ఆనం ఇక.. ఆగలేకపోతున్నారా?

నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకే కాకుండా నియజకవర్గానికి కూడా దూరంగా కొంతకాలం నుంచి [more]

Update: 2020-11-09 13:30 GMT

నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకే కాకుండా నియజకవర్గానికి కూడా దూరంగా కొంతకాలం నుంచి ఉంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు తెలియకుండా అధికారుల బదిలీలు జరిగిపోతుండటం, తనకు సమాచారం ఇవ్వకుండే పోస్టులను భర్తీ చేస్తుండటం పట్ల ఆనం రామనారాయణరెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

తొలి నుంచి అంతే…..

తొలి నుంచి ఆనం రామానారాయణరెడ్డి వైసీపీ లో కంఫర్ట్ గా లేరు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టిక్కెట్ పొంది గెలుపొందినా ఆయన సంతృప్తికరంగా లేరు. మంత్రి పదవి దక్కకపోవడం ఒక కారణమయితే, మంత్రులు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం కూడా ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది.

జిల్లాను శాసించి…..

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. జిల్లాను శాసించారు. కానీ ఇప్పుడు కేవలం తనను నియోజకవర్గానికే పరిమితం చేశారన్న ఆవేదన ఉంది. నియోజకవర్గంలోనూ తన అనుమతి లేకుండా పనులు జరిగిపోతున్నాయి. అధికారులు కూడా ఆనం రామనారాయణరెడ్డి మాటలు విన్నట్లే విని ఊరుకుంటున్నారు. తన నియోజకవర్గంలో అధికారులు కూడా మాట వినడం లేదని గ్రహించిన ఆయన వెంకటగిరికి దూరంగా ఉంటున్నారు.

అన్నింటికీ దూరంగా…..

ఇటీవల ఎస్వీబీసీ ఛైర్మన్ గా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమించింది. అప్పుడు కూడా ఆనం రామనారాయణరెడ్డి స్పందించలేదు. గతంలోనే తాను చేసిన వ్యాఖ్యలకు అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవ్వడంతో ఇక మౌనంగా ఉండటమే బెటర్ అని ఆనం భావిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని కూడా కలిసే ఆలోచనలు ఆనం రామనారాయణరెడ్డి చేయడం లేదట. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా జరుగుతున్న బదిలీలపై మాత్రం జగన్ కు లేఖ రాసే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో కంఫర్ట్ గా లేరనే చెప్పాలి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా జగన్ తో జరిగే సమావేశంలో అన్ని విషయాలు చెప్పేయాలని ఆయన డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

Tags:    

Similar News