డామిట్… డాలర్ కధ అడ్డం తిరిగిందే?

అగ్రరాజ్యం అమెరికా కోలుకోలేని స్థితికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా తీవ్రత మరో రెండు వారాల్లో తగ్గుముఖం పడుతుందని చెబుతున్నప్పటికీ అమెరికన్లకు నమ్మకం కలగడం [more]

Update: 2020-04-27 17:30 GMT

అగ్రరాజ్యం అమెరికా కోలుకోలేని స్థితికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా తీవ్రత మరో రెండు వారాల్లో తగ్గుముఖం పడుతుందని చెబుతున్నప్పటికీ అమెరికన్లకు నమ్మకం కలగడం లేదు. లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు గవర్నర్ లు లాక్ డౌన్ లు ఎత్తివేస్తే కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రెండువేల మంది అమెరికాలో చనిపోతుండటం ఆందోళన కల్గించే అంశం.

అనుకూల నిర్ణయాలతో…..

ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇమ్మిగ్రేషన్లపై ఆరు నెలల వరకూ బ్యాన్ విధించారు. దీనివల్ల అమెరికన్లలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ భావిస్తున్నారు. హెచ్ వన్ బీ వీసాదారులకు మాత్రం ఎలాంటి నిబంధనలు వర్తించవని చెప్పి కొంత ఎన్ఆర్ఐలకు ఊరట నిచ్చారు. త్వరలో అమెరికాలో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ సంచలన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు.

ఆకలి తీర్చుకోవడానికి….

ఇదిలా ఉండగా అమెరికాలో పౌరులు ఆకలితో అలమటించి పోతున్నారు. గత నెలలుగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, వేతనాలు యాజమాన్యాలు చెల్లించక పోవడంతో ఫుడ్ బ్యాంక్ లను ఆశ్రయిస్తున్నారు. ఫుడ్ బ్యాంక్ లే ఇప్పుడు అమెరికన్లకు ఆధారమయ్యాయి. కొన్ని చోట్ల స్టోర్స్ తెరుచుకున్నా డబ్బులు లేకపోవడం, వచ్చిన సరుకు వచ్చినట్లే అయిపోతుండటంతో ఆహార నిల్వలు కూడా నిండుకున్నాయి. అమెరికాలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని చెబుతున్నారు. ఫుడ్ బ్యాంకుల వద్ద అర్థరాత్రికే చేరుకుని ఆహారం కోసం క్యూలో నిలబడటం బాధాకరమే. టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఆహారం కోసం ఎక్కువమంది ఇబ్బంది పడుతున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ…

ఆకలి బాధలు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కోరుతున్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ముఖ్యంగా టెక్సాస్, ఇండియానా గవర్నర్ల నివాసాల ఎదుట నిరసనలు తెలిపారు. దీంతో ఆంక్షలు సడలించాలని టెక్సాస్ గవర్నర్ భావించారు. అయితే ఇండియానాలో మాత్రం మే 1వ తేదీ వరకూ ఆంక్షలు కొనసాగుతాయని ఆ రాష్ట్ర గవర్నర్ ఎరిక్ హెల్కోంబ్ డిసైడ్ చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసినా కొన్ని విషయాల్లో ఆంక్షలు విధించాలని పలు రాష్ట్రాల గవర్నర్లు భావిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ఇదే మార్గమంటున్నారు. అమెరికాలో ఇలా కేసులు, మరణాల సంఖ్య పెరగడానికి లాక్ డౌన్ ను సకాలంలో విధించకపోవడమేనని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News