కడ నుంచే పెట్టుకుంటూ వచ్చేవారు. మునిసిపాలిటీలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఢీ కొట్టేది. పట్టణాలలో మెజారిటీ తారుమారు అయినా కూడా ఎక్కువ శాతం పల్లెలే కాబట్టి మెజారిటీ సీట్లు టీడీపీ ఖాతాలో పడేవి, సరిగ్గా అదే విధానాన్ని జగన్ అమలు చేస్తున్నారు. జగన్ కి గ్రామాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. జగన్ సైతం గ్రామీణ ప్రాంతాలను ద్రుష్టిలో ఉంచుకుని సంక్షేమ పధకాలు అమలు చేసుకుంటూ పోతున్నారు. జగన్ పధకాల్లో ఎక్కువమంది లబ్దిదారులు కూడా పల్లెల్లోనే ఉంటారు. పైగా వారికి వైఎస్సార్ అంటే ఇష్టం. జగన్ని సైతం అదే విధంగా అభిమానిస్తారు.

టఫ్ ఫైట్ అక్కడేనా :

ఆ విధంగా ముందు పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులను మెజారిటీ గెలుచుకునేందుకు వీలుగా వైసీపీ పధక రచన చేస్తోంది. ఇవన్నీ అయ్యాక మార్చిలో కానీ, బడ్జెట్ సమావేశాల తరువాత కానీ మునిసిపాలిటీలకు ఎన్నికలు పెట్టాలని వైసీపీ ఆలోచనగా ఉంది. మొదట పల్లెల్లొ ఎన్నికలు పెట్టి ఫలితాన్ని ఏకపక్షం చేసుకుంటే ఆ ప్రభావం మునిసిపాలిటీల మీద ఉంటుందని, దాన్ని వల్ల పట్టణాలు కూడా టర్న్ అవుతాయని ఆశిస్తోంది. అయితే పట్టణాలో టీడీపీకి సహజంగా ఓటర్లు ఆకర్షితులవుతారు. మీడియా ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. వారు సంక్షేమం కంటే అభివ్రుధ్ధిని చూస్తారు.

ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే :

అయితే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో పట్నం పల్లె అన్న తేడా లేకుండా వైసీపీకి జనమంతా పట్టం కట్టారు కాబట్టి అదే సీన్ రిపీట్ అవుతుందని వైసీపీ ఆశిస్తోంది. అదే సమయంలో బడ్జెట్లో కూడా మునిసిపాలిటీలకు ఎక్కువగా నిధుల కేటాయింపులను ఇస్తూ అభివ్రుద్ధి పేరిట జనాలను పూర్తిగా తమవైపు తిప్పుకోవాలని వైసీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే స్థానిక ఎన్నికల్లొ ఓటర్ల మద్దతు ఉంటుందన్న బండ సూత్రం కూడా ఉంది కాబట్టి ఎలా చూసుకున్నా స్థానిక సమరంలో తమకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News