కోట బద్దలు కొట్టాల్సిందే..!

Update: 2018-05-30 15:30 GMT

రాజుల కాలంలో కోటను ఆక్రమిస్తే రాజ్యం స్వాధీనమైనట్లే. ముఖ్యపట్టణంలో ఉండే రాజనివాసం కోట . సైనిక సంపత్తికి, రాజ్య రక్షణకు ప్రతీక. అందుకే దానికి అంతటి ప్రాధాన్యం ఉండేది. కోటను ఆక్రమించగలిగితే ఆ రాజు అధికారం అంతరించిపోయినట్లే. ప్రజాస్వామ్యంలోనూ ఈ పోకడలు కనిపిస్తుంటాయి. అయితే అవి ప్రజాతీర్పురూపంలో ప్రతిబింబస్తాయి. రాజధాని కేంద్రంగానే తాజా రాజకీయాలూ నడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఊపిరిపోసుకుంటున్న అమరావతి ఏపీ రాజకీయాల్లో కీలకపాత్రకు చేరుకుంటోంది. ప్రతిపక్షాలు ఈ కోట బద్దలుకొట్టాల్సిందే అని పట్టుపడుతున్నాయి. దీనినే కేంద్రంగా చేసుకుంటూ దుర్భేద్య దుర్గాన్ని నిర్మించుకోవాలని చూస్తోంది తెలుగుదేశం. అందరికీ లక్ష్యం అమరావతే. అధికారపక్షానికి అనుకూల టార్గెట్. ప్రతిపక్షాలకు ప్రతికూల లక్ష్యం అంతే. 2019 ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషించబోతున్న రాజధాని చుట్టూ అలుముకుంటున్న వివాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రాంతీయ విద్వేషాలు పతాకస్థాయికి చేరుకునే సూచనలు గోచరిస్తున్నాయి.

అధికారానికి ఆశల సౌధం...

అధికార తెలుగుదేశం పార్టీ అమరావతి చుట్టూ ఆశల సౌధాన్ని నిర్మించుకుంటోంది. అమరావతిని నమూనాగా చూపించి అభివృద్ధి ని ఉరుకులు పరుగులు పెట్టిస్తామని చెప్పడం ద్వారా పునరధికారాన్ని సాధించాలని కసరత్తు చేస్తోంది. సైబరాబాద్ తరహాలో ఒక కొత్త నగరం నిర్మాణం చంద్రబాబు నాయుడి వల్లనే సాధ్యమవుతుందనే ప్రచారంతో ఎన్నికల సాగరాన్ని ఈదాలనేది పార్టీ యోచన. ఏపీ విభజన తర్వాత కొత్త రాష్ట్ర నిర్మాణం సెంటిమెంటుతో 2014లో టీడీపీ అధికారాన్ని సాధించగలిగింది. ఇప్పుడు రాజధానిని అదే స్థాయిలో ఫోకస్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఆరోగ్య, విద్య,న్యాయ,పాలన వంటి పేర్లతో నవనగరాలను రాజధానిలో కొలువు తీరుస్తామంటూ గొప్పలు చెబుతోంది. ఇదంతా సాకారమైతే ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకోవడం సులభమనేది చంద్రబాబు నాయుడి భావన. అయితే ఆశించిన స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు సాగడం లేదు. శరవేగంగా నగరం రూపుదిద్దుకోవడం లేదు. తాత్కాలిక సచివాలయం మినహా నిర్మాణ పరంగా సాధించిందేమీ లేదు . ఉద్యోగులు సైతం అక్కడ ఉండటం లేదు. విజయవాడ, గుంటూరు, హైదరాబాదుల నుంచే షటిల్ సర్వీసు చేస్తున్నారు. రైతుల నుంచి 34 వేల ఎకరాలను ఉచితంగా పొందగలిగిన ప్రభుత్వం పనుల పురోగతిలో నత్తనడకను తలపిస్తోంది. అదే ఇప్పుడు శాపంగా మారబోతోంది.

కమలం కస్సుబుస్సు...

రాజధాని నిర్మాణం లో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరవైఫల్యం చెందిందని నిరూపించాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాము 2500 కోట్ల రూపాయలు ఇచ్చేశామంటున్నారు. నగరానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సైతం రాష్ట్రప్రభుత్వం ఇంతవరకూ రూపొందించుకోలేదని ఆరోపిస్తోంది. తాము అందచేసిన నిధులకు సంబంధించి వినియోగ ధ్రువపత్రాలు సమర్పించలేదని ఆక్షేపిస్తోంది. రాజధాని రోడ్లు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసే జాతీయ రహదారుల విషయంలో తాము సంసిద్దంగానే ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వమే ఆసక్తి చూపడం లేదని కేంద్రపెద్దలు దుమ్మెత్తిపోస్తున్నారు. అమరావతినే ఆధారంగా చేసుకుంటూ టీడీపీ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు బీజేపీ భారీ ప్రచారానికే సిద్ధమవుతోంది. రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు చేసే ప్రతి తప్పూ తమకు ఒక బ్రహ్మాస్త్రంగా తోడ్పడుతుందనేది కమల నాథుల యోచన. పర్యావరణ, సాంకేతిక, పాలనపరమైన లోపాలన్నిటినీ అధ్యయనం చేసి ప్రజల ముందు పెట్టేందుకు బీజేపీ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు.

జన... జగడం...

అంతా అమరావతి చుట్టూనే కేంద్రీకరిస్తున్నారు. ఇలాగైతే కళింగాంధ్ర ఉద్యమం రాదని గ్యారంటీ ఏమిటి? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రానున్న ప్రమాదానికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికే రాయలసీమలో ప్రత్యేక వాద ఆందోళన వ్యక్తమవుతోంది. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఉద్యమాలు సాగుతున్నాయి. అమరావతి తమ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ తమ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోందనే భావనలు రాయలసీమ ప్రజల్లో నెలకొన్నాయి. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అమరావతి జపంతో ఈ విద్వేషభావనలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల తో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలవరకూ ఇదే భావన వ్యాపించింది. అటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ క్రమేపీ ప్రాంతీయంగా తాము నష్టపోతున్నామనే ఆలోచన మొగ్గ తొడుగుతోంది. వైసీపీ, జనసేన ఈ దిశలో తమ వంతు కార్యాచరణను మొదలు పెట్టేశాయి. విజయసాయి రెడ్డి ఇప్పటికే విశాఖలో పాదయాత్ర చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ 45 రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్ర కు జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు బీజేపీ రైల్వేజోన్ వంటి విషయాలను పరిష్కరించి తామే టీడీపీ కంటే మెరుగు అని నిరూపించుకోవాలనే దిశలో ఎత్తుగడలు వేస్తోంది. రాజధాని,ప్రాంతీయ పక్ష పాతం అనే చక్రబంధంలో టీడీపీని ఇరికించాలని ప్రధాన పార్టీలన్నీ చూస్తున్నాయి. అమరావతి అద్భుత నగరం అనే ఊహల ఉయ్యాల ఊగుతున్న టీడీపీ వాస్తవంలో జరుగుతున్న డ్యామేజీని గ్రహించలేకపోతోంది. నేలమీదకి దిగి రాకపోతే తొమ్మిది జిల్లాల్లో పార్టీని ఇక్కట్ల పాలు చేసే ప్రాంతీయ వ్యూహం పక్కాగా రూపుదిద్దుకొంటోంది. అధికారపక్షానికి అమరావతే అశనిపాతంగా మారే ప్రమాదం గోచరిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News