టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ ఆఫర్.. వచ్చేందుకు రెడీయే కాని?

గుంటూరు రాజ‌కీయాల్లో తాజాగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది. టీడీపీ నుంచి మ‌రో వికెట్ ప‌డుతుంద‌ని, త్వ‌ర‌లోనే టీడీపీలో మార్పు జ‌రుగుతుంద‌ని పెద్ద ఎత్తున చర్చ న‌డుస్తోంది. [more]

Update: 2020-05-15 11:00 GMT

గుంటూరు రాజ‌కీయాల్లో తాజాగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది. టీడీపీ నుంచి మ‌రో వికెట్ ప‌డుతుంద‌ని, త్వ‌ర‌లోనే టీడీపీలో మార్పు జ‌రుగుతుంద‌ని పెద్ద ఎత్తున చర్చ న‌డుస్తోంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ద‌క్కా రు. వీరిలో ఇప్పటికే కృష్ణాజిల్లా గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీ, గుంటూరు జిల్లా ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంలు.. పార్టీకి దూర‌మ‌య్యారు. అధికారికంగా పార్టీ కండువా మార్చుకోక పోయినా.. జ‌గ‌న్‌కు జైకొట్టారు. దీంతో చంద్రబాబు బ‌లం.. 20కి చేరింది. మ‌రో ముగ్గురు లేదా క‌నీసం ఇద్దరిని లాగేయాల‌నేది వైసీపీ ప్లాన్‌.

జిల్లాల వారీగా టార్గెట్…..

ఇది న్యాయ‌మా? ధ‌ర్మమా? అనే త‌ర్కాన్ని ప‌క్కన పెడితే.. రాజ‌కీయాల్లో ఇది కామ‌న్‌. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌ను ఒంట‌రిని చేయాల‌ని గ‌తంలో చంద్రబాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో తీసుకున్న నిర్ణయంకంటే.. ఇది దారుణ‌మేమీ కాదు క‌దా?! అనే విష‌యం కూడా తెర‌మీదికి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ టీడీపీ నుంచి మ‌రో ఇద్దరిని లాగేసేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లాల వారీగా టార్గెట్లు కూడా పెట్టార‌ని వైసీపీ నేత‌ల చర్చల్లో సాగుతోంది. ఇప్పుడు తాజాగా ఇదే వ్యూహం కీల‌క‌మైన గుంటూరులో జ‌రుగుతోంద‌ని అంటున్నారు. రేప‌ల్లె నుంచి వ‌రుస‌గా గెలిచిన అన‌గాని స‌త్యప్రసాద్‌ను వైసీపీలోకి తీసుకోవాల‌ని, త‌ద్వారా.. టీడీపీకి దెబ్బకొట్టాల‌ని స్థానిక నేత‌లు భావిస్తున్నార‌ని అంటున్నారు.

అవునని గాని.. కాదని గాని….

దీనికి అన‌గాని సత్య ప్రసాద్ నుంచి కూడా ఔన‌ని కానీ, కాద‌ని కానీ ఎలాంటి సంకేతాలూ ల‌భించ‌లేదు. పైగా ఆయ‌న‌కు ఇప్పుడు నిధులు అవ‌స‌రం. అదే స‌మయంలో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌ల‌ప‌డాలంటే.. అన‌గాని సత్య ప్రసాద్ ని తీసుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఏర్పడింది. ఎందుకంటే.. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ పోటీ చేసినా.. మరీ ముఖ్యంగా గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీ ప్రభంజ‌నం రాష్ట్రం మొత్తం ఉన్నా.. ఇక్కడ మోపిదేవి గ‌ట్టెక్కలేక పోయారు. ఇప్పుడు ఆయ‌న‌ను రాజ్యస‌భ‌కు పంపేస్తున్నారు. అంటే. దాదాపు ఇక్కడ వైసీపీకి నాయ‌క‌త్వ లేమి తెర‌మీద‌కి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అన‌గాని సత్య ప్రసాద్ వంటి నాయ‌కుడిని పార్టీలోకి తీసుకుంటే బెట‌ర‌నేది వాద‌న‌.

పార్టీలోనూ ప్రయారిటీ లేక….

ఇక‌ అన‌గాని సత్య ప్రసాద్ సైడ్ నుంచి చూస్తే.. ఆయ‌న వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నా.. పార్టీలో పెద్దగా గుర్తింపు లేదు. చంద్రబాబు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో త‌నే స్వయంగా ప్రయ‌త్నించి.. చివ‌ర‌కు హీరోయిన్‌ స‌మంత లాంటి వాళ్లతో కూడా వీడియో ప్రచారం చేయించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అయినా బాబు నుంచి జిల్లా టీడీపీ నుంచి ప్రయార్టీ లేదు. ఇక‌, వ‌చ్చే నాలుగేళ్లు త‌ను అభివృద్ధి కార్యక్రమాల‌కు దూరం అయితే.. నియోజ‌క వ‌ర్గంలో క‌ష్టమేన‌ని అన‌గాని సత్య ప్రసాద్ భావిస్తున్నారు.

ఆఫర్ ను వినియోగించుకుంటారా?

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ నుంచి వ‌స్తున్న ఆఫ‌ర్ వినియోగించుకుంటే.. ఉభ‌య‌కుశ‌లోప‌రిగా ఉంటుంద‌ని అన‌గాని సత్య ప్రసాద్ వ్యూహం. పైగా తాను వైసీపీలోకి వెళ్తే.. ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండు పార్టీల లోతుపాతులు తెలుసు క‌నుక త‌న‌కు తిరుగు ఉండ‌ద‌ని భావిస్తున్నార‌ట‌. ఇక మోపిదేవి మ‌ద్దతు కూడా త‌న‌కే ఉంటుంద‌న్నది చెప్పక్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలోనే ఇట‌వ‌ల కాలంలో అన‌గాని సత్య ప్రసాద్ వైసీపీ, జ‌గ‌న్‌పై విమ‌ర్శల జోరు త‌గ్గించార‌ని, ప్ర‌స్తుతం ఇది చ‌ర్చల స్థాయిలో ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News