అటూ ఇటూ కాకుండా పోయిన టీడీపీ సీనియ‌ర్‌

టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికల్లో జిల్లాలో కుప్పంలో చంద్రబాబు మినహా ఎవరు గెలవలేదు. కుప్పం [more]

Update: 2021-02-11 00:30 GMT

టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికల్లో జిల్లాలో కుప్పంలో చంద్రబాబు మినహా ఎవరు గెలవలేదు. కుప్పం తర్వాత ఒక్క నగరిలో మాత్రమే గాలి భాను ప్రకాష్ నాయుడు రోజాకు గట్టి పోటీ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉండగా ఒక రేంజ్ లో జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఇలాకా పలమనేరులో ఇప్పుడు పార్టీ జెండా పట్టే నాథుడే లేకుండా పోయాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూప‌డంతో సైకిల్ ఎక్కేశారు. ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తీవ్ర రాజకీయ వైరం ఉన్న అమర్నాథ్ రెడ్డిని ఓడించేందుకు పెద్దిరెడ్డి ఎన్నో స్కెచ్‌లు వేశారు. రాజకీయాలకు కొత్త అయినా వెంకటే గౌడ‌ అన్న కొత్త యువ‌నేత‌ను పలమనేరు నుంచి పోటీ చేయించిన ఎట్టకేలకు ఆయ‌న్ను ఓడించారు.

ఓటమి తర్వాత…

పార్టీ ఓడిపోయాక 20 నెలల్లో అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ టిడిపిని పూర్తిగా గాలికి వదిలేశారు. దశాబ్దాలుగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘ‌న‌త అమర్నాథ్ రెడ్డి కుటుంబంది. అలాంటి నేత ఇర‌వై నెల‌లు ప్రతిప‌క్షంలో ఉంటేనే రాజ‌కీయం చేయ‌లేని దుస్థితిలో ఉన్నారు. టిడిపిలో మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డిని ..ప‌లమనేరు ద్వితీయశ్రేణి క్యాడర్ ఇప్పటికీ టీడీపీ నేతగా ఓన్‌ చేసుకోలేదు. పార్టీ మారిన ఆయన అప్పటివరకు తనతో ఉన్న నేతలను టిడిపిలోకి తీసుకువెళ్లి అందలం ఎక్కించారు. త‌న బ్యాచ్‌ అధికారానికి అడ్డు రాకుండా ఉండేందుకు టిడిపిలోని ద్వితీయ శ్రేణి క్యాడ‌ర్‌ను అడ్డంగా తొక్కేసారు అన్న విమర్శలు ఉన్నాయి.

ద్వితీయశ్రేణి నేతలు ఓన్ చేసుకోక….

అందుకే వీరిలో చాలా మంది గత ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి విజయం కోసం పని చేయలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు కూడా అమర్నాథ్ రెడ్డి టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండడంతో టిడిపి అభిమానులు సైతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంట్ అయ్యారు. పార్టీ ఓడిపోయాక ఆయ‌న ఏకంగా బెంగ‌ళూరు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటూ గుర్తు వ‌చ్చిన‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గం నేత‌ల‌కు మొఖం చూపించి వెళ్లిపోతున్నారు. దీంతో పలమనేరు నియోజకవర్గంలో టిడిపి నిస్తేజంగా ఉంది. నియోజకవర్గ టిడిపి మాజీ ఇన్చార్జి రాయల సుభాష్ చంద్రబోస్.. అమ‌ర్నాథ్ రెడ్డి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు పార్టీని నిల‌బెట్టిన రామచంద్రనాయుడుతో పాటు పార్టీ కీలక నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన శ్రీనివాసుల‌ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు.

ముగ్గురు నేతల కంట్రోల్ లో….

ప‌ల‌మ‌నేరు టీడీపీ మూడొంతుల‌కు పైగా ఈ ముగ్గురు నేత‌ల కంట్రో‌ల్లోనే ఉంది. వీరంతా కూడా నాయ‌క‌త్వం మారిస్తే త‌ప్ప అమ‌ర్నాథ్ రెడ్డికి స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య టీడీపీలోనూ.. అటు ప‌ల‌మ‌నేరులోనూ అమ‌ర్నాథ్ రెడ్డి ఫ్యూచ‌ర్ గంద‌ర‌గోళంలో ప‌డింది. మ‌రీ ఈ విప‌త్తు నుంచి ఆయ‌న ఎలా సేవ్ అవుతారో ? కాల‌మే నిర్ణ‌యించాలి.

Tags:    

Similar News