గ్రేటర్ లో మళ్లీ ఎన్నికలు తప్పవా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి దాదాపు నెల రోజులు గడిచిపోయింది. అయితే గత పాలకవర్గం సమయం పూర్తి కాకపోవడంతో ఇంకా కొత్త పాలకవర్గం బాధ్యతలను [more]

Update: 2021-01-06 09:30 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి దాదాపు నెల రోజులు గడిచిపోయింది. అయితే గత పాలకవర్గం సమయం పూర్తి కాకపోవడంతో ఇంకా కొత్త పాలకవర్గం బాధ్యతలను చేపట్టలేదు. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అయితే తమకు పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో టీఆర్ఎస్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది.

పూర్తి స్థాయి మెజారిటీ…..

అయితే పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో మేయర్ పదవి చేపట్టడం కష్టంగా మారింది. మేయర్ పదవి చేపట్టాలంటే ఎంఐఎం తో నేరుగా పొత్తు పెట్టుకోక తప్పదు. ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంఐఎంతో నేరుగా పొత్తు పెట్టుకునే సాహసం ఇప్పట్లో టీఆర్ఎస్ చేయదనేది వాస్తవం. దీంతో టీఆర్ఎస్ గ్రేటర్ మేయర్ పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఫిబ్రవరి తర్వాత….?

పాత పాలకవర్గం కాలపరిమితి ఫిబ్రవరి వరకూ ఉంటుంది. పాత పాలకవర్గం గడువు ముగిసిన తర్వాతనే కొత్త పాలకవర్గం బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. కానీ మొన్నటి ఫలితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పాలకవర్గం బాధ్యతలను చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ఫిబ్రవరి నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో స్పెషల్ ఆఫీసర్ పాలనను పెడతారన్న ప్రచారం జరుగుతుంది.

స్పెషల్ ఆఫీసర్ పాలనకే…..

మరోవైపు బీజేపీ కొత్త పాలకవర్గానికి బాధ్యతలను అప్పగించాలని ఆందోళనకు దిగింది. ఎన్నికల కమిషన్ పై వత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వద్ద రెండు ఆప్షన్లు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి ఫిబ్రవరి నుంచి గ్రేటర్ మున్సిపల్ పరిధిలో స్పెషల్ ఆఫీసర్ పాలన పెట్టడం. రెండోది మొన్న జరిగిన ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడం. రెండో ఆప్షన్ వైపు టీఆర్ఎస్ మొగ్గు చూపే అవకాశముందని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే ఎన్నికలను రద్దు చేసే నిర్ణయం తీసుకోకపోవచ్చు. స్పెషల్ ఆఫీసర్ పాలనకే టీఆర్ఎస్ మొగ్గుచూపే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News