కొత్తపంట ఎవరి ఇంట?

సంక్రాంతి అంటేనే కొత్త పంట (ధాన్యం) ఇంటికి చేరడం. నవంబర్-డిసెంబర్ నెలల్లో వరిపంట కోసి, కుప్ప వేసి, వడ్ల గింజలు వరికుప్పలో ఎండిన తర్వాత కుప్పనూర్చి, వడ్లు [more]

Update: 2020-01-15 15:30 GMT

సంక్రాంతి అంటేనే కొత్త పంట (ధాన్యం) ఇంటికి చేరడం. నవంబర్-డిసెంబర్ నెలల్లో వరిపంట కోసి, కుప్ప వేసి, వడ్ల గింజలు వరికుప్పలో ఎండిన తర్వాత కుప్పనూర్చి, వడ్లు ఎడ్లబండిపై ఇంటికి తెస్తే, ఇల్లాలు ఆ కొత్త ధాన్యంతో అరిసెలు వండి, పాలన్నం వండి బంధువులతో సహా ఇంటిల్లిపాదికీ పెట్టడంతో పాటు, కోళ్ళు, పక్షులు, చీమలు తినడం కోసం వడ్లు రోట్లో వేసి పిండి కొట్టి దాన్ని గుమ్మంలో ముగ్గులుగా వేసి పశుపక్షాదులతో పంచుకోవడమే సంక్రాంతి. కొత్తగా వచ్చిన వరిగడ్డి, దానిలో మిగిలిన (పరిగె) వరిగింజలు తిన్న పశువులు వేసిన పేడ గొబ్బెమ్మలుగా ముగ్గుల్లో పెడితే కోడి ఆ గొబ్బెమ్మల్లో ఉన్న వడ్ల గింజలను తినడం, తన పిల్లలకు పెట్టడం ఈ పండుగలో కనిపించే దృశ్యం. అలాగే, అదే కొత్త ధాన్యాన్ని గంగిరెద్దు ఆటగాళ్ళతో సహా భిక్షగాళ్ళకు కూడా పంచుకోవడమే (ఉమ్మడి సెలెబ్రేషన్) సంక్రాంతి.

ధాన్యం ఇంటికి చేరక….

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంక్రాంతి వేరు. రాజధాని లేని రాష్ట్రంలో విభజన తర్వాత అమరావతి ఒక సెంటిమెంటుగా మార్చే ప్రయత్నం పాలకులు చేశారు. అధికారం, ధనం అండగా ఉండడం వల్ల, పైగా డాలర్లు సంపాదించే ఎన్ఆర్ఐలు తోడవడం, మీడియా నెత్తిన పెట్టుకోవడంతో తాము ఆశించిన “సెంటిమెంటు” పండిందనే అనుకున్నారు పాలకులు. పంట బాగా పండుతుంది, ధాన్యం పెద్దఎత్తున చేతికొస్తుంది అని ఆశించారు. సంక్రాంతి పండగలోని “ఉమ్మడి సెలబ్రేషన్” భావం మర్చిపోయి ధాన్యం దాచుకోడానికి తాజ్ మహల్ ను తలదన్నే గాదె నిర్మించే ప్రయత్నం చేశారు. చివరికి పంట పనలుగా ఉండగానే వరదొచ్చి మొత్తం పోయింది. ధాన్యం ఇంటికి చేరలేదు.

ఎవరి ఖాతాలో….?

ఈ సంక్రాంతిని ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలకు అన్వయిస్తే “అమరావతి” కొత్తధాన్యం అయింది. అమరావతి ఉద్యమమే ఇప్పుడు సంక్రాంతి పండుగ. ఈ ఉద్యమాన్ని పంచుకోవడమా? మొత్తం తమ ఖాతాలో వేసుకోవడమా అనేదే నేటి రాజకీయం. అలాగే సంక్రాంతి అందరి పడుగలాగే “అమరావతి” కూడా అందరి సమస్యగా చూపే ప్రయత్నం జరుగుతోంది. కొత్త పంటను మొత్తంగా తన గాదె (ధాన్యం దాచుకునే వసతి)లో వేసుకునే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీ చేస్తోంది. పంట వేసింది, సాగుచేసింది తామే కాబట్టి కొత్త ధాన్యం (అమరావతి ఉద్యమ ఫలితం) తమకే చెందాలని ప్రతిపక్ష టిడిపి ఆశిస్తోంది. పనిలో పనిగా తమకు కూడా ఈ కొత్త ధాన్యంలో ఎంతో కొంత వాటా కోసం వామపక్షాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. (అమరావతి విషయంలో వామపక్షాల తీరు మరోసారి చర్చించుకుందాం). అధికారంలో “నవ వధువు” లా కూర్చున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఈ “అమరావతి ధాన్యం” తమదే అనే దృఢ విశ్వాసంతో ఉంది. ఇంటాయన పోయిన పుట్టెడు దుఃఖంలో “నవ ముత్తైదువు”లా కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పండగ లేదు పప్పలు (అరిశెలు) లేవన్నట్టు ఉంది.

పిల్లిలా ఎదురు చూస్తూ….

సరిగ్గా ఇక్కడే రొట్టె కోసం పిట్టలు రెండూ కొట్టుకుంటే తగువు తీర్చే నెపంతో రొట్టె కొట్టేయొచ్చని బిజెపి పిల్లిలా చూస్తోంది. బీజేపీలోని కొత్త నాయకులు పిట్టపోరు, పిట్టపోరు తీర్చి రొట్టె చేజిక్కించుకుందాం అనే ఆశతో ఉండి (RSS పునాదిగా కలిగిన బీజేపీ నేతల ఆలోచనలు వేరుగా ఉన్నాయి) కొత్త ధాన్యం (అమరావతి పోరు ఫలితం) ఇంటికి తెచ్చే “కొత్త పాలేరు” (ప్రత్యామ్నాయ పదం దొరక లేదు) కోసం వెతుకులాట మొదలెట్టి కొంతమేర విజయం సాధించారు. అయితే ఈ “కొత్త పాలేరు” ధాన్యం తెచ్చి ఇంటి గాదె నింపుతాడా? లేదా? అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో ప్రధాన చర్చనీయాంశం. “అమరావతి పోరు” ధాన్యం కాదు, పందెం కోడి అనుకుంటే, ఇప్పుడు గెలిచే పుంజు ఎవరిదీ అనేది ప్రధాన ప్రశ్న. అమరావతి ధాన్యం అనుకున్నా, పందెం గెలిచిన పుంజు అనుకున్నా అవి ఎవరికి దక్కుతాయన్నదే భేతాళుడికి కూడా జవాబు దొరకని ప్రశ్న.

 

– గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News