ఆంధ్రా బరిలో అమిత్ షా… ?

మోడీ తరువాత ఆయనే కీలకం. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఆయన పాత్ర అద్వితీయం. కేంద్రంలో హోం శాఖ మంత్రిగా అమిత్ షా బలమైన స్థానంలో ఉన్నారు. [more]

Update: 2021-08-18 03:30 GMT

మోడీ తరువాత ఆయనే కీలకం. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఆయన పాత్ర అద్వితీయం. కేంద్రంలో హోం శాఖ మంత్రిగా అమిత్ షా బలమైన స్థానంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో కమల వికాసం జరగాలని గట్టిగా కోరుకునే అమిత్ షా దానికి తగిన వ్యూహాలను కూడా రచిస్తున్నారు. ఉత్తరాది అంతా ఇప్పటికే బీజేపీ ఊడ్చేసింది. ఇక అక్కడ కొత్తగా వచ్చేది లేదు. పైగా ఉన్నది కూడా ఎంతో కొంత పోయేట్లు ఉంది. దాంతో ఈసారి సౌత్ ఆదుకోవాల్సిందే అన్నది అమిత్ షా చాణక్య రాజకీయం చెబుతోంది. అందుకోసం ఆయన తాను స్వయంగా బరిలోకి దిగిపోతున్నారు.

తెలుగు రాష్ట్రాలే గురి…

ఉమ్మడి ఏపీగా ఉన్నపుడే బీజేపీ 18 శాతం ఓట్లు, నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది సత్తా చాటింది. అయితే ఇది జరిగి కూడా రెండు దశాబ్దాలు పై దాటిపోతోంది. ఈ మధ్యలో ఎన్నో రాజకీయ పరిణామాలు కూడా సంభవించాయి. విభజన ఏపీలో కాంగ్రెస్ ఖతం అయింది. బీజేపీ కూడా హామీలు తీర్చలేదని జనం గుస్సా మీద ఉన్నారు. మరో వైపు తెలంగాణాలో చూస్తే బీజీపీ ఆశ మిణుకు మిణుకుమంటోంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సొంతంగా ఈసారి కనీసం పది ఎంపీ సీట్లు అయినా గెలుచుకుంటే పొత్తుల రూపేణా మిగిలినవి దక్కించుకోవచ్చు అన్నది అమిత్ షా ఎత్తుగడగా ఉందిట.

ఏపీలో టూర్లు…

అమిత్ షా ఫుల్ బిజీగా ఉంటారు. ఎంత బిజీ అంటే ఏపీ నుంచి సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరినా కూడా చివరి నిముషంలో రద్దు చేసేటంతగా. అలాంటి అమిత్ షా రోడ్డు మీదకు వచ్చి టూర్లు చేయడం అంటే కుదిరే పనేనా. అంటే రాజకీయం అలాంటిది. అనివార్యత కూడా ఉంది. దాంతో ఆయనే నడుం బిగించి మరీ రంగంలోకి దిగుతున్నారుట. ఏపీలోని గోదావరి, రాయలసీమ ప్రాంతాలలో అమిత్ షా వరస పర్యటనలు వచ్చే నెలలో ఉంటాయని తాజాగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా గోదావరికి గుండెకాయ లాంటి రాజమండ్రీలో ఒక సభ, సీమకు ముఖ్య కేంద్రమనిన తిరుపతిలో మరో సభను నిర్వహించాలని చూస్తున్నారు. ఈ సభల ద్వారా అమిత్ షా ఏపీ జనాలకు అద్బుతమైన సందేశం ఇస్తారని అంటున్నారు.

లేపడమే లక్ష్యం…

ఏపీలో బీజేపీ పడుకుంది అంటే సబబు. సోము వీర్రాజు వీరావేశం తప్ప తగిన వ్యూహం లేకపోవడం వల్ల బీజేపీ పడకేసింది. పెద్ద దిక్కు లాంటి నాయకులు కూడా ఎవరూ లేరు. దాంతో అమిత్ షా ఏపీ బీజేపీని ఒక కంట కనిపెడుతూ కమలధారులను ఉత్సాహపరుస్తారు అంటున్నారు. దానికి వచ్చే నెల టూర్లు ఆరంభం మాత్రమే అని చెబుతున్నారు. ఫ్యూచర్ లో ఏపీలో పొత్తులు ఎత్తులు ఎలా ఉండాలి అన్నీ కూడా అమిత్ షా కనుసన్నలలోనే సాగుతాయని చెబుతున్నారు. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ రెండూ కూడా బీజేపీని పెద్దగా వ్యతిరేకించడంలేదు. అయినా సరే ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకుని ఆ తరువాత బేరాలైనా రాయబారాలైనా అంటున్నారు అమిత్ షా. మరి ఏపీ మీద అమిత్ షా కన్ను పడితే రాజకీయంగా సంచలన పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు.

Tags:    

Similar News