అందుకే వస్తున్నారటగా

అమెరికా అధ్యక్షుడి విదేశీ పర్యటనకు అమిత ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ఏ దేశం వెళ్లినా అందరి దృష్టి దాని మీదనే ఉంటుంది. భారత్ లాంటి అతి పెద్ద [more]

Update: 2020-02-21 16:30 GMT

అమెరికా అధ్యక్షుడి విదేశీ పర్యటనకు అమిత ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ఏ దేశం వెళ్లినా అందరి దృష్టి దాని మీదనే ఉంటుంది. భారత్ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో పర్యటన అంటే అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంది. ఆసియా మరీ ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలు నిశితంగా గమనిస్తాయి. ఈ రెండూ భారత్ కు శత్రుదేశాలే. వీటిల్లో పాకిస్థాన్ అమెరికా ముద్దుబిడ్డ. పైకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆర్థికంగా, ఆయుధాల పరంగా పాకిస్థాన్ కు అండగా ఉంటుంది అగ్రరాజ్యం. వ్యాపార అవకాశాల కోసం భారత్ తో దోస్తీ చేస్తుంది. కాశ్మీర్ పై నర్మగర్భంగా, భారత్ ను ఇరుకున పెట్టే విధంగా మాట్లాడటం అమెరికాకు మొదటి నుంచి అలవాటు. ఇటీవల కూడా కాశ్మీర్ పై మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ట్రంప్ నొక్కి చెప్పారు. భారత్ కు మరో శత్రుదేశమైన చైనా అగ్రరాజ్యానికి గట్టి సవాల్ విసురుతోంది.

ట్రంప్ పర్యటనతో…..

ఈ నేపథ్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ పర్యటనపై ఈ రెండు దేశాలు దృష్టి పెట్టాయి. భారత్ కు ఎలాంటి మేలు చేస్తారు? ఎలాంటి రాయితీలు ఇస్తారు? ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయి? తద్వారా భారత్ కు కలిగే ప్రయోజనాలు ఏమిటీ అన్న విషయమై ఈ రెండు దేశాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. చారిత్రికంగా చూస్తే అమెరికా విధాన నిర్ణేతలకు భారత్ అంటే ఒకింత చిన్న చూపే. మొదట్లో నాటి సోవియట్ యూనియన్ పట్ల భారత్ మొగ్గు చూపడం వారికి మింగుడు పడేది కాదు. కాలక్రమంలో సోవియట్ యూనియన్ పతనం కావడంతో భారత్ – అమెరికా సంబంధాలు క్రమంగా మొదలయ్యాయి. ఇక అమెరికా పరంగా చూస్తే రెండు ప్రధాన పార్టీల్లో డెమొక్రాట్లు ఒకింత ఉదారవాదులు. వారు భారత్ పట్ల కొంత వరకూ సానుకూలంగా ఉంటారు. రిపబ్లికన్లు అహంకార పూరితంగా ఉంటారు. భారత్ పట్ల ప్రేమాభిమానాలు వారికి తక్కువే.

ఒబామా తర్వాత….

ఇక ట్రంప్ పర్యటన విషయానికి వస్తే 2015లో ఒబామా తర్వాత ఇండియాలో అడుగుపెడుతున్న తొలి అమెరికా అధినేత ట్రంప్. తన పదవీకాలం చివరి రోజుల్లో ఆయన వస్తున్నారు. ఈ ఏడాది నవంబరులో ట్రంప్ అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కొననున్నారు. ట్రంప్ పర్యటన వెనక వ్యక్తిగత కారాణాలు ఉన్నట్లు దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 40 లక్షలకు పైగా భారతీయులు, రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు అంచనా. అధ్యక్ష్య ఎన్నికల్లో వారి ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. భారత్ పర్యటన ద్వారా వారి మద్దతును కూడగట్టుకోవచ్చన్నది ట్రంప్ వ్యూహం. హెచ్ 1 బి వీసాలు, భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణుల రాకపై అధికారంలోకి వచ్చిన మొదట్లో ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో భారతీయులు కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్ పై దృ‌ష్టి పెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల కాలంలో ట్రంప్ నిబంధనలను కొంత సరళీకరించారు.

ఒప్పందాలు కుదురుతాయా?

వాణిజ్య ఒప్పందం, రక్షణ కొనుగోళ్లు ట్రంప్ పర్యటనలో కీలకం కానున్నాయని మొన్నటి వరకూ భావించినా తాజాగా ట్రంప్ వ్యాఖ్యలతో కీలక ఒప్పందాలు ఉండే అవకాశం లేదంటున్నారు. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై విధిస్తున్న అధిక సుంకాలను మినహాయించాలని, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ కింద కొన్ని దేశవాళీ ఉత్పత్తులకు ఎగుమతి సంబందిత ప్రయోజనాలను పునరుద్ధరించాలని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తుంది. వ్యవసాయం, ఆటో మొబైల్, ఇంజినీరింగ్ రంగాల్లో తమ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని భారత్ కోరుతోంది. అమెరికా కూడా తమ పాల ఉత్పత్తులను, వైద్య పరికరాలకు మార్కెట్ సదుపాయాన్ని పెంచాలని, సమాచార, సాంకేతిక ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. ఆకాశ మార్గంలో శత్రువుల దాడులను తిప్పికొట్టే సమీకృత గగన తల రక్షణ ఆయుధ వ్యవస్థ ( ఐఏడీడబ్ల్యూఎస్) కు భారత కు విక్రయించేందుకు గతంలో అమెరికా సమ్మతించింది. రమారమి 186 కోట్ల డాలర్ల విలువైన ఈ ట్రంప్ పర్యటనలో కుదిరే అవకాశం ఉందా? లేదా? అన్నది కొంత సందేహమే.

సత్సంబంధాలుండటంతో…..

అమెరికాలోని లాక్ షీడ్ మర్టిన్ నుంచి నౌకాదళం కోసం 24 బహుళ ప్రయోజనకత సీహాల్ హెలికాప్టర్ల ఒప్పందం కూడా కుదిరే అవకాశముందంటున్నారు. దీనివిలువ 260 కోట్ల డాలర్లు అని అంచనా. వైమానిక దళానికి అవసరమైన ఎఫ్ -15 ఎక్స్ ఈగల్ యుద్ధ విమానం ఒప్పందం కూడా కుదిరే అవకాశముంది. ఉభయ దేశాధినేతల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గత ఏడాది మే నెలలో రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ తో నాలుగు సార్లు ఇప్పటి వరకూ సమావేశమయ్యారు. భార్య మెలానియాతో కలసి వస్తున్న ట్రంప్ న్యూఢిల్లీతో పాటు మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ ను కూడా సందర్శించనున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News