వారి వెనక వారేనా?

రాజధాని రైతులు ఇపుడు పోరాట బాట పట్టారు. అంటే గట్టిగా కాదు కానీ మెల్లగానే వారు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. అందులో భాగంగా వారు అన్ని [more]

Update: 2019-08-26 00:30 GMT

రాజధాని రైతులు ఇపుడు పోరాట బాట పట్టారు. అంటే గట్టిగా కాదు కానీ మెల్లగానే వారు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. అందులో భాగంగా వారు అన్ని పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఇందులో అగ్ర తాంబూలం మాత్రం బీజేపీకే ఇచ్చారు. మొట్టమొదట ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటి తలుపు తట్టిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన కన్నా ముఖ్యమంత్రి జగన్ కి లేఖ ఒకటి రాసి మరీ రైతుల పక్షాన తాము ఉన్నామని గట్టిగా చెప్పేశారు. పైగా జగన్ ని సైతం ముగ్గులోకి లాగి ఆనాడు మీరు కూడా రాజ‌ధానిగా అమరావతికి మద్దతు ఇచ్చారు అని గుర్తు కూడా చేశారు. అక్కడ రాజధాని తరలించాలని చూస్తే ఊరుకోమని కూడా హెచ్చరించారు. ఇక రైతులు తరువాత కలిసింది జనసేనాని పవన్ కళ్యాణ్ దగ్గర కు కూడా రైతులు తమ బాధలను చెప్పుకుని ఆయన మద్దతు కోరారు.

అధికార పార్టీని వదిలేసి….

నిజానికి రైతులకు రాజధాని పోతుందన్న బాధ ఉంటే ముందుగా కలవాల్సింది, క్లారిటీ తీసుకోవాల్సింది వైసీపీ సర్కార్ పెద్దల నుంచి. కానీ చిత్రంగా రైతులు బీజేపీ నుంచి మొదలెట్టారు. బీజేపీకి ఏపీలో పాత్ర శూన్యం, అసెంబ్లీలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చాయి. ఏదో హడావుడి చేస్తున్నారు తప్ప ఏపీ వరకూ బీజేపీకి ఆటలో అరటిపండు పాత్ర మాత్రమే. అయితే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి, రాజధానికి నిధులు ఇవ్వాలి కాబట్టి కొంతమేర అటునుంచి ప్రభావితం చేస్తారన్న ఆశతో కలిశారు అంటే తప్పులేదు. కానీ అగ్ర తాంబూలం వారికే అంటేనే కొంత ఆశ్చర్యంగానూ, ఆసక్తిగానూ వుంది. మరో వైపు పవన్ కళ్యాణ్ విషయమూ ఇంతే ఆయనకు కూడా ఏపీ అసెంబ్లీలో బలం లేదు. ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన జనంలో పోరాటం చేస్తారని అనుకున్నా ఇంకా వైసీపీ సర్కార్ నుంచి రాజధాని తరలింపుపై కచ్చితమైన మాట ఏదీ లేదు. ఆ మాత్రం దానికి పోరాటం దాకా వెళ్ళడం అంటే ఇదేదో లోపాయికారి వ్యవహారం చాలానే ఉన్నట్లుగా అర్ధమవుతోంది.

టీడీపీని పక్కన పెట్టి……

చిత్రమేంటంటే అమరావతి రాజధాని కావాల్సింది టీడీపీకే. అక్కడ భూములు కొని పెట్టి మరీ రియల్ దందాకు తెరతీసింది తెలుగు తమ్ముళ్ళే. అందువల్ల వారిది ఏడుపు కాదు, కన్నీటి సునామీయే. ఇక రాజధాని తరలింపు విషయం ఏదీ వైసీపీ చెప్పకపోయినా అనుమానంతో మొదట రంకెలేసింది రచ్చ చేసిందీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబే. అమరావతి సృష్టికర్త కూడా అయిన ఆయన్ని వదిలేసి రైతులు ఇలా మిగిలిన పార్టీల చుట్టూ తిరగడం అంటే ఇదంతా రాజకీయ ప్రేరేపితమైన వ్యవహారంగా ఉందని వైసీపీ అనుమానిస్తోంది. చంద్రబాబే రాజధాని రైతుల్లో టీడీపీ సెక్షన్ గా భావించే వారిని ఎంపిక చేసి మరీ ఇలా బీజేపీ, జనసేల వద్దకు పంపుతున్నారా అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఆ రెండు పార్టీల మద్దతు కూడా ముందే తీసుకుంటే చివరాఖరున తాను రంగంలోకి దిగి పోరాటం చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని బాబు గారి ఆలోచంగా చెబుతున్నారు.

టీడీపీ వెనక ఉందా?

పైగా రాజకీయంగా జనసేన, బీజేపీల వైపు నుంచి ఇలా మద్దతు సంపాదిస్తే భవిష్యత్తు రాజకీయాలకు ఉపయోగపడుతుందనే దూరాలోచన కూడా ఉందని అంటున్నారు. మరో వైపు అన్నం పెట్టే అమ్మ లాంటి వైసీపీ వద్దకే మొదట వస్తే పరిష్కారం లభిస్తుంది కదా అన్న వారూ లేకపోలేదు. కానీ అక్కడ రైతుల పేరిట వెనక ఉన్నది టీడీపీ అయినపుడు వైసీపీ ని ఎందుకు కలుస్తుందని కూడా అంటున్నారు. ఇక టీడీపీ పక్షాల రైతులే కాదు, వైసీపీ పక్షాన రైతులు కూడా ఉన్నారని, ఎవరికీ సంబంధం లేని పేద రైతులు కూడా ఉన్నారని, అందరితోనూ సంప్రదించి న్యాయం చేస్తామని వైసీపీ అంటోంది. రాజధాని మార్పు విషయంలో వైసీపీ బయటకు చెప్పకపోయినా రైతులకు అన్యాయం జరగదని మాత్రం భరోసా ఇస్తోంది. మరి ఈ రైతుల ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం కధ అంతా టీడీపీ రాజకీయమేనని తేల్చేస్తోంది.

Tags:    

Similar News