కళ్లముందు కనపడుతున్నా?

రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటానికి రెండు నెలలు పూర్తి అయింది. అయినా అటు రైతులది ఇటు ప్రభుత్వానిది ఎవరి దారి వారిదే. రాజధానికి భూములు ఇచ్చిన [more]

Update: 2020-02-16 11:00 GMT

రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటానికి రెండు నెలలు పూర్తి అయింది. అయినా అటు రైతులది ఇటు ప్రభుత్వానిది ఎవరి దారి వారిదే. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గక పోయినా దారి తెన్నూ లేకపోతున్న ఉద్యమం కొనసాగించడానికి వారికి నీరసం వస్తుంది. మరో పక్క టిడిపి మీడియా లో అమరావతిలో భూముల ధరలు ఢమాల్ మంటున్నాయని అలాగే ప్లాట్ లు, విల్లాలు నేల చూపులు చుస్తున్నాయంటూ వస్తున్న కథనాలతో రియల్ వ్యాపారుల పరిస్థితి మరింత దిగజారింది.

తరలింపు ఖాయమని….

రాజధాని తరలింపు ఖాయం అని తేలడంతో ఈ ధరలు ఇంకా మరింత తగ్గుతాయన్నది స్పష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే బాబు పై విపక్షాలు గతంలో చేసిన ఆరోపణలు నిజమే అన్నది పరోక్షంగా తెలుగుదేశం పార్టీ పరోక్షంగా అంగీకరించినట్లు అయ్యిందంటున్నారు. రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి అన్న ఆరోపణలు ఇప్పుడు వాస్తవ రూపాన్ని టిడిపి మీడియా నే ఇచ్చిందన్నది విమర్శలకు దారి తీస్తుంది.

ముందుకే పోతున్న సర్కార్ …

ఇదిలా ఉంటే వైసిపి సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అమల్లో పెట్టేస్తుంది. కార్యాలయాల తరలింపులకు సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో అందరి ఆశీస్సులు అందుకుని సాగిపోతున్నారు. కర్నూలు లో న్యాయరాజధానికి ఉన్న ప్రతిబంధకాలన్నీ లేకుండా న్యాయశాఖామంత్రి సహకరిస్తా అని హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది.

ఆశలపై నీళ్లు…..

మరో పక్క విశాఖలో ముఖ్యమంత్రి నివాసం మొదలు వివిధ శాఖల కార్యాలయాలు ఎక్కడ ఉండాలి వంటివన్నీ ఇప్పటికే పరిశీలనలు పూర్తి అయినట్లు తేలిపోయింది. ఇదిలావుంటే శాసనమండలి రద్దు అంశానికి కేంద్రం జగన్ లాబీయింగ్ తో వేగవంతంగానే చర్యలు తీసుకోబోతున్నట్లు తేలిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని నమ్ముకున్న అమరావతి రైతుల ఆశలపై నీళ్ళు జల్లినట్లు అయ్యింది. దాంతో ఇంకెన్నాళ్ళు ఎవరు పట్టించుకోని అంశంపై పోరాడాలన్న ప్రశ్న అమరావతి ఉద్యమ కారులను వేధిస్తుంది. మరి అమరావతి జెఎసి అడుగులు ఇక ఎటు వైపు అనే చర్చ మొదలైంది.

Tags:    

Similar News