షా...ఆ నినాదం నిజమయ్యేటట్లుంది...!

Update: 2018-05-17 17:30 GMT

కాంగ్రెస్ ముక్త్ భారత్.... అంటే కాంగ్రెస్ లేని భారతదేశం. 2014 లోక్ సభ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అమిత్ షా ఇచ్చిన పిలుపు ఇది. అప్పట్లో అమిత్ షా పిలుపును అందరూ తప్పుపట్టారు. ఆయన అహంకారి అని, అజ్ఞాని అని, భారత రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న గల్లీ నాయకుడని ధ్వజమెత్తారు. విపక్షం సరేసరి...స్వపక్షంలో సైతం కొందరు అధ్యక్షుడి పిలుపును తప్పు పట్టారు. గుజరాత్ నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యేకి, ప్రాంతీయ నాయకుడికి జాతీయ రాజకీయాలు ఏం తెలుసునని అప్పట్లో ప్రశ్నించారు. అస్సలు ఇదెలా సాధ్యమవుతుందని అపహాస్య మాడారు. వందేళ్లకు పైగా చరిత్ర గల పార్టీని తుడిచిపెట్టడం అయ్యే పనేనా? అని కడిగి పారేసిన వారూ లేకపోలేదు. కాంగ్రెస్ గురించి మాట్లాడే ముందు అసలు అమిత్ షాకు గల ప్రజాదరణ ఏపాటిదని ప్రశ్నించారు. ఏదో కాలక్షేపానికి మాట్లాడిన మాటలని కొట్టిపారేశారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎవరూ తీవ్రంగా తీసుకోలేదు. నాలుగేళ్ల అనంతరం ఇప్పుడు అమిత్ షా వ్యఖ్యలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే నిజమేనన్న అభిప్రాయం కలగక మానదు. ఆయన ఏ ఉద్దేశ్యంతో మాట్లాడారో, ఏ ముహూర్తాన మాట్లాడారో కాని ఆయన మాటల్లో ఒకింత వాస్తవం లేకపోలేదన్న భావన ఇప్పుడు కలుగుతోంది. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విశ్లేషిస్తే నిజమేనన్న అభిప్రాయం కలగక మానదు.

కాంగ్రెస్ కు మిగిలింది మూడే.....

దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిల్లో కేవలం రెండే రెండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఆ పార్టీ పరిస్థితి ఏవిటో చెప్పకనే చెబుతోంది. పంజాబ్, మిజోరం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో హస్తం పార్టీ అధికారంలో ఉంది. పంజాబ్, మిజోరాం చిన్న రాష్ట్రాలే. పదేళ్ల అనంతరం గత ఏడాది కాంగ్రెస్ పంజాబ్ లో అధికారంలోకి వచ్చింది. పార్టీ పలుకుబడి కన్నా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభావమే అక్కడ ఎక్కువ. చిన్న రాష్ట్రమైన మిజోరామ్ గురించి పెద్దగా కోవలసింది ఏమీ లేదు. దేశానికి ఈశాన్యాన బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ చిన్నరాష్ట్రంలో కూడా అక్కడి నాయకుల ప్రభావం వల్లే అధికారం సాధ్యమైంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి చాలా చిన్నది. అక్కడ ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్యమంత్రిత్వం నెరుపుతున్నారు. మొన్నటి వరకూ పెద్ద రాష్ట్రం చేతిలో ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో కూడా దెబ్బపడింది.

నాటి లోక్ సభ ఎన్నికల నుంచే.....

2014 నుంచి జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలవుతుండటంతో ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ నినాదం నిజమేనన్న అభిప్రాయం కలుగుతుంది. 2014 లోక్ సభ ఎన్నికల అనంతరం అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అడ్రస్ కోల్పోయింది. మూడు దఫాలుగా వరుసగా పదిహేనేళ్ల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోయింది. ఉత్తరాఖండ్ లో హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరాజయం పాలైంది. హరియాణా, జార్ఘండ్, హిమాచల్ ప్రదేశ్ లోని సర్కార్ లనూ కోల్పోయింది. 2016లో అసోంలో తరుణ్ గొగొయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కింది. అప్పటికి మూడు దఫాలుగా కాంగ్రెస్ అక్కడ రాజ్యమేలుతుంది. గత ఏడాది జరిగిన గోవా, మణిపూర్, మేఘాలయ ఎన్నికల్లో హస్తం పార్టీ ప్రభుత్వాల అనవాళ్లు కనపడలేదు. గోవాలో దిగంబర్ కామత్, మణిపూర్ లో ఒక్రమ్ ఇబోబీసింగ్, మేఘాలయలో ముకుల్ సంగ్మా సారథ్యంలోని సర్కార్లు ఎన్నికల్లో ఓడిపోయాయి. మణిపూర్ లో ఒక్రమ్ ప్రభుత్వం పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగడం గమనార్హం. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమెన్ చాందీ సారథ్యంలోని కాంగ్రెస్ ఓటమి పాలయింది. అక్కడ సీపీఎం విజయం సాధించింది. 2015 జనవరిలో జరిగిన జమ్మూ కాశ్మీర్ లోని కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ సంకీర్ణ ప్రభుత్వం ఓటమి పాలయింది. ఇలా జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ ఓడిపోయింది. దీంతో అమిత్ షా నినాదం ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ సాకారం అవుతుందన్న అనుమానం కలగక మానదు.

ఆ దిశగానే కాంగ్రెస్.....

ఇప్పుడు దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉండటం గమనార్హం. ఇది ఆషామాషీ అంశం కాదు. పశ్చిమ బెంగాల్, ఒడిషా, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఢిల్ీ, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేరళలో మాత్రం సీపీఎం అధికారం చెలాయిస్తుంది. ఈ ఏడాది ఆఖరులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఈ మూడింటిలో ఇప్పటికిప్పుడు హస్తం పార్టీ అధికారం సాధించే అవకాశాలు కన్పిచడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీ ప్రమేయం లేకుండానే ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ అన్న దాని కల సాకారమయ్యే అవకాశం లేకపోలేదు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే సాగుతున్నట్లు చెప్పడం అతిశయోక్తి కాదేమో....!!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News