ఇక ఓట్ల పనే మిగిలింది

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పద్దును చూస్తుంటే అంతా బాగుందనిపిస్తుంది. అన్నివర్గాలకు సంక్షేమ వర్షం కురిపించినట్లు కనిపిస్తుంది. కానీ లోపల డొల్ల. వాస్తవ ఆదాయానికి బడ్జెట్ లో చూపే లెక్కలకు [more]

Update: 2019-02-06 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పద్దును చూస్తుంటే అంతా బాగుందనిపిస్తుంది. అన్నివర్గాలకు సంక్షేమ వర్షం కురిపించినట్లు కనిపిస్తుంది. కానీ లోపల డొల్ల. వాస్తవ ఆదాయానికి బడ్జెట్ లో చూపే లెక్కలకు ఏ మాత్రం పొంతన కుదరదు. అప్పులొక్కటే అసలు నిజం. మిగిలిందంత అరకొర వాస్తవం . మూడు నెలల కాలంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణం. అది తిరిగి తామే కావాలని తెలుగుదేశం ప్రభుత్వం కోరుకోవడంలో తప్పులేదు. కానీ నేలవిడిచి సాము చేస్తున్న వైనం కళ్లకు కడుతోంది. బడ్జెట్ లో పెట్టుకున్న అనేక పథకాలు, ప్రగతి పద్దుకు నిధులెక్కడ్నుంచి సర్దుబాటు చేస్తారంటే సమాధానం దొరకదు. ఇప్పటికే తలకు మించిన భారంగా తయారైన సంక్షేమ పథకాల కాతాను మరింతగా పెంచేసిన తీరు విస్తుగొలుపుతుంది. కులాలవారీ కార్పొరేషన్ల ఏర్పాటు పూర్తిగా ఆయా కులాలను సంతృప్తి పరచడానికి , ఆయా కుల పెద్దలకు పదవుల పంపిణీకి ఉద్దేశించినదిగానే చెప్పుకోవచ్చు. పైసలు దూసి తెచ్చి పప్పు బెల్లాలుగా పంచి పెట్టాలనే లక్ష్యంతో ఓట్లు ఆన్ బడ్జెట్ గా ఈ వార్షిక మధ్యంతర పద్దును ప్రవేశ పెట్టారనుకోవచ్చు.

కొత్త పథకంపై కోటి ఆశలు…

అన్నదాతా సుఖీభవ అంటూ గొంతెత్తిన ప్రభుత్వం కోటిఆశలు దానిపైనే పెట్టుకుంది. కౌలురైతులు సహా సమస్త రైతాంగాన్ని ఈ పథకంలోకి తెచ్చి కోటిమందికి లబ్ధి చూపించాలని యత్నిస్తోంది. అయిదువేల కోట్ల రూపాయలను ఈ స్కీమ్ కు కేటాయించారు. రెండువిడతలుగా నిధులనుపంపిణీ చేయాలనేది యోచన. మొదటిగా ఏప్రిల్ నెలలోనే రెండువేల అయిదువందల కోట్ల రూపాయలను పథకం కింద సర్దుబాటు చేయడం ద్వారా ఎన్నికల ప్రచారం సాగుతున్నతరుణంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలనేది ప్రభుత్వ భావన. దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. కౌలు రైతుల అదికారిక గుర్తింపు, అందుకు రైతుల సమ్మతి వంటివి సమస్యాత్మకం కావచ్చు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల మొత్తాన్ని బట్టి చూస్తే ఎకరాకు రెండువేల అయిదువందలకు మించి పంపిణీ చేసే అవకాశం లేదు. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఒక విడతలో ఎకరాకు నాలుగువేలు నుంచి అయిదువేలు పెంచడాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే మొదలు పెడుతోంది. ఈ పోలిక కూడా టీడీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమే. ఇంకా రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. ఈ నెలలో దానిని సర్దుబాటు చేసుకోలేకపోతే అన్నదాత సుఖీభవ అంతంతమాత్రంగానే ఫలిస్తుందని చెప్పవచ్చు.

కులాల కుంపటే…

రాజకీయపార్టీలు బహిరంగంగా అన్ని కులాలు తమకు సమానమే అంటూ ఘనంగా చాటిచెప్పినప్పటికీ కులాల కుంపటి రగిలిస్తూనే ఉంటాయి. అందులోనూ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయమంతా కులాల చుట్టూనే సాగుతోంది. అగ్రవర్ణాల్లో కమ్మ,రెడ్డి సామాజిక వర్గాలు రెండు ప్రధానపార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కాపు సామాజిక వర్గం పవన్ వెంట నడిచేందుకు సిద్దమవుతోంది. మిగిలిన వెనకబడిన తరగతులు, మైనారిటీలు, దళితులు ఎవరికి మద్దతు పలుకుతారనే అంశంపైనే ఆయా పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. గతంలో వెనకబడిన తరగతుల సంక్షేమ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ వంటివి ఉండేవి. ఇప్పుడు వాటిని విభజించి మరింతగా కులాలవారీ సంఘాల తరహాలో ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడం, తమ పార్టీలో ఉన్న ఆయా కులాల పెద్దలకు పదవులు పంపిణీ చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లుగా కూర్చోబెట్టి కులాల లాయల్టీ పొందాలనే ఎత్తుగడ. పైకి చూస్తే బహిరంగంగా అందరికీ న్యాయం చేస్తున్నామనే వాదన ఉంటుంది. అంతర్గత రాజకీయ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. బడ్జెట్ లో కూడా వాటికే పెద్ద పీట వేయడం ఎన్నికల కోణంలో తీసుకున్న చర్యగానే చూడాలి.

దినదినగండం..

ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న రాష్ట్రంలో రోజువారీ ఖర్చులకు సైతం దినదినగండంగా నెట్టుకొస్తున్నారు. ఫిబ్రవరి నెల జీతభత్యాలు, చెల్లింపులు, రైతు రుణమాఫీ, కాపు కార్పొరేషన్ కి ఇవ్వాల్సిన గ్రాంటు వంటివన్నీ కలిపితే కనీసం 25 వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం 2.26 లక్షల కోట్ల సంగతి దేవుడెరుగు. ఈ నెల ఖర్చు సంగతేమిటని ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు వందల కోట్లలోనే చెల్లించాల్సి ఉంది. రాజకీయ కారణాల రీత్యా ఈ సొమ్మును సర్దుబాటు చేయడం అత్యవసరం. ప్రభుత్వ బాండ్ల విక్రయం, రాజధాని నిర్మాణ బాండ్ల వంటి అదనపు నిధుల సమీకరణ మార్గాలన్నిటినీ ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం వినియోగించుకుంది. రాష్ట్రం చేసిన అప్పులు బడ్జెట్ ను మించిపోయాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27 శాతానికి చేరుకున్నాయి. ఇది 25 శాతం లోపు ఉంటే మాత్రమే ప్రభుత్వానికి కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పరిమితి దాటడాన్ని సాకుగా చూపి కొత్తగా అప్పు పుట్టకుండా కేంద్రప్రభుత్వం నియంత్రించేందుకు అవకాశాలున్నాయి. వీటన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ 65 వేల కోట్ల రూపాయల సంక్షేమ పద్దులో మూడోవంతు నిధులను సర్దుబాటు చేసుకుంటూ ఎన్నికల సాగరాన్ని ఎలా అధిగమిస్తారనేది చంద్రబాబు చాణక్యం మీదనే ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News