ఏం చేస్తే.. ఏమ‌వుతుందో.. ఈ మంత్రిగారి టెన్షన్ అదే

మంత్రి అంటేనే.. దూకుడు నిర్ణయాల‌కు ప్రతీక‌! వేగవంత‌మైన నిర్ణయాల‌కు, ముందుచూపు వ్యవ‌హారాల‌‌కు పెట్టింది పేరు. అయితే, అంద‌రూ అలా ఉంటారా ? అంటే.. క‌ష్టమే. ఏం చేస్తే.. [more]

Update: 2020-06-25 02:00 GMT

మంత్రి అంటేనే.. దూకుడు నిర్ణయాల‌కు ప్రతీక‌! వేగవంత‌మైన నిర్ణయాల‌కు, ముందుచూపు వ్యవ‌హారాల‌‌కు పెట్టింది పేరు. అయితే, అంద‌రూ అలా ఉంటారా ? అంటే.. క‌ష్టమే. ఏం చేస్తే.. ఏమ‌వుతుందో.. ఏం మాట్లాడితే.. ఏం కొంప‌లు అంటుకుంటాయో.. అనే త‌ర‌హాలో భ‌యం భ‌యంగా వ్యవ‌హ‌రించే నాయ‌కులు, మంత్రులు ఉన్న కాలం ఇది. దీంతో మాట్లాడ‌కుండా ఉంటేనే బెట‌ర్ అనుకునే మంత్రులు ఉన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇలాంటి వారిలో ముందున్న నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌, మంత్రిగా చ‌క్రం తిప్పుతున్న నేత‌.. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ఉర‌ఫ్ ఆళ్ల నాని.

భయమా.. గౌరవమా?

గ‌తంలో కాంగ్రెస్‌లోను, త‌ర్వాత వైసీపీలోనూ కొన‌సాగుతున్న ఆళ్ల నానికి..జ‌గ‌న్ అంటే అమిత‌మైన గౌర‌వం. అయితే.. దీనిని కొంద‌రు భ‌యం అని కూడా అంటున్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న మంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయాలూ తీసుకునే సాహ‌సం చేయ‌రు. అదే స‌మ‌యంలో వివాదాల‌కు చాలా దూరంగా ఉంటారు అవినీతి ర‌హిత నేత‌గా ఫీల్ గుడ్ మూవీ మాదిరిగా ఫీల్ గుడ్ లీడ‌ర్‌గా నియోజ‌వ‌క‌ర్గంలోనే కాకుండా పార్టీలోనూ ఆళ్ల నానికి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఇది వ్యక్తిగ‌తంగా ఆయ‌న ఇమేజ్‌ను, ఒక మంత్రిగా ఆయ‌న ప్రస్థానాన్ని ముందుకు తీసుకు వెళ్లలేక‌పోతున్నాయ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

కీలకమైన శాఖకు….

ముఖ్యమంత్రి చాటు మంత్రిగా ఉండాల‌నేది ఆళ్ల నాని ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంటుంది. జ‌గ‌న్ ప్రభుత్వంలో అత్యంత కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖ‌ల మంత్రిగా ఉన్న ఆళ్ల నాని ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఒక‌టి రెండు మిన‌హా ఏమీ మ‌న‌కు క‌నిపించ‌వు. కీల‌క‌మైన ఈ శాఖ‌కు నేరుగా ప్రజ‌ల‌తో సంబంధం ఉంటుంది. అదే స‌మ‌యంలో ఆరోగ్య శ్రీవంటి కీల‌క ప‌థ‌కం కూడా ఈ శాఖ ప‌రిధిలోనే ఉంది. అదే స‌య‌మంలో పేద‌ల‌కు వైద్యం అందించే ప్రజారోగ్య వైద్య శాల‌ల‌పై నిత్యం అనేక ఆరోప‌ణ‌లు, వివాదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. విశాఖ‌లో డాక్టర్ సుధాక‌ర్ కేసు, చిత్తూరులో డాక్టర్ అనితారాణి కేసు ఈ కోవ‌లోవే.

చురుకుదనం లేదని…

అదేస‌మ‌యంలో వైద్య విద్యార్థుల స‌మస్యలు కూడా ఉన్నాయి. అయినా కూడా మంత్రి ఆళ్ల నాని ఆయా విష‌యాల‌ను ప‌ట్టించుకోరు. ఏం మాట్లాడితే ఏం వివాదం అవుతుందో..? అనే భ‌యం త‌ప్ప మ‌రో ఆలోచ‌న ఆయ‌న‌లో క‌నిపించ‌దు. క‌రోనా నేప‌థ్యంలో విశాఖ ప‌ట్నంలో ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టిన‌ప్పుడు.. వైద్యుల‌కు మాస్కులు అంద‌డం లేదు.. మీరేమంటార‌ని విలేక‌రులు ప్రశ్నించినప్పుడు అంతా సీఎం చూస్తున్నారు. అని చెప్పి చేతులు దులుపుకొన్నారు. క‌రోనా స‌మ‌యంలో పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్రతి రోజు ప్రెస్‌మీట్లు పెడుతూ ఎప్పటిక‌ప్పుడు వివ‌రాలు తెలియ‌జేస్తూ ప్రజ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నాలు చేశారు. అదే స‌మ‌యంలో ఆళ్ల నాని ఏ మాత్రం చురుగ్గా వ్యవ‌హ‌రించ లేద‌న్న టాక్ వ‌చ్చింది.

కొత్త అభివృద్ధి ఏదీ?

క‌రోనా విష‌యంలో ప్రజ‌ల్లోనూ అప్పట్లో సందేహాలు రాగా.. విప‌క్షాలు పెద్ద ఎత్తున విమ‌ర్శలు చేశాయి. వీటిని కూడా ఆళ్ల నాని స‌మ‌ర్థవంతంగా తిప్పికొట్టలేక‌పోయారు. చివ‌ర‌కు సీఎం జ‌గ‌న్ క‌రోనాతో క‌లిసి జీవించక త‌ప్పద‌ని ఫ‌టాఫ‌ట్ తేల్చేశారు. దీనిని మంత్రిగా ఆళ్ల నాని ప్రమేయం ఎలా ఉంటుందో తెలుసుకోవ‌చ్చు. వివాద‌ర‌హితంగా ఉండాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ప‌ని విష‌యంలో ముందు చూపులేకుండా వ్యవ‌హ‌రించార‌నే పెద్ద నింద మోస్తున్న మంత్రిగా ఆళ్ల నాని ఈ ఏడాది కాలంలో ముద్ర వేయించుకున్నారు. అయితే, పార్టీలోను, అధినేత జ‌గ‌న్ ద‌గ్గర మాత్రం ఆయ‌న మంచి మార్కులు సంపాయించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గం ఏలూరులోనూ కొత్త అభివృద్ధి కాన‌రాదు.

Tags:    

Similar News