నిజమైన తమ్ముడు ఆయనేనట

ఆయన 2014లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రభుత్వ ఉపాద్యాయుడిగా ఉన్న ఆయన చంద్రబాబు పిలుపుతో పచ్చ కండువా కప్పుకొన్నారు. తనది కాకపోయినా.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు [more]

Update: 2019-08-03 05:00 GMT

ఆయన 2014లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రభుత్వ ఉపాద్యాయుడిగా ఉన్న ఆయన చంద్రబాబు పిలుపుతో పచ్చ కండువా కప్పుకొన్నారు. తనది కాకపోయినా.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బాబు ఆదేశించగానే తలకు గుడ్డ చుట్టుకుని ప్రజాక్షేత్రంలో దూకారు. విజయం వరించేలా కష్టపడ్డారు. అందరినీ ఏకతాటిపై నిలిపారు. విజయాన్ని కానుకగా అందించారు. కష్టానికి మారుపేరుగా నిలిచిన ఆయనే మాజీ మంత్రి, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన కొత్తపల్లి శ్యామ్యూల్‌ జవహర్‌. టీడీపీలో కొత్తనేత అయినా.. ఆయన ఇప్పుడు రికార్డు స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించారు.

సీనియర్లు ఉన్నప్పటికీ….

నిజానికి పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ.. వారికన్నా మించిన స్థాయిలో ఇప్పుడు జవహర్‌ తన గళాన్ని వినిపిస్తున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది సీనియర్లు ఇంటికే పరిమితమయ్యారు. తాము ఏం మాట్లాడితే.. జగన్‌ ప్రభుత్వం ఎలాంటి కేసు పెడుతుందోనని చాలా మంది టీడీపీ నాయకులు భయంతో వణికిపోతున్నారు.వీరిలో కీలక నేతలు, బాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఉన్నారు. కొంద‌రు టీడీపీ వ్యాపార‌వేత్తలు అయితే గోడ దూకేస్తున్నారు. మ‌రి కొంద‌రు నోటికి ప్లాస్టర్ వేసుకున్నట్టుగా మారిపోయారు. అయితే, వీరందరికీ భిన్నంగా గత ప్రభుత్వంలో మంత్రిగా చేసినప్పటికీ.. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి జవహర్‌. జగన్‌కు ఎప్పటికప్పుడు జవహర్‌ కౌంటర్లు ఇస్తున్నారు.

పార్టీ వాయిస్ ను….

ప్రతి రోజు మీడియాలో ఏదో ఒక చ‌ర్చల్లో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండ‌గ‌డుతూ జవహర్‌ పార్టీ వాయిస్ బ‌లంగా వినిపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు కృష్ణాజిల్లాలోని తన సొంత నియోజకవర్గం తిరువూరు నుంచి జవహర్‌ పోటీ చేశారు. అయితే, జగన్‌ సునామీ ముందు జవహర్‌ నిలవలేక పోయారు. దీంతో ఓటమిపాలయ్యారు. అయినా కూడా కొద్దిరోజుల్లోనే ఆయన తన ఓటమిని పక్కన పెట్టి పార్టీని నిలబెట్టేందుకు కంకణం కట్టుకున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా కేడర్‌కు అందుబాటులో జవహర్‌ ఉంటున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. రాజకీయాల్లో ఓటమి సహజమేనని, ధైర్యమే రాజకీయాలను ముందుకు నడిపిస్తుందని జవహర్‌ వారికి బోధిస్తున్నారు.

స్థానిక ఎన్నికల కోసం….

దీంతో తిరువూరులో ఓడిపోయినప్పటికీ.. పార్టీలో ఎక్కడా నిస్తేజం కనిపించడం లేదు. పైగా ఎప్పటికైనా గెలుపు మాదే అనే ధీమా నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ కనిపిస్తోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కూడా నిర్ణయించుకుంది. ఈ మొత్తం వ్యవహారం కూడా జవహర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేందుకు తార్కాణంగా నిలిచిందనిఅంటున్నారు పరిశీలకులు. సో.. ఎందరు ఉన్నా.. నిఖార్సయిన తమ్ముడిగా జవహర్ ఫైట్ చేస్తోన్న తీరు పార్టీ వాళ్లకు ఎలా ఉన్నా మీడియా, సామాన్య జ‌నాల్లో మాత్రం చ‌ర్చనీయాంశంగా ఉంది.

Tags:    

Similar News