అమిత్ షాకు అడ్డేలేదా?

Update: 2018-07-02 16:30 GMT

నోట్ల రద్దు నిర్ణయంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి, చిత్తశుద్ధి మొదటి నుంచి ప్రశ్నార్థకమే. నిర్ణయం పై అధికార పార్టీ పెద్దలకు, ముఖ్యులకు ముందే ఉప్పందిందన్న విమర్శలు, ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. నిర్ణయం అనంతరం కూడా పార్టీ నాయకుల కనుసన్నల్లోని ఆర్థిక సంస్థలకు మేలు చేసే విధంగా పావులు కదిపారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అదేమీ లేదని, అధికార పార్టీ నాయకులు బుకాయించినా ఆ తర్వాత వెలుగు చూస్తున్న వాస్తవాలు అసలు స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా గల రెండు సహకార బ్యాంకులకు ఆయాచిత లబ్ది చేకూరింది. ఇది ఎవరో గిట్టనివారు చేస్తున్న ప్రచారం కాదు. విపక్షాలు చేస్తున్న విమర్శలు కానే కావు. సమాచార హక్కు చట్టం (RTI) కింద ఒక కార్యకర్త సంధించిన ప్రశ్నకు సమాధానంగా వెలుగు చూసిన వాస్తవాలు. చేదు నిజాలు.

నోట్ల రద్దును అవకాశంగా తీసుకుని....

ఒక్కసారి లోతుకు వెళ్లి పరిశీలిస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బండారం బయటపడుతుంది. నోట్ల రద్దు తర్వాత సహకార బ్యాంకుల్లో ఏ మేరకు పాత నోట్లు జమ అయ్యాయో తెలియజేయాలంటూ సమాచార హక్కు కార్యకర్త మనోరంజన్ రాయ్ దరఖాస్తుకు నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వెల్లడించిన వాస్తవాలు బీజేపీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని కళ్లకు కట్టింది. పాత రూ.500లు, రూ.1000లు నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నాక బ్యాంకులకు పెద్దయెత్తున పాత నోట్లు వచ్చాయి. వీటిని డిపాజిట్ చేసేందుకు డిసెంబరు నెలాఖరు వరకూ గడువు ఇచ్చింది. ఈ సమయంలో అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న అహ్మదాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 745.8 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. కేవలం అయిదు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తం డిపాజిట్ కావడం ఆశ్చర్యం కల్గించే పరిణామం. అలాగే రాజ్ కోట్ డీసీసీబీలో 693.19 కోట్లు డిపాజిట్ కావడం గమనార్హం. ప్రస్తుత గుజరాత్ మంత్రి జమేన్ భాయ్ విఠల్ భాయ్ రడాడియా ఈ బ్యాంకు ఛైర్మన్. గుజరాత్ బీజేపీ రాజకీయాలకు రాజ్ కోట్ ప్రధాన వేదిక. 2001లో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని మోదీ రాజ్ కోట్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా రాజ్ కోట్ (పశ్చిమ) నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటికే సహకార బ్యాంకుల్లోకి భారీగా రద్దయిన నోట్లు చేరుతున్నాయన్న వార్తల నేపథ్యంలో నవంబరు 14న కేంద్రం ఈ బ్యాంకుల్లో నోట్ల డిపాజిట్లను నిలిపివేసింది. అప్పటికే రికార్డు స్థాయిలో పూర్తయిన డిపాజిట్లపై ప్రభుత్వం ఇంతవరకూ విచారణ జరపలేదు. రాజ్ కోట్ డీసీసీబీ లో కూడా అమిత్ షా నేటికీ డైరెక్టర్ గా కొనసాగుతుండటం గమనార్హం. అహ్మదాబాద్, రాజ్ కోట్ డీసీసీబీలు రాష్ట్రంలోనే పెద్ద సహకార కేంద్ర బ్యాంకులు కావడం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా ఈ రెండు బ్యాంకుల్లోనే పెద్దమొత్తంలో రద్దయిన నోట్లను డిపాజిట్ చేయడం వెనక మతలబు ఏమిటో అర్థంకాని విషయం.

11 బ్యాంకుల్లో 3,118 కోట్లు.....

