అనుకున్నదే జరిగితే?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు అమరావతిని 2014 లో నిర్ణయించేశారు. శివరామకృష్ణన్ వంటివారు వద్దు మొర్రో అంటూ మొత్తుకున్నా అధికార కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ అమరావతిపైనే పెట్టారు చంద్రబాబు. [more]

Update: 2020-01-28 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు అమరావతిని 2014 లో నిర్ణయించేశారు. శివరామకృష్ణన్ వంటివారు వద్దు మొర్రో అంటూ మొత్తుకున్నా అధికార కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ అమరావతిపైనే పెట్టారు చంద్రబాబు. ఈ నిర్ణయంపై ఎన్ని విమర్శలు వచ్చినా విపక్షాలు, నిర్వాశితులు అయ్యే రైతులు ఉద్యమించినా పెడచెవిన పెట్టారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను అనుకున్నంత వేగంగా పట్టాలు ఎక్కించలేదు సరికదా అంతా తాత్కాలికం అని చెప్పేశారు. శాశ్వత భవనాల డిజైన్లు అంటూ దేశాలు పట్టుకు తిరిగి పలువురిచేత బొమ్మలు వేయించి కాలక్షేపం చేసేశారు. ఈ ప్రభావం మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పతనానికి తెరతీసిన అంశాల్లో ఒకటిగా మారింది.

జగన్ సర్కార్ దెబ్బకి …

ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నా రేపో మాపో వైసిపి అనుకున్నదే జరిగిపోనుంది. శాసన, పాలన, న్యాయ రాజధానులంటూ వైఎస్ జగన్ పాలనావికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాలు తెరపైకి తెచ్చి చంద్రబాబు కి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో కీలక బిల్లులు ఆమోదించి శాసన మండలికి పంపారు. అక్కడ అధికారపార్టీకి చంద్రబాబు చుక్కలు చూపించారు. మండలి రద్దు కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న జగన్ అందివచ్చిన అవకాశం క్షణం ఆలస్యం లేకుండా వదులుకోలేదు. అసెంబ్లీలో మండలి రద్దు అంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇది టిడిపి ని తీవ్రంగా కలవరపెడుతుంది.

మరింత చిన్నబోతుందా …

అమరావతి లో రాజధాని పూర్తిగా ఎత్తేయడం లేదని శాసనాలు ఇక్కడినుంచే చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. పాలన, న్యాయ విభాగాలు లేని రాజధానిగా అమరావతికి అరకొరగా మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఇక్కడ సందడే ఉండదు. డబ్బులు లేవంటున్న ప్రభుత్వం తాత్కాలిక భవనాలనే శాశ్వత భవనాలు చేసుకోండని ఇప్పటికే విపక్ష అధినేత చంద్రబాబు సలహా ఒకటి పాడేశారు. దాంతో జగన్ అమరావతిలో చట్టసభలకు ఐకానిక్ భవనాల నిర్మాణం వంటివి కట్టనే కట్టరు.

శాసనమండలి కూడా…

ఇదే కాకుండా శాసనమండలి రద్దుకు ఎప్పుడో అప్పుడు కేంద్రం ఆమోదం లభిస్తే ముఖ్యమైన ఆ సభ కూడా అమరావతికి లేకుండా పోతుంది. దాంతో కేవలం 175 మంది ఎమ్యెల్యేలకు మాత్రమే నివాస సదుపాయాల నిర్మాణం పూర్తి చేస్తే సరిపోతుంది. మండలి కోసం కానీ అందులో సభ్యుల కోసం ఇక ఎలాంటి ఖర్చు పెట్టాలిసిన పనే ఉండదు. ఆ రకంగా అమరావతి రాబోయే రోజుల్లో మరింత నిస్తేజంగా మారనుంది. అందులోను విజయవాడ – గుంటూరు కి దూరంగా 30 నుంచి 40 కిలోమీటర్లు పరిధి విస్తరించడానికి దశాబ్దాల కాలమే పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఆయన పీఠం తిరిగి ఎక్కినా సాకారం చేసుకోవడం అసాధ్యమనే విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News