పీకేతోనే ఈ పీకులాట వచ్చిందా?

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏడు రాష్రాల్లో పంజాబ్ ఒకటి. ఈ ఏడు రాష్రాల్లో అఖిల భారత కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ర్టం పంజాబ్. [more]

Update: 2021-07-14 16:30 GMT

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏడు రాష్రాల్లో పంజాబ్ ఒకటి. ఈ ఏడు రాష్రాల్లో అఖిల భారత కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ర్టం పంజాబ్. 2022 మార్చిలో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా ఎన్నికలు జరగనున్నాయి. అదే ఏడాది నవంబరు, డిసెంబరుల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ లో అధికారాన్ని కాపాడుకుని, మిగతా రాష్రాల్లో విజయం సాధించేందుకు హస్తం పార్టీ పోరాడాల్సి ఉంది. కానీ పార్టీ పరిస్థితి చూస్తే ఇతర రాష్రాల్లో విజయం సంగతిని పక్కన పెడితే, పంజాబ్ లో ఉన్న అధికారాన్ని కాపాడుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అంతర్గత కలహాలు, అధిష్టానం వైఖరి వెరసి వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ అపజయానికి బాటలు పడుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల వాదనగా కనపడుతుంది. రాష్ర్టంలో పార్టీ పరిస్థితిని చూసిన తరవాత ఎవరికైనా ఈ అభిప్రాయం కలగక మానదు.

సిద్దూ తో విభేదాలు..?

2017 ఎన్నికల్లో మొత్తం 117 సీట్లకు గాను 70కిపైగా సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా పాటియాలా రాజవంశీకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. గత నాలుగున్నరేళ్లుగా కెప్టెన్ కు ఎదురులేకుండా పోయింది. కానీ అమృతసర్ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ రూపంలో అమరీందర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాజీమంత్రి అయిన సిద్ధూ కెప్టెన్ తో విభేదాల కారణంగా గతంలో రాజీనామా చేశారు. ఇప్పుడు తనకు పార్టీలోకానీ, సర్కారులో కానీ కీలకస్థానం కావాలని పట్టుపడుతున్నారు. పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. అధిష్టానం పెద్దలు రాహుల్, ప్రియాంక మద్దతు ఆయనకున్నట్లు దిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కెప్టెన్ అమరీందర్ను హైకమాండ్ దిల్లీకి పిలిపించి మాట్లాడింది. పార్టీ ఆదేశం తనకు శిరోధార్యమని అమరీందర్ చెబుతున్నప్పటికీ సిద్ధూకు ఎటువంటి పదవి ఇచ్చేందుకు కెప్టెన్ సుముఖంగా లేరు. ఈ విషయంలో ఆయనకు, హైకమాండ్ కూ ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది.

ఇదే అసలు కారణం…?

తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… అమరీందర్, హైకమాండ్ మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో వైసీపీ, టీఎంసీ, డీఎంకే లకు వ్యూహకర్తగా నియమితులై ఆ పార్టీలను విజయతీరాలకు చేర్చిన ప్రశాంత్ కిషోర్ అంటేనే హస్తం పార్టీ కి వంటిమీద కారం రాసుకున్నట్లు ఉంది. తమిళనాడును పక్కనపెడితే ఏపీలోని వైసీపీ, బెంగాల్లోని టీఎంసీ పేరు చెబితే హస్తం పార్టీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. తమిళనాడులో డీఎంకే మిత్రపక్షమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ అంటే హస్తం పార్టీ గుర్రుగా ఉంది. మొన్నటి ఏప్రిల్ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలసి పోటీ చేసినప్పటికీ ఎడమొహం పెడమొహంలాగానే వ్యవహరించాయి. పరిమిత బలం గల కాంగ్రెస్ కు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, అసలు హస్తం పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగినా డీఎంకేకు ఎదురుండదని ప్రశాంత కిషోర్ డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ కు నూరి పోశారన్న వాదనను కాంగ్రెస్ వర్గాలు వినిపిస్తున్నాయి. అందువల్ల ప్రశాంత్ కిషోర్ పేరు హస్తం పార్టీ వర్గాలకు మింగుడు పడటం లేదు.

పీకేను వదులుకునేందుకు…?

ప్రశాంత్ కిషోర్ తో కెప్టెన్ అమరీందర్ తరచూ భేటీ అవడం, ఆయన సలహాలు, సూచనలు తీసుకోవడం, వ్యూహాలను రూపొందించడం దిల్లీ పార్టీ వర్గాలకు సుతరామూ ఇష్టం లేదు. అయినప్పటికీ ప్రశాంత్ తో బంధాన్ని వీడేందుకు అమరీందర్ ఎంతమాత్రం సుముఖంగా లేరు. ఇక రాష్ర్టంలో గంటల కొద్ది కరెంటు కొరత, అడ్డూ అదుపు లేని మాదక ద్రవ్యాల వ్యాపారం, అంతర్గత కలహాలు ఎన్నికల్లో విజాయవకాశాలు దెబ్బతీస్తాయని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే ఉన్న ఒక్క రాష్రాన్నీ చేజార్చుకోక తప్పదన్న భయం పార్టీ వర్గాల్లో కనపడుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News