గుజరాత్ లోని పలు సహకార బ్యాంకులకు బీజేపీ నేతలతో సంబంధాలున్నాయి. సూరత్ డీసీసీబీలో 369.85 కోట్ల విలువైన నోట్లు జమయ్యాయి. బీజేపీనేత సురేశ్ పటేల్ దాని ఛైర్మన్. బర్దోలి ఎంపీ ప్రభుభాయ్ వాసవ్ డైరెక్టర్. సబర్ కాంత్ డీసీసీబీకి బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ చావ్డా, డయ్యూ డామన్ అడ్మినిస్ట్రేటర్ గా కేంద్రం నియమించిన ప్రపుల్ భోడా ఈ బ్యాంకు డైరెక్టర్లు. ఇందులో 328.50 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అమ్రేలి డీసీసీబీలో 205.31 కోట్లు జమయ్యాయి. బీజేపీ మాజీ ఎంపీ, ప్రస్తుత నాఫెడ్ వైస్ ఛైర్మన్ దిలీప్ భాయ్ సంఘానీ దీని అధ్యక్షుడు. మెహెసానా డీసీసీబీకి పాలకవర్గం లేదు. రిజిస్ట్రార్ ద్వారా డిప్యూటీ ముఖ్యమంత్రి నితిన్ పటేల్ నడిపిస్తున్నారు. ఇందులో 215.44 కోట్లు జమ అయ్యాయి. జునాగఢ్ డీసీసీబీ సారధి బీజేపీ మాజీ మంత్రి జాషా భాయ్ బరాద్. ఇందులో 59.98 కోట్లు జమ అయ్యాయి. పంచ్ మహల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 30.12 కోట్లు డిపాజిట్లను స్వీకరించింది. ప్రస్తుతానికి దానికి పాలకమండలి లేదు. మాజీ ఎంపీ గోపాల్ సింగ్ సోలంకీ బ్యాంకు ను రిజిస్ట్రార్ ద్వారా నడిపిస్తున్నారు. బరోడా డీసీసీబీలో 76.38 కోట్లు డిపాజిట్లుగా వచ్చి చేరాయి. బీజేపీ నేతల అతుల్ భాయ్ పటేల్ ఛైర్మన్ గా, ఎమ్మెల్యే సతీశ్ భాయ్ డైరెక్టర్ గా ఉన్నారు. భరూభ్ డీసీసీబీకి కేవలం ఐదు రోజుల్లోనే 98.86 కోట్లు డిపాజిట్లుగా వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ సింగ్ రాణా దీనికి అధ్యక్షుడు. బనస్ కాంఠా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 295.30 కోట్లు డిపాజిట్ అయ్యాయి. బీజేపీ నేత ఎం.ఎల్. చౌదురి బ్యాంకు సారథిగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ చౌదరి బ్యాంకు డైరెక్టర్ కావడం గమనార్హం. ప్రతి సహకార బ్యాంకు వెనక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంది. చాలా చోట్ల ప్రత్యక్షంగా, కొన్ని చోట్ల పరోక్షంగా కమలం పార్టీ నాయకులే చక్రం తిప్పుతుండటం విశేషం. పెద్ద నోట్లను రద్దు చేసిన అయిదు రోజుల్లోనే బీజేపీ నాయకులకు సంబంధాలున్న 11 కేంద్ర సహకార బ్యాంకుల్లో 3,118 కోట్లు జమ అయ్యాయి. వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ సహకార బ్యాంకులను నియంత్రించే నాబార్డు స్పందన చాలా సాధారణంగా ఉంది. అహ్మదాబాద్ డీసీసీబీలో 17 లక్షల మంది ఖాతాదారులున్నారు. వారిలో కేవలం 1.6 లక్షల మందే డపాజిట్ చేశారు. అంటే సగటున ఒక్కో ఖాతాదారుడు 46,795 రూపాయలు జమ చేశారు. ఇందులో అసాధారమేదీ లేదన్నది నాబార్డ్ వివరణ నమ్మశక్యంగా లేదు. అధికార పార్టీ నేతల సారథ్యంలోని బ్యాంకుల్లోనే పెద్దమొత్తంలో ఎందుకు డిపాజిట్లు వచ్చాయన్న ప్రశ్నకు మాత్రం సూటి సమాధానం ఎవరూ ఇవ్వడం లేదన్నది చేదునిజం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News