అంబటికి మళ్లీ మిస్ అయింది అందుకేనా?

అంబటి రాంబాబు పార్టీలో సీనియర్ నేత. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ని అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ గొంతుకగా మారారు. ఎనిమిదేళ్ల పాటు జగన్ వెంటే నడిచారు. [more]

Update: 2020-08-10 15:30 GMT

అంబటి రాంబాబు పార్టీలో సీనియర్ నేత. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ని అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ గొంతుకగా మారారు. ఎనిమిదేళ్ల పాటు జగన్ వెంటే నడిచారు. వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలోనూ అంబటి రాంబాబు ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. అలాంటి అంబటి రాంబాబుకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. ఆయన సామాజికవర్గం కూడా కలసి వస్తుందని భావించారు. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ అంబటి రాంబాబు పదవి పై ఆశలు పెట్టుకున్నారు.

ఎవరూ ఊహించని విధంగా…..

కానీ రెండు మంత్రి పదవులను జగన్ ఎవరూ ఊహించని విధంగా భర్తీ చేశారు. ప్రాంతాలకు కాకుండా కులాలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడంతో అంబటి రాంబాబుకు మళ్లీ మంత్రి పదవి మిస్ అయిందంటున్నారు. నిజానికి రాజధానికి ఆనుకుని ఉన్న గుంటూరు జిల్లాలో వైసీపీకి గత ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. మోపిదేవి వెంకటరమణ ఓడిపోయినా ఆయనను ఎమ్మెల్సీ చేసి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడే అంబటి రాంబాబు నిరుత్సాహ పడ్డారు.

జిల్లా కోటాలో…..

శాసనమండలి రద్దు చేయడంతో మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపడంతో గుంటూరు జిల్లా కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని అంబటి రాంబాబు అంచనా వేశారు. తన సన్నిహితుల వద్ద కూడా అంబటి రాంబాబు చెప్పుకున్నారు. గుంటూరు జిల్లాలో తానే సీనియర్ ను కావడం, ప్రస్తుతం మేకతోటి సుచరిత ఒక్కరే మంత్రి వర్గంలో ఉండటం తనకు కలసి వస్తుందనుకున్నారు. కానీ ఈసారి కూడా అంబటి రాంబాబను జగన్ పక్కన పెట్టారు.

అసంతృప్తిలో అంబటి…..

రెండో దఫా కూడా తన పేరును జగన్ పరిశీలించక పోవడంతో అంబటి రాంబాబు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు గుర్తింపు లభించకపోవడం పట్ల అంబటి రాంబాబు కొంత నిరుత్సాహానికి గురయ్యారని చెబుతున్నారు. తన అసంతృప్తిని పార్టీ నేతల వద్ద వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ ను పార్టీలోకి తీసుకు రావడంలో కూడా అంబటి రాంబాబు పాత్ర ఉంది. తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అంబటి రాంబాబు కలవరానికి గురయ్యారని తెలిసింది.

Tags:    

Similar News