అమెరికా కల ఖల్లాస్… కరోనా దెబ్బతీసినట్లేనా?

అమెరికా కరోనా వైరస్ తో కోలుకోలేని స్థితికి వెళ్లింది. ఐదున్నర లక్షలకు మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 22 వేలమందికి [more]

Update: 2020-04-13 17:30 GMT

అమెరికా కరోనా వైరస్ తో కోలుకోలేని స్థితికి వెళ్లింది. ఐదున్నర లక్షలకు మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 22 వేలమందికి పైగానే మృతి చెందారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం నెలకొంది. మరో నాలుగు వారాల పాటు అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలను పొడిగించారు. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను అమెరికా ప్రభుత్వం ప్రకటించకపోయినా కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

తెలుగువారు ఎక్కువగా ఉండే…..

దీంతో అమెరికాలోని తెలుగు కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియాల్లోనే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. న్యూయార్క్ లో ప్రతి ఏడు నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ ఆసుపత్రిలో చేరుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశముందని వైట్ హౌస్ వర్గాలు కూడా వెల్లడించాయి. ఆసుపత్రుల్లో కూడా బెడ్స్ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో హెచ్ 1బి వీసాల అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే లే ఆఫ్ తో…..

ఇప్పటికే కొన్ని కంపెనీలు లే ఆఫ్ ప్రకటించాయంటున్నారు. దీంతో పాటు హెచ్ 1 బీ వీసాల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. దాదాపు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. వీరిలో అత్యధికంగా భారతీయులే ఎక్కువగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. మొత్తం 2.75 లక్షల మందిలో 68 శాతం మంది భారతీయులే ఉన్నారు. వీరిలో అత్యధికంగా తెలుగువారు కూడా ఉండటం విశేషం.

హెచ్ 2 బీ వీసాల కోసం….

ఆర్థిక మాంద్యం కారణంగా వీరిలో ఎంతమందికి హెచ్ 1బీ వీసాలు వస్తాయన్న ఆందోళన నెలకొంది. ప్రతి సారీ హెచ్ 1బీ వీసాలను పొందడంలో భారతీయులే అగ్రస్థానంలో ఉంటున్నారు. ఈసారి కూడా వారికే ఎక్కువ లభిస్తాయని అంటున్నా కొత్త నిబంధన అనుమానాలకు తెరలేపుతుంది. కంపెనీలు హెచ్ 1బీ వీసా కోసం సిఫార్సు చేయాల్సి ఉంది. ఇందుకు జూన్ 30వ తేదీ వరకూ గడువు ఉండటంతో ఎక్కువగా భారతీయుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఇక కంపెనీలు ఎంతమందిని ఉద్యోగాల్లో ఉంచుతాయో? ఊడబీకుతాయో?అన్న ఆందోళన అందరిలోనూ ఉంది. దాదాపు లక్ష మందికి పైగా ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీసా గడువు ముగిశాక 60 రోజులు మాత్రమే అమెరికాలో ఉండే వీలుంది. ఈలోపు మరో కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవచ్చు. లేకుంటే ఇక తిరిగి రావాల్సిందే. అక్కడ ఉండే వారే కలవరపడుతుంటే కొత్తగా అమెరికా వెళ్లే వారు ఇక డాలర్ డ్రీమ్స్ వదులుకోవాల్సిందే.

Tags:    

Similar News