ఆనం.. తాను ఎద‌గ‌డు.. వారిని ఎద‌గ‌నివ్వడు

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైఖ‌రిపై వైసీపీ నేత‌లు విస్తు పోతున్నారు. త‌మ‌ను ఎద‌గ‌నివ్వడు.. తాను ఎద‌గ‌డు.. అనే [more]

Update: 2021-01-27 06:30 GMT

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైఖ‌రిపై వైసీపీ నేత‌లు విస్తు పోతున్నారు. త‌మ‌ను ఎద‌గ‌నివ్వడు.. తాను ఎద‌గ‌డు.. అనే కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చుకుని మ‌రీ వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేశారు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ బ‌లంగా ఉండేది. స‌హ‌జంగా కాంగ్రెస్ బ‌లం జ‌గ‌న్ ప్రభావంతో వైసీపీకి చేరువైంది. ఫ‌లితంగా ఒక‌ప్పటి కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ.. ఇప్పుడు వైసీపీ బ‌లంగా మారాయి. వెంక‌ట‌గిరిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జ‌నార్దన‌రెడ్డి.. కుటంబం కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేసింది.

భారీ మెజారిటీతో గెలిచి……

అయితే.. మ‌ధ్యలో టీడీపీ జెండా ప‌ట్టుకుని వ‌చ్చిన రామ‌కృష్ణ కాంగ్రెస్‌ను బ‌ల‌హీన‌ప‌రచ‌డంతోపాటు నేదురుమిల్లి కంచుకోట‌లో రెండుసార్లు టీడీపీ జెండా ఎగ‌ర‌వేశారు. ఈ క్రమంలోనే 2009, 2014 రెండు ఎన్నిక‌ల్లోనూ కురుగొండ్ల విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న వైఖ‌రి న‌చ్చని కొంద‌రు టీడీపీ నేత‌లు.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి బ‌రిలోకి దిగిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైపు మ‌ళ్లారు. దీంతో వెంక‌ట‌గిరిలో త‌న‌కు స‌త్తాలేక‌పోయినా.. ఎన్నిక‌ల‌కు స‌భ‌ల‌కు పెద్దగా జ‌నం రాక‌పోయినా.. అనూహ్య విజ‌యం అందుకున్నారు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. పైగా ఆయ‌న‌కు ఏకంగా 88 వేల భారీ మెజార్టీ వ‌చ్చింది.

టీడీపీ నేతల సహకారంతోనే…..

దీనివెనుక సంపూర్ణంగా.. రామ‌కృష్ణ ను వ్యతిరేకించిన వ‌చ్చిన టీడీపీ నేత‌ల ప్రభావం ఎక్కువ‌గా ఉంద‌నే విష‌యం ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి తెలుసు. అయిన‌ప్పటికీ ఆయ‌న గెలిచాక ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేదు. ముఖ్యంగా టీడీపీ నుంచి వ‌చ్చి త‌న గెలుపున‌కు కృషి చేశార‌న్న.. భావ‌న కూడా లేకుండా మాజీ టీడీపీ నాయ‌కుల‌ను సైతం ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల గోడు వ‌ర్ణనాతీతం.

సాధారణ నిధులు కూడా…..

మ‌రోవైపు.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్ప‌టికీ.. త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేద‌ని వాపోవ‌డ‌మే త‌ప్ప.. తాను ఎదుగుతూ.. త‌మ‌కు కూడా ఏదైనా చేస్తార‌నే ఆశ‌లు ఎక్కడా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు సొంత పార్టీ నేత‌లు. చివ‌ర‌కు జిల్లాలో కీల‌కంగా ఉన్న మంత్రితో పాటు కొంద‌రు ప్రజా ప్ర‌తినిధుల‌తో అటు అధిష్టానంతోనూ గొడ‌వ ధోర‌ణితోనే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ముందుకు వెళుతున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గానికి రావాల్సిన సాధార‌ణ నిధులు కూడా సాధించుకోలేక పోతున్నారు.

ఇవే చివరి ఎన్నికలంటూ…..

ఆనం అంద‌రితోనూ సున్నం పెట్టుకోవ‌డంతో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తనకు ఏం చేసుకోలేక‌పోవ‌డంతో పాటు ఇటు నియోజ‌క‌వ‌ర్గానికి కార్యక‌ర్తల‌కు కూడా ఉత్త చేతులే చూపుతున్నారు. దీంతో ఆయ‌న‌పై తీవ్ర వ్యతిరేక‌త వ్యక్తం కావ‌డంతో పాటు వెంక‌ట‌గిరిలో పార్టీ బ్రష్టు ప‌ట్టిపోతోంది. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి ఇవే చివ‌రి ఎన్నిక‌లు అన్న ప్రచారం కూడా వైసీపీ వాళ్లే స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు ఇప్పుడు నియ‌జ‌క‌వ‌ర్గంలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Tags:    

Similar News