ఆర్కే మంగళగిరిని వద్దనుకుంటున్నారా?

ప్రస్తుతం గుంటూరు జిల్లా అధికార పార్టీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు మ‌రో సీనియ‌ర్ ఎమ్మెల్యే చాప‌కింద నీరులా ఎర్త్ [more]

Update: 2021-03-31 08:00 GMT

ప్రస్తుతం గుంటూరు జిల్లా అధికార పార్టీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు మ‌రో సీనియ‌ర్ ఎమ్మెల్యే చాప‌కింద నీరులా ఎర్త్ పెట్టే ప‌ని మొద‌లు పెట్టేశార‌ట‌. రాజ‌ధాని ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. ఆయ‌న 2014లో 12 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. మొన్న ఏకంగా చంద్రబాబు త‌న‌యుడు నారా లోకేష్‌ను ఓడించి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని స్వయంగా హామీ ఇవ్వడంతో ఆ ఆశ‌తోనే ఉన్న ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి ప్రస్తుతం సీఆర్డీయే చైర్మన్‌గా ఉన్నత హోదాలోనే ఉన్నారు. తాజాగా అమ‌రావ‌తి భూముల విష‌యంలో చంద్రబాబును కోర్టుకు లాగారు. ఆళ్ల కుటుంబం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితం. ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి సోద‌రుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సైతం ప్రస్తుతం రాజ్యస‌భ స‌భ్యుడిగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

వచ్చే ఎన్నికల నాటికి….

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేయ‌డం ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి కి ఇష్టం లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పొన్నూరుపై క‌న్నేశార‌ని… అందుకోసం ఆయ‌న పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు వెంక‌ట రోశ‌య్యకు చాప‌కింద చ‌క్కగా ఎర్త్ పెట్టే ప‌ని కూడా ప్రారంభించారన్నదే జిల్లా వైసీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న చ‌ర్చ ? ఇందుకు తాజాగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లే నిద‌ర్శనంగా ఉన్నాయి. మంగ‌ళ‌గిరిలో ఎక్కువ పంచాయ‌తీల్లో వైసీపీ విజ‌యం సాధించినా రాజ‌ధాని మార్పు ప్రభావం మాత్రం ఇక్కడ ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గానే ఉంది. అది ఇప్పటికిప్పుడు ప్రభావం చూపించ‌క‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా రాష్ట్ర వ్యాప్త ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా మంగ‌ళ‌గిరి, తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంతో కొంత ప్రభావం త‌మ‌పై ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని వైసీపీ వ‌ర్గాలే భావిస్తున్నాయి.

పద్మశాలీలకే సీటు అంటూ……

ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి కి కూడా ఈ విష‌యం తెలియంది కాదు.. ఈ క్రమంలోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేదంటున్నారు. అస‌లు మంత్రి ప‌ద‌వి ఇవ్వక‌పోవ‌డంతోనే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద యాక్టివ్‌గా ఉండ‌డం లేదంటున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఇక్కడ పోటీ చేయ‌న‌ని… ఇక్కడ బ‌లంగా ఉన్న బీసీ వ‌ర్గమైన ప‌ద్మశాలీల‌కే తాను సీటు ఇప్పిస్తాన‌ని కూడా ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి స్థానికంగా చెప్పేస్తున్నార‌ట‌. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఇక్కడ రాజ‌ధాని ప్రభావం నుంచి త‌ప్పించుకోవ‌డంతో పాటు బీసీల కోసం తాను సీటు త్యాగం చేశాన‌ని చెప్పుకోవ‌డ‌మే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి ఉద్దేశ‌మంటున్నారు.

వర్క్ స్టార్ట్ చేశారట……

అదే టైంలో ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పొన్నూరుల ఆయ‌న వ‌ర్క్ స్టార్ట్ చేసేశారు. పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల కేంద్రమైన పెద‌కాకాని మేజ‌ర్ పంచాయ‌తీ ఆళ్ల సోద‌రుల స్వగ్రామం. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఇక్కడ ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి మాతృమూర్తి స‌ర్పంచ్‌గా గెలిచారు. ఇక తాజా స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పెద‌కాకానిలో టీడీపీ గెలిచింది. పైగా ఆళ్ల సోద‌రులు ఓటేసిన వార్డును కూడా టీడీపీయే గెలుచుకుంది. ఇంకా చెప్పాలంటే పెద‌కాకాని మండ‌లం మొత్తం మీద వైసీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బలు త‌గిలాయి. ఇంకా చెప్పాలంటే రాష్ట్రం అంతా వైసీపీ ప్రభంజ‌నం వీచినా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ స‌త్తా చాటింది. దీని వెన‌క ర‌క‌ర‌కాల ప్లాన్లు అమ‌లు అయ్యాయ‌ని వైసీపీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారు.

పునాదులు వేసుకుంటూ…..

గ‌త ఎన్నిక‌ల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య గెలుపుకు పెద‌కాకాని మండ‌లం ప్రధాన కార‌ణం. ఈ మండ‌లంలోని నంబూరు గ్రామం నుంచే 5 వేల పైచిలుకు మెజార్టీ రోశ‌య్యకు వ‌చ్చింది. ఇప్పుడు అక్కడ రోశ‌య్యను కాద‌ని వైసీపీ రెబ‌ల్ స‌తీష్‌రెడ్డి వ‌ర్గం మేజ‌ర్ పంచాయ‌తీని గెలుచుకుంది. ప‌లు చోట్ల రోశ‌య్య నిల‌బెట్టిన వ‌ర్గం కాద‌ని టీడీపీ అభ్యర్థులు విజ‌యం సాధించారు. ఈ మార్పు వెన‌క ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి ఉన్నార‌న్నదే స్థానికంగా వినిపిస్తోన్న టాక్ ? ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కిలారు రోశ‌య్యను వ్యతిరేకిస్తోన్న నాయ‌కుల‌ను ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి బాగా ఎంక‌రేజ్ చేస్తున్నార‌ని.. ఇప్పటి నుంచి అక్కడ త‌న వ‌ర్గం కోసం ఓ పునాది వేసుకుంటున్నార‌ని జ‌రుగుతోన్న ప‌రిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాను పొన్నూరు నుంచే పోటీ చేస్తాన‌ని చెపుతోన్న ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి అవ‌స‌రం అయితే రోశ‌య్య గుంటూరు ప‌శ్చిమానికి మారుతార‌ని కూడా చెపుతున్నార‌ట‌. దీంతో ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి , రోశ‌య్య మ‌ధ్య దూరం పెరిగింద‌నే అంటున్నారు.

Tags:    

Similar News