పని చేసుకోనివ్వరా? “పిల్” అంటే రాజకీయ ప్రయోజనమేనా?

మన రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యానికి పునాదిగా నాలుగు వ్యవస్థలు రూపొందించారు. అవి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార వ్యవస్థ. ఈ నాలుగు వ్యవస్థలు [more]

Update: 2020-05-11 00:30 GMT

మన రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యానికి పునాదిగా నాలుగు వ్యవస్థలు రూపొందించారు. అవి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార వ్యవస్థ. ఈ నాలుగు వ్యవస్థలు సవ్యంగా పనిచేస్తే ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని ఆశించారు. చిత్రమేంటంటే ఒక వ్యవస్థ జోకికి మరో వ్యవస్థ పోకుండా వేటికవే స్వతంత్ర వ్యవస్థలుగా తీర్చిదిద్దారు వీటి మధ్య ఒక సన్నని రేఖ ఉంది. ఆ అంతరమే ప్రజాస్వామ్య స్పూర్తికి అందం, అర్ధంగా భావించారు, నిర్వచించారు. కానీ అనేక దశాబ్దాల తరువాత ఈ వ్యవస్థల నిర్వహణపైన ఇటీవల రోజులలో విమర్శలు వస్తున్నాయి. పైగా ఒకదాని విధుల్లో మరోక వ్యవస్థ జోక్యం కూడా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అంతిమం కావాలి…

ప్రజాస్వామ్యంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నా అంతిమ నిర్ణయం, అధికారం ప్రజలది కావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి. ఆ విధంగా చూసినట్లైతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులతో కూడిన శాసన వ్యవస్థకు ఎక్కువ బాధ్యతలు, భాగస్వామ్యం ఉంటాయి. మిగిలిన వ్యవస్థలకు ప్రజలతో నేరుగా భాగస్వామ్యం లేదు. ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అతిమంగా ప్రజా కోర్టులోనే తీర్పు కోరుకుంటాయి. అవి మరీ దారుణంగా ఉన్నపుడు అరుదైన సందర్భాలలో మాత్రమే కోర్టుల జోక్యం అత్యవసరం అవుతుంది.

జరుగుతున్నదేంటి…?

ఇక వర్తమాన కాలంలో దేశంలోనూ, కొన్ని రాష్ట్రాల్లోనూ చూసుకున్నపుడు కోర్టుల జోక్యం ప్రభుత్వాల దైనందిన పాలన్లో ఎక్కువ అయిపోతోంది అన్న భావన బలపడుతోంది. ప్రభుత్వాలకు కొన్ని విధానాలు ఉంటాయి. అవి ఆధికారంలోకి వచ్చినపుడు చేసిన వాగ్దానాలు కానీ, ఇచ్చిన హామీలు కానీ దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు అమలు చేస్తాయి. వాటి మీద విమర్శలు, సూచనలు చేసే అధికారం విపక్షానికి ఎపుడూ ఉంటుంది. అవి మంచివి కాకపోతే అయిదేళ్ల తరువాత ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఎటూ ఓడిస్తారు. కానీ ప్రతీ ప్రభుత్వ నిర్ణయం కోర్టు ముందుకు రావడం, అక్కడ వాటి మీద తీర్పులు వెలువడడం వల్ల ప్రభుత్వాల దైనందిన పాలనకు అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయన్న వాదన ఈ మధ్యన న్యాయ వర్గాల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రజా ప్రయోజనమా…?

మనకు ప్రజా ప్రయోజనం పేరిట ఎవరైనా వ్యాజ్యం కోర్టుల్లో వేసే సదుపాయం న్యాయ వ్యవస్థలో కల్పించారు. అయితే మొదట్లో అది స్పూర్తివంతంగా పనిచేసినా కూడా తరువాత కాలంలో మాత్రం ప్రజల ప్రయోజనాల బదులు రాజకీయ ప్రయోజనాలే అధికంగా కనిపిస్తునాయన్న విమర్శలు ఉన్నాయి. దాంతో ఉమ్మడి ఏపీలో అప్పటి న్యాయమూర్తులు ప్రజావ్యాజ్యాలను ఎక్కువగా ప్రోత్సహించరాదని నిర్ణయించారు. ముందు ఒక ఫిర్యాదు సంబంధిత శాఖల్లో ఇవ్వాలని దశల వారీగా అది దాటుకుని చివరికి హైకోర్టు దాకా రావాలని కూడా అప్పట్లో అభిప్రాయపడ్డారు. ఆ విధంగా చెప్పాలంటే ప్రజా వ్యాజ్యాలు మొదట మున్సిఫ్ కోర్టులో కూడా దాఖలు చేయాలి. కానీ ఇపుడు నేరుగా పదులు, వందల సంఖ్యలో పిల్స్ నేరుగా పెద్ద కోర్టులకే సరాసరి వస్తున్నాయి.

చర్చిస్తారా …?

ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపుగా నూటికి తొంబై తొమ్మిది శాతం తీర్పులు సర్కార్ కి వ్యతిరేకంగా వచ్చాయి. ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు, పొరపాట్లు, తడబాట్లు వంటివి కూడా కోర్టులలో ఆక్షేపణకు గురి కావచ్చు. అయితే సర్కార్ తీసుకునే ప్రతీ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలవడం అంటే పాలకుల కాళ్ళకు అడ్డం పడినట్లేన‌న్న కూడా వాదనలు ఉన్నాయి. ఏ వాదనలు ఎలా ఉన్నా కూడా మొత్తం మీద చూసుకుంటే ఎవరు పరిధులు విధులు వారికి ఉన్నాయి. అంతా కలసి అంతిమంగా ప్రజల తరఫున పనిచేయాలి. చిట్ట చివరి అధికారం, తీర్పులను ప్రజలకే వదిలేయాలి. అపుడే ప్రజాస్వామ్యం స్పూర్తివంతంగా ఉంటుందని నిపుణులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News