ఆమంచికి అదే జరుగుతుందా?

అధికార వైసీపీలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. నాయ‌కులు పార్టీ కోసం ప‌నిచేస్తే స‌రే.. లేదు.. స్వలాభాల కోసం ప‌రుగులు పెట్టినా.. గంతులేసినా.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తోక‌లు [more]

Update: 2019-11-05 14:30 GMT

అధికార వైసీపీలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. నాయ‌కులు పార్టీ కోసం ప‌నిచేస్తే స‌రే.. లేదు.. స్వలాభాల కోసం ప‌రుగులు పెట్టినా.. గంతులేసినా.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తోక‌లు క‌త్తిరిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌డిచిన రెండు మూడు వారాలుగా ప్రకాశం జిల్లా ప‌రుచూరు రాజ‌కీయాలు చ‌ర్చకు వ‌చ్చాయి. ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటి చేసి ఓడిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వరావు ఉదంతం రాజ‌కీయాల్లో ప్రధానంగా చ‌ర్చకు వ‌చ్చింది. భార్య ఒక పార్టీలో, భ‌ర్త అధికార పార్టీలో ఉండ‌డంతో వైసీపీ నుంచి ఒకింత వ్యతిరేక‌త వ‌చ్చింది. అధికార పార్టీపైనా, సీఎం జ‌గ‌న్‌పైనా ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు భార్య, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి విమ‌ర్శలు చేయ‌డం తెలిసిందే.

ఆమంచి పరిస్థితి కూడా….

దీంతో ఫైరైన జ‌గ‌న్‌.. ఉంటే అంద‌రూ వైసీపీలోను, లేదంటే మీ ఇష్టమొచ్చిన పార్టీలో ఉండాల‌ని ఆదేశించి నట్టు వార్తలు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న తాలూకు ప‌ర్యవ‌స‌నాలు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ద‌గ్గుపాటికి పొమ్మన‌కుండా పొగ పెట్టే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. చివ‌ర‌కు ద‌గ్గుబాటి త‌నంత‌ట తానుగా పార్టీని వీడి వెళ్లి బ‌య‌ట‌కు వెళ్లేలా చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇదే జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నాయ‌కుడు ఆమంచి కృష్ణమోహ‌న్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ఆయ‌న త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న‌తో ఒంట‌రిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆత‌ర్వాత చంద్రబాబు పిలుపు మేర‌కు టీడీపీలోకి వ‌చ్చినా.. అంటీ ముట్టన‌ట్టు వ్యవ‌హ‌రించారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్ హెచ్చరించినా…..

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ క‌నిపించినా… చీరాల‌లో త‌న‌దే గెలుప‌ని భావించిన ఆమంచి కృష్ణమోహన్ మాత్రం ఓట‌మి పాల‌య్యారు. ఆమంచిపై టీడీపీ అభ్యర్థి క‌ర‌ణం బ‌లారం ఏకంగా 17 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. స‌రే.. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు సహ‌జం. అయితే, ఆ త‌ర్వాత త‌మ పార్టీ అధికారంలో ఉంద‌ని, నేను ఓడినా.. నాదే ఆధిప‌త్యమ‌ని ఆయ‌న, ఆయ‌న సోద‌రుడు స్వాములు, ఆయ‌న కుమారుడు కూడా పోలీసులు, అధికారుల‌పై రెచ్చిపోవ‌డం, మీడియాలో విస్తృతంగా ప్రచారం కావ‌డంతో ప్రభుత్వంపై అప‌వాదు వ‌చ్చింది. ఈ క్రమంలోనే జ‌గ‌న్ ఒక‌సారి ఇన్‌డైరెక్ట్‌గా వీరిని హెచ్చరించారు. పార్టీలో ఉండాల‌ని అనుకుంటే.,. జాగ్రత్తగా వ్యవ‌హ‌రించాల‌ని, ప్రజ‌ల‌కు మ‌నం సేవ‌కులం అనే విష‌యాన్ని మ‌రిచిపోరాద‌ని వెల్లడించారు.

ఎక్కడా తగ్గక పోవడంతో….

అయిన‌ప్పటికీ.. కొన్నాళ్లుగా మ‌ళ్లీ ఆమంచి కృష్ణమోహన్ వ్యవ‌హారాలు ముదురుతున్నాయి. ఓ ద‌ళిత వ‌ర్గానికి చెందిన జ‌ర్నలిస్టు కుటుంబాన్ని గ్రామం నుంచి బ‌హిష్కరించిన వ్యవ‌హారం వెనుక ఆమంచి కృష్ణమోహన్ వ‌ర్గీయులు ఉండ‌డంతో ఈ వివాదం ర‌చ్చకెక్కడం సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకోవ‌డం ప‌రిహారం ఇప్పించ‌డం తెలిసిందే. అయితే, ఇప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ వ‌ర్గం ఎక్కడా త‌గ్గడం లేద‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ వీరికి శ్రీముఖం చూపించాల‌ని అనుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఆయనను తీసుకొస్తే…..

ఈ నేప‌థ్యంలోనే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్లడంతో అప్పటి వ‌ర‌కు చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న యెడం బాలాజీ టీడీపీలోకి వెళ్లి క‌ర‌ణం గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు ప‌ర్చూరులో ద‌గ్గుపాటి ఎంట్రీకి ముందు వ‌ర‌కు ప‌ర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రావి రామ‌నాథంను ద‌గ్గుబాటికి చెక్ పెట్టేందుకు వైసీపీలోకి తీసుకు వ‌చ్చారు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు వైసీపీలోనే ఉన్న యెడం బాలాజీని తిరిగి వైసీపీలోకి తీసుకు వ‌చ్చే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. అదే జ‌రిగితే ఆమంచి కృష్ణమోహన్ కి ఇది జ‌గ‌న్ మార్క్ వార్నింగ్ అనే చెప్పాలి.

Tags:    

Similar News